శరవేగంగా..!

Jun 22 2021 @ 23:21PM
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, (ఇన్‌సెట్‌లో..) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయం  
  • లిఫ్ట్‌, ఇతర పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశం 
  • తుది మెరుగులు దిద్దే పనుల్లో అధికార యంత్రాంగం 


వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవన సముదాయానికి తుది మెరుగులు దిద్దే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నేపల్లి శివారులో నిర్మించిన కలెక్టరేట్‌ భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన ప్రకృతి వనాలు, కార్యాలయం చుట్టూ విశాలమైన రోడ్లతో ఆకట్టుకుంటోంది.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లా కేంద్రం ఎన్నేపల్లి శివారులో నిర్మించిన కలెక్టరేట్‌ భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం రెండంతస్థుల్లో నిర్మించిన సమీకృత భవనంలో వంద గదులున్నాయి. వాటిని ఆయా శాఖలకు కేటాయించారు. భవనంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణం పనులు ఏ దశలో ఉన్నాయనేది స్వయంగా తెలుసుకునేందుకు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి భవన సముదాయాన్ని సందర్శించారు. లిఫ్ట్‌ పనులతోపాటు పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ను ప్రారంభింప చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


33 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్‌

ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించేందుకు 2016, అక్టోబర్‌ 11న కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్‌ ఫార్మసీ కళాశాలలో తాత్కాలికంగా కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఎన్నేపల్లి శివారులో భృంగీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎదురుగా సర్వే నెంబర్‌ 243, 244, 245ల్లో 33 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి 2017, అక్టోబర్‌ 11న జిల్లా తొలికలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ నేతృత్వంలో అప్పటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, కరోనా ప్రభావం తదితర కారణాలతో నాలుగేళ్ల్లు గడిచిపోయాయి. ప్రస్తుత కలెక్టర్‌ పౌసుమి బసు కలెక్టరేట్‌ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చొరవ చూపారు.


రూ.59 కోట్లతో నిర్మాణం

ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ.32 కోట్లు కేటాయించగా, నిర్మాణ ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి రావడంతో వ్యయం రూ.59 కోట్లకు పెరిగింది. ప్రారంభంలో  భవన నిర్మాణ పనులు వేగంగా చేపట్టినా నిధులు విడుదలలో జాప్యం కారణంగా కొంతకాలం పనులు ఆగిపోయాయి. తరువాత నిధులు విడుదలైనా పనులు జరగడంలో ఆలస్యమైంది. కలెక్టరేట్‌ ఆవరణలో రెండెకరాల్లో పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు. 


ఒకేచోట 60 శాఖల కార్యాలయాలు

60 ప్రభుత్వ శాఖలు ఒకే  ఆవరణలో ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మించారు. జీ ప్లస్‌ టూ భవనంలో వంద గదులు ఉన్నాయి. ప్రతి అంతస్థులోనూ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. 300 మందితో సమావేశం నిర్వహించే విధంగా కాన్ఫరెన్స్‌హాల్‌ ఉంది.  రూ.3.50 కోట్లతో ఫర్నిచర్‌ ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఛాంబర్లు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఛాంబర్‌, మీటింగ్‌ హాళ్లు, కలెక్టరేట్‌కు సంబంధించిన సెక్షన్లు, జిల్లా సంక్షేమాధికారి, పౌరసంబంధాలు, భూగర్భ జలవనరులు, రవాణా, వ్యవసాయ, ఐటీఈ అండ్‌ సీ శాఖల అధికారుల కార్యాలయాలు, ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, డిస్పెన్సరీ అండ్‌ ఆరోగ్యశ్రీ, డీఐవో/ఆడియో అండ్‌ సర్వర్‌రూం, ఏటీఎం/ఎల్‌డీఎం, రికార్డు రూం, క్రెచ్‌, డైనింగ్‌ హాల్‌, అటెండర్లకు గదులు కేటాయించారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, పశు సంవర్ధక, విద్యా. ఉద్యాన పట్టు పరిశ్రమ, ఎస్సీ అభివృద్ధి, ముఖ్య ప్రణాళిక, సహకార, మత్స్య, పౌర సరఫరాలు, డీఎం సివిల్‌ సప్లయిస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులు, కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇదే ఫ్లోర్‌లో మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్‌ ఏర్పాటు చేశారు. సెకండ్‌ ఫ్లోర్‌లో ఆడిట్‌, వయోజన విద్య, కార్మిక, యువజన, క్రీడలు, జాతీయ బాలకార్మిక పథకం శాఖలు, జూనియర్‌ ఉపాధి కల్పనాధికారి, గిరిజన, మైనార్టీ, బీసీ, సంక్షేమ శాఖల అధికారులు, కార్యాలయాలు, జిల్లా సంక్షేమాధికారి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఫ్లోర్‌లో డైనింగ్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ సదుపాయం కల్పించారు. మొదటి, రెండో అంతస్థుల్లో ఖాళీగా ఉన్న గదులను మిగిలిన శాఖలకు కేటాయించనున్నారు.


రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

ఆదిభట్ల : ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్యాలయంలో ఉద్యోగులకు, ఆయా పనుల నిమిత్తం వచ్చే ప్రజ లకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలన్ని కల్పించాలని ఆర్‌అండ్‌బీ అధికా రులను ఆదేశించారు. తాగునీటి వసతి, టాయిలెట్స్‌ తదితర వసతులన్నీ కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌ ఆవరణలో పూల మొక్కలు, పచ్చని చెట్లను నాటాలని జిల్లా అటవీశాఖ అధికారి జానకిరామ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కంజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు డోబ్రియల్‌, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్‌, తిరుపతిరావు, డీఆర్‌వో హరిప్రియ, ఆదిభట్ల మున్సిపల్‌ కమిషనర్‌ సరస్వతి, ఆర్‌ఆండ్‌బీ ఈఈ శ్రవణ్‌ప్రకాశ్‌, డీఈ వేణుగోపాల్‌రెడ్డి, తహసిల్దార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.