Vinod Kambli : ఆర్థిక కష్టాల్లో సచిన్ తెందుల్కర్ బాల్యమిత్రుడు.. సచిన్‌ నుంచి ఏమీ ఆశించడం లేదని నిట్టూర్పు

ABN , First Publish Date - 2022-08-17T20:05:33+05:30 IST

క్రికెట్‌ లెజెండ్ సచిన్ తెందుల్కర్(sachin tendulkar) బాల్యమిత్రుడు, టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడు.

Vinod Kambli : ఆర్థిక కష్టాల్లో సచిన్ తెందుల్కర్ బాల్యమిత్రుడు.. సచిన్‌ నుంచి ఏమీ ఆశించడం లేదని నిట్టూర్పు

ముంబై : క్రికెట్‌ లెజెండ్ సచిన్ తెందుల్కర్(sachin tendulkar) బాల్యమిత్రుడు, టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. క్రికెట్ సంబంధిత పని కోసం ఎదురుచూస్తున్నట్టు తన ధీనస్థితిని వివరించాడు. ప్రస్తుతం బీసీసీఐ(BCCI) ప్రతినెలా అందిస్తున్న రూ.30 వేల పెన్షన్ ఒక్కటే తన ఆదాయ మార్గమని చెప్పాడు. బాల్యమిత్రుడు సచిన్ తెందుల్కర్‌కి విషయం తెలియదా అని ప్రశ్నించగా.. తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆయనకు అంతా తెలుసునని కాంబ్లీ చెప్పాడు. కానీ అతడి నుంచి నేనేమీ ఆశించడం లేదన్నాడు. తెందుల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీలో మెంటార్‌గా పని అప్పగించింది ఆయనేని గుర్తుచేసుకున్నాడు. ఆ విషయంతో చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని చెప్పాడు. సచిన్, తానూ చాలా మంచి స్నేహితులమని, ఆయనెప్పుడూ నా కోసం సిద్ధంగా ఉంటారని ఫ్రెండ్‌ని వెనుకేసుకొచ్చాడు.


కాగా ముంబైలోని తెందుల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీలో యువక్రికెటర్లకు మెంటార్‌గా పనిచేసిన కాంబ్లీ.. చివరిసారిగా ‘2019 టీ20 ముంబై లీగ్‌’ సమయంలో కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. కొవిడ్ అనంతర పరిస్థితులు  అతడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. క్రికెట్ అకాడమీ తన ఇంటికి దూరంగా ఉండడం కూడా కాంబ్లీకి ఇబ్బందికరమయ్యింది. ‘‘ ఉదయం 5 గంటలకే నిద్రలేచి క్యాబ్ సాయంతో డీవై పాటిల్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఇలా చేయడం చాలా కష్టం. కానీ అలాచేస్తేనే బీకేసీలో (Bandra Kurla Complex Ground) సాయంత్రం కోచింగ్ ఇవ్వగలిగేవాడిని’’ అని కాంబ్లీ వివరించాడు. ‘‘ నేను రిటైర్డ్ క్రికెటర్‌ని కాబట్టి బీసీసీఐ నుంచి పెన్షన్ అందుతోంది. ఈ డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.  ఇందుకు బీసీసీఐకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ’’ అని కాంబ్లీ వివరించాడు. 


‘‘ ఎంసీఏ(ముంబై క్రికెట్ అసోసియేషన్) నుంచి సాయం కోరుతున్నాను. సీఐసీ(క్రికెట్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ) సభ్యుడిగా ఉన్నాను. కానీ అది కేవలం గౌరవ హోదా మాత్రమే. నేను కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉంది. వాంఖడే స్టేడియం లేదా బీకేసీ స్టేడియాల్లో అవసరముంటే నన్ను పరిగణలోకి తీసుకోవాలని కోరాను. ముంబై క్రికెట్ నాకెంతో ఇచ్చింది. క్రికెట్‌కే నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించాను. కానీ రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌ ఉండదు కాబట్టి. దీనికి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే బాగుంటుంది. ఎంసీఏ నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. నేను చేయగలిగిందంతా ఎంసీఏ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీలకు విజ్ఞప్తి చేయడం ఒక్కటే’’ అని చెప్పాడు. కాగా వినోద్ కాంబ్లీ భారత్ తరపున మొత్తం 104 వన్డే మ్యాచ్‌లు, 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 3561 పరుగులు చేయగా ఇందులో 4 టెస్ట్, 2 వన్డే శతకాలు ఉన్నాయి. 1991 నుంచి 2000 మధ్యకాలంలో భారత్ తరపున ఆడాడు.

Updated Date - 2022-08-17T20:05:33+05:30 IST