దుర్గంలో రావణకాష్టాన్ని రగిలిస్తున్న విప్‌ కాపు

ABN , First Publish Date - 2021-01-22T05:50:06+05:30 IST

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో రావణకాష్టాన్ని రగిలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

దుర్గంలో రావణకాష్టాన్ని రగిలిస్తున్న విప్‌ కాపు
విలేకరులతో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

మాజీ మంత్రి కాలవ


రాయదుర్గం, జనవరి 21: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో రావణకాష్టాన్ని రగిలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు ఎన్నికైన నాటి నుంచి రెండో ఆలోచన లేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడటంతో పాటు అవకాశం ఉన్నచోటంతా దౌర్జన్యాలను పురిగొల్పుతున్నారన్నారు. అక్రమార్జనే ధ్యే యంగా అరాచక పనితీరును కనబరుస్తున్న ఎమ్మెల్యేల్లో కాపు అగ్రభాగంలో నిలిచారని విమర్శించారు. రాయదుర్గం ప్రజల మనస్తత్వానికి సరిపడని దృశ్యా లు ఇటీవల చూడాల్సి వస్తోందన్నారు. పట్టణంలో వైసీపీ కార్యాలయం వెనుక కిషోర్‌ ఇల్లు కడుతుంటే నిర్మాణాలను ఆపించి తనకు అమ్మాలని వెంటపడిన సంఘటనను వివరించారు. డీ హీరేహాళ్‌ మండలం పులకుర్తి గ్రామంలో రైతు రామాంజినేయులు పొలం లో దౌర్జన్యం చేశారన్నారు. అలాగే నేమకల్లు గ్రామంలోని కాపు రామచంద్రారెడ్డి క్వారీలో అక్రమ బ్లాస్టింగ్‌లపై నిలదీస్తే అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. డీ హీరేహాళ్‌ మండలంలో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న క్రషర్లను అధికారంలోకి రాగానే రెండు, మూడు నెలల పాటు మూత వేయించారన్నారు.


స్పాంజ్‌ ఐరన పరిశ్రమలపై పోలీసులను అడ్డుపెట్టుకుని వేధించారన్నారు. కప్పం కడితే యథావిధిగా నడిపించుకునే పరిస్థితికి తెచ్చారన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడితే ఎవరిని నమ్ముకోవాలన్నారు. చదం వద్ద ఉన్న క్రషర్‌లో పరిగెత్తించి కొట్టి వారిని హింసించిన ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఏదో రూపంలో లోబరుచుకునేందుకు బెదిరించి అరాచకం సృష్టిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని నిలదీశారు. కాపు చేయించే దౌర్జన్యాల వెనుక ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అండగా నిలబడితే ధైర్యంగా వ్యాపారస్తులు ఎలా వుంటారని ప్రశ్నించారు. రాజకీయపరమైన జోక్యం వున్నప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స వ్యవస్థ ద్వారా సమాచారం తెప్పించుకుని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వీరి అరాచకాలను అడ్డుకోకపోతే ప్రజలే రోడ్డెక్కి అడ్డుకుంటారన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే సీఎం జగన విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాపు రామచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు రాఘవరెడ్డి, టంకశాల హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:50:06+05:30 IST