Vinodkumar: టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ

ABN , First Publish Date - 2022-10-06T21:11:38+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం కలిసింది.

Vinodkumar: టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ

ఢిల్లీ (Delhi): కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinodkumar) బృందం కలిసింది. టీఆర్ఎస్ (TRS) పేరును భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరుగా మార్చుతూ నిన్న పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీఈసీ(CEC)కి తెలిపారు. భారత్ రాష్ట్ర సమితి పేరును నమోదు చేయాలని వినతి చేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా చేసిన తీర్మాన కాపీ, కేసీఆర్‌ లేఖను అందజేశారు. అనంతరం వినోద్ కుమార్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలోపు పేరు మారితే బిఆర్ఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళతామని, లేని పక్షంలో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తామని స్పస్టం చేశారు.

 

పార్టీ తీర్మానం కాపీని సీఈసీ డిప్యూటీ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు అందజేశామని, సీఈసీ త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వినోద్ కుమార్ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29ఎ ప్రకారం.. ఒక రాజకీయ పార్టీ పేరు మార్చుకోవచ్చునని, టీఆర్‌ఎస్‌ పేరును మాత్రమే బిఆర్‌ఎస్‌గా మార్చామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన తన పార్టీ పేరు, అడ్రస్‌ మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-10-06T21:11:38+05:30 IST