వీఐపీల హోరు

ABN , First Publish Date - 2021-04-08T06:58:45+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపధ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన ముఖ్య నేతల ప్రచార పర్యటనలతో తిరుపతి నగరం హోరెత్తుతోంది.

వీఐపీల హోరు

 అన్ని పార్టీల తరపునా రంగంలోకి అగ్రనేతలు


నేడు తిరుపతికి చంద్రబాబు రాక


తిరుపతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపధ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన ముఖ్య నేతల ప్రచార పర్యటనలతో తిరుపతి నగరం హోరెత్తుతోంది. ఈ నెల 17 పోలింగ్‌ జరగనుండడం,15వ తేదీనే ప్రచారం ముగియనుండడంతో ఇపుడిపుడే ఆయా పార్టీలకు చెందిన వీఐపీల రాక కూడా పెరుగుతోంది. ఉప ఎన్నికలకు గత నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపధ్యంలో ప్రారంభంలోనే తిరుపతి నగరంలో టీడీపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోడ్‌షోలు నిర్వహించారు. అభ్యర్థి పనబాక లక్ష్మితో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపై పార్టీ యువనేత నారా లోకేశ్‌ సైతం నగరంలో రోడ్‌షో, ఇంటింటి ప్రచారాలు నిర్వహించడంతో పాటు ఎన్నికల సభలోనూ పాల్గొన్నారు. బీజేపీ విషయానికొస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ నేతలు సత్యకుమార్‌, సునీల్‌ దియోధర్‌, పురంధేశ్వరి తదితరులు ఇదివరకే నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం రోడ్‌షోలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా నగరంలో రోడ్‌ షో, ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తాజాగా బుధవారం కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, జాతీయ మీడియా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తిరుపతి చేరుకున్నారు. సీపీఎం అభ్యర్థి తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుతో పాటు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సైతం నగరంలో పర్యటించి వెళ్ళారు. మరోవైపు నేడు టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి రానున్నారు. ఆయన ఈనెల 14న తిరుపతిలో పర్యటించి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. అదే రోజు సీఎం జగన్‌ కూడా వైసీపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారానికి తిరుపతికి వస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు హైదరాబాదు నగర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ దాస్‌ తదితరులు కూడా రానున్న వారం రోజుల్లో తిరుపతిలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. వీరితో పాటు కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాను కూడా రప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరోమారు కూడా తిరుపతి వచ్చే అవకాశాల్లేక పోలేదు. ఇలా రానున్న వారం రోజుల్లో వీఐపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నందున ఎన్నికల ప్రచారంతో నగరం మరింత హోరెత్తిపోనుంది.

Updated Date - 2021-04-08T06:58:45+05:30 IST