
నిడమర్రు: చేయూత పథకంలో లంచం ఇవ్వలేదని వలంటీర్ కుటుంబం దౌర్జన్యం చేసిందంటూ నిడమర్రు మండలం దేవరగోపవరానికి చెందిన కాకరాల విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయకుమారికి గత ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.18వేల ఆర్థిక సాయం మంజూరైంది. బదులుగా వలంటీర్ కాకరాల జయమణి రూ.5 వేలు లంచం డిమాండ్ చేసినట్లు కుమారి ఆరోపించారు. లంచం ఇవ్వలేదని వలంటీరు తమకు ఈ ఏడాది వైఎస్ఆర్ చేయూత రాకుండా చేసిందన్నారు. ఈ విషయమై కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.
బుధవారం ఉదయం వలంటీరు కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసి కారం చల్లి ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సంఘటనలో తనతో పాటు భర్త, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వైద్యం కోసం కుమారుడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, భర్తను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై నిడమర్రు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విజయకుమారి గురువారం విలేకరులకు తెలిపారు. ఇదిలావుండగా విజయకుమారి కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని వలంటీర్ కుటుంబ సభ్యులు కూడా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు నిడమర్రు పోలీసులు తెలిపారు.