అడుగుకో గుంత!

ABN , First Publish Date - 2021-11-11T02:27:12+05:30 IST

కావలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అడుగుకో గుంత ఏర్పడి నరకానికి నకళ్లుగా మారాయి. ఈ రోడ్లపై తట్టడు మట్టి వేసే వారులేక దుస్థితికి చేరాయి.

అడుగుకో గుంత!
ఉదయగిరి పట్టణంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు

ఆర్‌అండ్‌బీ రోడ్లు నరకానికి నకళ్లు 

కావలి, నవంబరు 10: కావలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అడుగుకో గుంత ఏర్పడి నరకానికి నకళ్లుగా మారాయి. ఈ రోడ్లపై తట్టడు మట్టి వేసే వారులేక దుస్థితికి చేరాయి. ఈ రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పైగా అధిక గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవటంతో ఎక్కువ మంది ఆటోలపై ఆధారపడుతారు. ఈ ఆటోలు ఆదమరిస్తే గుంతల్లో బోల్తాపడుతున్నాయి. కావలి పట్టణం నుంచి తుమ్మల పెంట తీరం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు  దారుణంగా ఉంది. ఆ రోడ్డు అభివృద్ధికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా నేటికీ నిర్మాణ పనులు చేపట్టలేదు. బోగోలు మండలం నాగులవరం, తాళ్లూరు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. దగదర్తి మండలంలో దగదర్తి నుంచి చెన్నూరు మీదుగా బుచ్చిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రోడ్డుకు నిధులు మంజూరై పనులు ప్రారంబించినప్పటికీ వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇలాంటి ఉదాహరణలు నియోజకవర్గంలో కోకొల్లలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రోడ్లపై ఎక్కడా తట్టడు మట్టి వేసిన పాపాన పోనందున ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో రోడ్లపై పడిన గుంతలను పూడ్చేందుకు మైలు కూలీలు ఉండేవారు. వారు తమ పరిధిలో ఎక్కడ గుంతపడితే అక్కడ వెంటనే పూడ్చటం రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం మెలు కూలీలు లేకపోవటంతో రోడ్లు అనతి కాలంలోనే దెబ్బతింటున్నాయి.

ఉదయగిరి : ఉదయగిరి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపానపోలేదు. ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్లే మార్గంలో నందవరం వరకు 30 కిలో మీటర్లు రోడ్డు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. అలాగే ఉదయగిరి పట్టణంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కుర్రపల్లి, ఆర్లపడియ, పెద్దిరెడ్డిపల్లి, బిజ్జంపల్లి, గండిపాళెం, జడదేవి. రంగనాయుడుపల్లి, బాలాయిపల్లి తదితర ప్రాంతాల రోడ్లు ఆధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోలేదు.

కలిగిరి : మండలంలో కలిగిరి నుంచి కావలి, ఉదయగిరి, నెల్లూరు, కొండాపురం వెళ్లే నాలుగు మార్గాల్లో ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, కలిగిరి మార్గాల్లో రహదారులు ఇటీవల వర్షాలకు అడుగుకోగుంత పడింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కనీస మరమ్మతులు కూడా నిర్వహించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Updated Date - 2021-11-11T02:27:12+05:30 IST