విలీనం సరే.. ఖాళీల మాటేమిటి!?

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

ప్రాథమిక పాఠశాలల విలీనం కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తుండటంతో విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి.

విలీనం సరే..  ఖాళీల మాటేమిటి!?
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు(ఫైల్‌)

197 ప్రాథమిక పాఠశాలల మార్పు

1:20 కాదు.. 1:30 నిష్పత్తిన బోధన

పనిభారం పెరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల గగ్గోలు

ఖాళీ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం


నెల్లూరు (విద్య), జనవరి 1 : ప్రాథమిక పాఠశాలల విలీనం కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తుండటంతో విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. ప్రాఽథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:20 అంటే 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు బోధన జరపాల్సి ఉంటుంది. అయితే తాజాగా 1:30 నిష్పత్తిగా ప్రభుత్వం మార్చడంతో కొత్త పోస్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉన్న ఉపాధ్యాయులపై తీవ్ర భారం పడనుంది.


దశలవారీగా విలీనం..

ప్రాఽథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే ఎన్‌ఈసీ ప్రతిపాదనల మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత 250 మీటర్ల పరిధి తీసుకోగా, తాజాగా కిలోమీటరు పరిధి మేరకు 197 ప్రాథమిక పాఠశాలల జాబితాను సిద్ధం చేశారు. వీటిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 184 ఎంపీపీ పాఠశాలలను 173 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో,  12 మునిసిపాలిటీ ప్రాఽథమిక పాఠశాలలను 10 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయగా వీటిలో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 15,541 మంది ఉన్నారు. ఈ ప్రక్రియలో అన్ని వసతులున్న జడ్పీ ఉన్నత పాఠశాలలకు 49 ప్రైమరీ పాఠశాలలను విలీనం చేయగా మిగిలిన ప్రాధమిక పాఠశాలలు ప్రస్తుతం ఉన్న చోటనే నిర్వహిస్తున్నారు. అయితే, ఈ విలీన ప్రక్రియలో భాగంగా రెండు కిలీమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను కూడా మున్ముందు విలీనం చేసేలా పావులు కదుపుతున్నారు. ప్రాథమిక తరగతులను దూరం చేయడం వల్ల పేద విద్యార్థులు అత్యధిక శాతం మంది చదువులకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 


ఉపాధ్యాయుడు సెలవు పెడితే..

ప్రాథమిక తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం తర్వాత మొత్తం 8 తరగతులు అయ్యాయి. విద్యాశాఖ సూచనల మేరకు కనీసం 9 మంది ఉపాధ్యాయులు పనిచేయాలి. ఈ లెక్కన తరగతికి ఒక ఉపాఽధ్యాయుడు బోధనలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. అయితే ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే ఏంచేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఖాళీ పోస్టుల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించాలన్న ప్రతిపాదనలు కూడా అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో బోధన సిబ్బందిని ఎలా సర్దుబాటు చేస్తారన్న అంశాలపై కూడా స్పష్టత లేదు. మరోవైపు ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:30గా పేర్కొన్నా సెక్షన్ల విషయంలో మాత్రం 59 మంది విద్యార్థులు దాటితేనే మరో సెక్షన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేయాల్సి ఉంటుంది. జిల్లాలో విలీన పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు మొత్తం 2,112  మంది ఉపాధ్యాయులు అవసరం కాగా వీరిలో ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో 1,814 మంది ఉపాధ్యాయులు ఉండగా మరో 298 మంది అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కూడా ప్రాథమిక పాఠశాలల్లోని 180 ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు సర్ధుబాటు చేశారు. దీంతో మరో 118 మంది అవసరం ఉన్నట్లు తేల్చారు. వీటిని ఎలా భర్తీ చేస్తారో మాత్రం స్పష్టత లేదు. 


ఖాళీల భర్తీ జరిగేనా..

ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే టీచర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ జరుగుతుందా లేదా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌, ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయానని సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్‌ఈపీ అమలులో కొత్త మార్పులు రావడంతో ఈ సారైనా పోస్టుల భర్తీ చేపట్టి, బోధనా సిబ్బంది లోటును తీరుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST