దందాలు చేస్తున్న విలేకరుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-02-27T05:33:36+05:30 IST

విలేకరుల ముసుగులో అక్రమదందాలు కొనసాగిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విలేకర్లపై సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

దందాలు  చేస్తున్న విలేకరుల అరెస్ట్‌

రిమాండ్‌కు తరలింపు.. కల్లూరు ఏసీపీ వెంకటేష్‌

సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 26: విలేకరుల ముసుగులో అక్రమదందాలు కొనసాగిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విలేకర్లపై సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన కఠారి పుల్లారావు బుధవారం రాత్రి సమయంలో 10క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో స్థానిక బైపాస్‌ రోడ్‌ వైపుగా తరలిస్తుండగా కొందరు ఆటోను అడ్డగించి తాము విలేకరులమని, మాకు రూ.30వేలు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకుంటే నీ అంతు చూస్తామని తన నుంచి రూ.24వేల నగదు, స్మార్ట్‌ఫోన్‌ లాక్కుని మిగిలిన రూ.6వేల ఇచ్చి మొబైల్‌ తీసుకెళ్లమని పుల్లారావు ఫిర్యాదు చేశాడు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి ధర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. 


నలుగురు విలేకర్లు రిమాండ్‌కు


వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న తడికమళ్ల అప్పారావు, చింతోజు రమేష్‌చారీ,  ఐదుపాలాపాటి కృష్ణ, కొమరారపు వాసుదేవ అలియాస్‌ వాసుగా గుర్తించి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.


ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఏసీపీ


విలేకర్ల ముసుగులో అక్రమదందాలతో అందిన కాడికి దండుకోవడం రివాజుగా మారిందనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి చట్టవిరుద్దంగా చర్యలను ఉపేక్షించేది లేదని ఏసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు. కొంతమంది నకిలీ విలేకర్లు ప్రముఖ దినపత్రికల్లో, న్యూస్‌ ఛానళ్లలో పనిచేసే పాత్రికేయుల పేర్లు వాడుకోవడంతో పాటు తాము డివిజన్‌, జిల్లా స్థాయి విలేకర్లమంటూ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్యాలయాల్లో అధికారులను బ్లాక్‌మెయిల్‌చేస్తూ వసూళ్ల భాగోతానికి పాల్పడుతున్నట్లు ప్రముఖ పత్రికలు, న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్లు వాపోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా విలేకరులు కాని కొంతమంది ద్విచక్ర వాహనం, కార్లకు ప్రెస్‌ స్టిక్కర్లు అంటించుకుని నకిలీ ఐడీకార్డులు తయారు చేసుకుని అక్రమదందాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, విచారణ చేపట్టి చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారంలో బియ్యం తరలిస్తున్న ఆటోను, బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు స్వాధీనం చేయడం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదుచేసి సీఐ రమాకాంత్‌ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-02-27T05:33:36+05:30 IST