వికారాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి

ABN , First Publish Date - 2022-08-16T06:01:37+05:30 IST

వికారాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి

వికారాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి
వికారాబాద్‌లో జాతీయ జెండాను ఎగుర వేస్తున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు

  •  శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ 
  •    పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు 
  •   ఆకట్టుకున్న స్టాల్స్‌, శకటాలు..

వికారాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : బంగారు తెలంగాణ సాధనలో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేలా అందరూ తమవంతు పాత్ర పోషించాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్‌ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం  వికారాబాద్‌ జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో దేశభక్తి భావన, స్వాతంత్య్ర స్పూర్తి మేల్కొలిపే విధంగా రాష్ట్రంలో సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా స్వాతంత్య్ర వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ఈనెల 22వ తేదీన జిల్లా కే ంద్రంలో వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు, దేశ భక్తులు కలలుగన్న భారతావనిని నిర్మించుకునేందుకు అందరం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 15,260 మంది గర్భిణులకు సేవలందించనగా, వారిలో 11,070 మంది  ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయన్నారు. హరితహారం కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 38.67 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటి వరకు 292.70 ఎకరాల్లో 28.19 లక్షల మొక్కలు నాటారన్నారు. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 1,98,162 నల్లాలను బిగించి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సాగయ్యే మొత్తం కంది పంట దిగుబడిలో మన జిల్లా నుంచే 44 శాతం పంట ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. జిల్లాలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 11,866 మంది లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలకు 45,82,140 పని రోజులు కల్పించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపామని చెప్పారు.  వీధి వ్యాపారులకు రూ.6.66 కోట్ల రుణాలు అందించారని తెలిపారు. మోమిన్‌పేట్‌, కులకచర్ల మండలాల్లో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ టీఎస్‌ సెర్ప్‌ ఆధ్వర్యంలో పూర్తిగా మహిళా రైతులు నిర్వహిస్తున్నారు. అనంతగిరిహిల్స్‌లో రూ.2.80 కోట్లతో నూతన అతిథి గృహ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయనిచెప్పారు.  జిల్లా అన్ని రంగాల్లో సమగ్రావృద్ధి సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కంకణబద్ధులు కావాలని ఆయన కోరారు. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌరవవందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు  ఆనంద్‌, మహే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డి,  శుభప్రద్‌ పటేల్‌, కలెక్టర్‌ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌,  మురళీకృష్ణ,  మంజులా రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 8 మంది అధికారులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.

Updated Date - 2022-08-16T06:01:37+05:30 IST