రైతు దోపిడీ కేంద్రాలుగా ఆర్‌బీకేలు

ABN , First Publish Date - 2022-05-22T05:53:24+05:30 IST

రైతుకు భరోసా కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలు (రైతుభరోసా కేంద్రాలు) రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

రైతు దోపిడీ కేంద్రాలుగా ఆర్‌బీకేలు

 పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు 


వినుకొండ, మే 21 : రైతుకు భరోసా కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలు (రైతుభరోసా కేంద్రాలు) రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతుంటే ధాన్యం కొనుగోలులో క్వింటాకు రూ.200లు దోచుకుంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. మిల్లర్లు, రైతుల మధ్య వైసీపీ నాయకులు దళారులుగా తయారై ధాన్యం కొనుగోలులో వ్యత్యాసాలు చూపుతూ రైతన్నలకు అన్యాయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయమై సాక్షాత్తు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఆరోపించారన్నారు.

సీపీఎం సీనియర్‌ నాయకుడు షేక్‌ మదార్‌వలిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అమానుషంగా దూషించడం దుర్మార్గమని వెంటనే మదార్‌వలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత వారం రోజుల క్రితం పట్టణంలోని ఇందిరానగర్‌లో 16 గంటలు కరెంటు లేకపోవడం వలన చిన్నారులు, విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఈ విషయాన్ని మదార్‌వలి ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యే బొల్లాకు వివరించగా స్పందించకపోగా పరుషపదజాలంతో దూషించడం విడ్డూరమన్నారు. ప్రజాసమస్యల పట్ల నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించాలి తప్ప ఇలాంటి దూషణలకు దిగడం సరికాదన్నారు.

మహానాడును జయప్రదం చేయండి....

ఈ నెల 27వ తేదీ నుంచి ఒంగోలులో జరిగే టీడీపీ మహానాడును ప్రజలు జయప్రదం చేయాలని  కోరారు. 27వ తేదీన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం ఉంటుందని, జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. 28వ తేదీన వినుకొండ నుంచి ఒంగోలు వరకు మోటారు సైకిళ్ల ర్యాలీ ఉంటుందని పార్టీ కార్యకర్త, నాయకులు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని, వినుకొండ నియోజకవర్గం టాప్‌ -7లో ఉందని, పల్నాడు జిల్లా కూడా రాష్ట్రంలో మొదటిస్థానంలో వచ్చేలా సభ్యత్వ నమోదు చేయించాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. 

Updated Date - 2022-05-22T05:53:24+05:30 IST