గ్రామం.. వలసెల్లిపోతోంది !

ABN , First Publish Date - 2021-07-25T04:34:20+05:30 IST

వందేళ్ల క్రితం ఆ గ్రామం జనంతో కళకళలాడుతూ ఉండేది. చుట్టూ ఉప్పునీటి సరస్సు. అందులో తెరచాప పడవల విన్యాసాలు.. పచ్చటి పొలాలతో ఆ ఊరు ఎంతో అందంగానూ ఉండేది.

గ్రామం.. వలసెల్లిపోతోంది !
తిరువెంకటనగర్‌ కుప్పం గ్రామం వ్యూ

వందేళ్ల క్రితం జనంతో కళకళలాడిన ఊరు

తాగు, సాగు నీటి వసతి ఉన్నా మిగతావి మృగ్యం

అందుకే తిరువెంకటనగర్‌ కుప్పం వలస బాట


తడ, జూలై 24 : వందేళ్ల క్రితం ఆ గ్రామం జనంతో కళకళలాడుతూ ఉండేది. చుట్టూ ఉప్పునీటి సరస్సు. అందులో తెరచాప పడవల విన్యాసాలు.. పచ్చటి పొలాలతో ఆ ఊరు ఎంతో అందంగానూ ఉండేది. ఆ గ్రామానికి దగ్గరలోని మరో గ్రామస్థులు వలస రావడంతో మరింత కళగా మారింది.  కాలక్రమేణా ఆ గ్రామం పంచాయతీగా మారింది.  అయితే ఏళ్లు గడిచినా సౌకర్యాలు లేకపోవడంతో ఒక్కొక్కరుగా  గ్రా మాలను వదిలేయడం మొదలుపెట్టారు. నేడు  ఆ పంచాయ తీలోని ఒక గ్రామం ఊరు విడిచి వలసకు బయలుదేరింది.  ఆ గ్రామమే తిరువెంకటనగర్‌ కుప్పం.

తడ మండలంలో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సులో ఉండేది ఇరకందీవి. దీవిలో  1900లో సుమారుగా 800 కుటుంబాలు నివాసం ఉండేవి. మొదలియార్‌లతోపాటు అన్ని కుల వృత్తుల వారు, మత్స్యకారులు నివాసం ఉండేవారు. సరస్సులో ఉప్పునీరున్నా స్వచ్ఛమైన  భూగర్భ జలాలు దొరికేవి. ఫలితంగా తాగు, సాగు నీటి సమస్య ఉండేది కాదు.  సుమారు 2వేల ఎకరాల్లో వ్యవసాయం చేసేవారు. 1903లో గ్రామంలో ఏర్పాటైన పాఠశాలలో వందలసంఖ్యలో విద్యార్థుల కు తమిళభాషలో విద్యను బోధించేవారు.  


వలస వచ్చిన పెద్దవడకోడికుప్పం 


ఇరకందీవికి శ్రీహరికోట దీవి మఽధ్యలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పెద్దవడకోడికుప్పం అనే దీవి ఉండేది. అప్పట్లో అక్కడ సుమారు 40 వరకు మత్స్యకార కుటుంబాలు జీవిస్తుండేవి. ప్రకృతి  వైపరీత్యాలు, తుఫానల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ గ్రామస్థులు గ్రామం విడిచి  ఇరకం దీవిలోని దక్షిణప్రాంతం మొనకుప్పంకి వలస వచ్చారు.  తమ గ్రామానికి పాళెంతోపుకుప్పంగా పేరు పెట్టుకున్నారు. కా లక్రమేణా మొనకుప్పం, పాళెంతోపు కుప్పాలు కలిపి తిరువెంకటనగర్‌ కుప్పంగా మారిపోయాయి. 


కష్టాలతో ప్రయాణం 


 రోజులు గడిచే కొద్దీ గ్రామస్థులకు బయటకు వెళ్లే అవసరాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడసాగారు. మద్రాసు (చెన్నై) సమీప ప్రాంతాలకు చదువుల కోసం పడవల్లో పిల్లల ను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.  చుట్టుపక్కల ప్రాంతా ల్లోని గ్రామాల్లో అన్ని వసతులు అందుబాటులోకి వస్తున్నా తమ గ్రామానికి కనీసం కరెంట్‌ సైతం లేకపోవడంతో అక్కడి వారు కొంత ఆలోచనలోపడ్డారు. దీంతో 1980 నుంచి ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడవటం ప్రారంభించారు. 1990లో వలసల నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలని భావించిన  గ్రామపెద్దలు మోటారు పడవను ఏర్పాటు చేసి దానిని విద్యార్థుల కోసం వినియోగించారు. 1992లో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి దృష్టికి  దీవి సమస్యలను తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి గ్రామానికి విద్యుత వెలుగులను తీసుకువచ్చారు. అప్పటి నుంచి నేటి వరకూ మరో సౌకర్యం ఆ గ్రామానికి చేరలేదు. 


వలస దిశగా తిరువెంకటనగర్‌కుప్పం 


రోజులు గడుస్తున్నకొద్దీ మత్స్యకార కుటుంబాల్లో మార్పులు రావడం ప్రారంభమైంది. వారి పిల్లలు, చదువులకు ప్రాధాన్యం ఇవ్వడం,  వేటమానేసి ఉద్యోగాల వైపునకు ఆక ర్షితులవడం మొదలైంది.  అలాగే సరస్సులో మత్స్యసంపద అరకొరగా దొరుకుతుండటంతో కుటుంబపోషణ భారంగా మారింది. ఆయా కుటుంబాల్లో కొందరు తమసాంప్రదాయ వృత్తిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. గుమ్మడిపూడి, రెడ్‌హిల్స్‌, శ్రీసిటీలోని పరిశ్రమల్లో కూలి పనులకువెళ్తూ కుటుంబాలను నెట్టుకోస్తున్నారు. ఇళ్లనుంచి పరిశ్రమలకు వెళ్లివచ్చే సమయాలలో పడవ ప్రయాణం సమయానుకూ లంగా అందుబాటులో ఉండకపోవడంతోపాటు కరోనా లాక్‌డౌన సమయంలో ఆ ప్రయాణ ఖర్చులు మరింత ఎక్కు వయ్యాయి. దీంతో విసిగిపోయిన తిరువెంకటనగర్‌కుప్పం వాసులు వలసబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. 


 జనార్దనరెడ్డి హయాంలో..

మా పెద్దవాళ్లకి మా గ్రామం అంటే ఎంతో మక్కువ. నేను అక్కడే పుట్టి పెరిగా. నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చలవతో మా ఊరికి కరెంట్‌ వచ్చింది. ప్రయాణపు కష్టాలతో నేను సూళ్లూరుపేటకు వచ్చేశాం. రాబోయే రోజుల్లో ఊరు ఖాళీ అయిపోతుందని చెప్పి బాధగా ఉంది. 

-ముత్తుముద్దుకృష్ణ మొదలియార్‌, ఏఎంసీ  మాజీ చైర్మన, సూళ్లూరుపేట :


ఎప్పుటికైనా వెళ్లాలని ఉంది.

పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడానికి మనసు రా లేదు. కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సూళ్లూరుపేటకు వచ్చేశాం. ఎప్పటికైనా రోడ్డు సౌకర్యం కల్పిస్తే గ్రామానికి వెళ్లిపోవాలని  ఉంది.

-కోలూరు మునివేలు మొదలియార్‌





Updated Date - 2021-07-25T04:34:20+05:30 IST