ఫోర్జరీ సంతకంతో రిజిస్ర్టేషన్‌కు యత్నం

ABN , First Publish Date - 2021-01-22T06:05:29+05:30 IST

వినుకొండలో రెండుమూడు నెలలుగా రియల్‌ వ్యాపారం జోరందుకోవడంతో కొందరు అక్రమార్కుల స్థలాలపై కన్నేశారు.

ఫోర్జరీ సంతకంతో రిజిస్ర్టేషన్‌కు యత్నం
ఫోర్జరీ సంతకంతో రిజిస్ర్టార్‌ కార్యాలయానికి ఇచ్చిన సర్టిఫికెట్‌

బదిలీపై వెళ్లిన తహసీల్దారు సంతకం.. తేదీ ప్రస్తుతం

సబ్‌రిజిస్ర్టార్‌ సూచనతో పోలీసులకు తహసీల్దారు ఫిర్యాదు 


వినుకొండ టౌన్‌, జనవరి 21: వినుకొండలో రెండుమూడు నెలలుగా రియల్‌ వ్యాపారం జోరందుకోవడంతో కొందరు అక్రమార్కుల స్థలాలపై కన్నేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను రిజిస్ర్టేషన్లు చేయించి మరొకరికి కట్టబెట్టేందుకు పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలో వినుకొండ సీతయ్యనగర్‌లో సర్వే నంబరు 338/1, డో.నెం.29-2485 నంబరుతో సుమారు 82.69 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన దాసరి సీత, భర్త రవికుమార్‌ ప్రయత్నించారు. ఇందుకు తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి పొజిషన్‌ సర్టిఫికెట్‌ సృష్టించారు. దాని ఆధారంగా ఈ నెల 16న రిజిస్ర్టేషన్‌కు దాఖలు చేశారు. దీంతో ఆయా డాక్యుమెంట్లను ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌ కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించగా పోర్జరీ సంతకం వ్యవహారం వెలుగుచూసింది. గతంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన తహసీల్దారు వెంకటేశ్వర్లు సంతకం దాని కింద ఈ నెల 11న ఆ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ఉంది. దీంతో కృష్ణమోహన్‌ ఆ సర్టిఫికెట్‌ను తహసీల్దారు కార్యాలయానికి పంపించారు. దానిని పరిశీలించిన ప్రస్తుత తహసీల్దారు అనిల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


పోలీసుల తీరుపై అనుమానాలు


ఫోర్జరీ సంతకంపై 19న తహసీల్దారు ఫిర్యాదు చేసినా దీనిపై పోలీసులు రెండు రోజులుగా మౌనంగా ఉన్నారు. కేసు నమోదు కాలేదని చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. దాసరి సీత, భర్త రవికుమార్‌ పొందిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ తమ కార్యాలయం నుంచి పొందింది కాదని, నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-01-22T06:05:29+05:30 IST