శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: టీటీడీ

ABN , First Publish Date - 2022-02-26T02:12:07+05:30 IST

సామాన్య భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనంలో మరింత ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.

శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: టీటీడీ

తిరుమల: సామాన్య భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనంలో మరింత ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. శుక్రవారం వారాంతపు సేవైన అభిషేకం జరిగే క్రమంలో ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గురువారం సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. కాగా, కరోనా తర్వాత శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో శని, ఆదివారాల్లో కూడా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో సిఫార్సు లేఖలను ఇకపై స్వీకరించరు. ఈ నిర్ణయం ద్వారా వీఐపీలకు కేటాయించే సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించవచ్చని టీటీడీ భావిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. ఇప్పటికే రోజుకు 30 వేల టోకెన్లను కేటాయిస్తోంది. సిఫార్సు లేఖల ద్వారా ఇచ్చే వీఐపీ బ్రేక్‌ను రద్దు చేయడం ద్వారా దాదాపు రెండు గంటల దర్శన సమయం సామాన్య భక్తులకు లభిస్తుందని టీటీడీ చెబుతోంది.

Updated Date - 2022-02-26T02:12:07+05:30 IST