Viral Video: కెమెరాల మధ్యలో మోదీ.. నెట్టింట్లో విమర్శలు

ABN , First Publish Date - 2022-06-21T22:55:31+05:30 IST

టీవీ9 కన్నడ టీవీ చానల్‌లో రికార్డ్ అయినట్లుగా కనిపిస్తున్న ఈ వీడియో ప్రకారం.. హెలికాప్టర్ దిగి వస్తున్న మోదీని కర్ణాటక నేతలు కొందరు స్వగతించడానికి వచ్చారు. అయితే వరుసగా నిల్చున్న వారిలో ముందు ఉన్న ఒక వ్యక్తి రెండు అడుగులు ముందుకు..

Viral Video: కెమెరాల మధ్యలో మోదీ.. నెట్టింట్లో విమర్శలు

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రచార ఆసక్తి ఎక్కువని, అందుకే కెమెరా లేకుండా బయటికి రాలేరని, కెమెరా కనిపిస్తే ఆగిపోతుంటారని, ఆ సమయంలో ఎవరినీ పట్టించుకోరని అనేక విమర్శలు చేస్తుంటారు. ఇక మోదీ-కెమెరా అంశంపై నెట్టింట్లో వచ్చే విమర్శలకు కొదువే ఉండదు. మోదీ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంటారు. తాజా వీడియో ఒకటి మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేలా చేసింది. యోగా దినోత్సవంలో భాగంగా కర్ణాటక వెళ్లిన నరేంద్రమోదీని ఒక వ్యక్తి స్వాగతిస్తున్న సందర్భంలో రికార్డు చేసిన వీడియో అది. ఈ వీడియోను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కెమెరా సమీపంలోకి వస్తే చాలు.. మన సుప్రీం హీరో/దర్శకుడిని ఎవరూ బీట్ చేయలేరు’’ అంటూ సెటైర్ విసిరారు. తన ట్వీట్లలో ఎప్పుడూ కనిపించే ‘జస్ట్ ఆస్కింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.


టీవీ9 కన్నడ టీవీ చానల్‌లో రికార్డ్ అయినట్లుగా కనిపిస్తున్న ఈ వీడియో ప్రకారం.. హెలికాప్టర్ దిగి వస్తున్న మోదీని కర్ణాటక నేతలు కొందరు స్వాగతించడానికి వచ్చారు. అయితే వరుసగా నిల్చున్న వారిలో ముందు ఉన్న ఒక వ్యక్తి రెండు అడుగులు ముందుకు రావడంపై మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు ఏదో చెప్తూ వెనక్కి వెళ్లమని సూచించారు. ఈ విషయం మొదట ఆయనకు అర్థం కాక ముందుకు కదలబోయారు. ముందుకు కాదు, వెనక్కి వెళ్లు అని మోదీ మరోసారి సూచించారు. ఇంతలో క్యూలో వెనుక నిల్చున్న వ్యక్తులు ఆయనను వెనక్కి పిలిచారు. మోదీ సూచన మేరకు ఆయన రెండు అడుగులు వెనక్కి జరిగి నిల్చున్నారు. అనంతరం మోదీ.. ముందుకు కదులుతూ వారికి నమస్కరించుకుంటూ వెళ్లారు.


మోదీకి వెనకాల భద్రతా సిబ్బంది ఉంది. రికార్డైన వీడియోలో ముగ్గురు కెమెరామెన్లు ఉన్నారు. ముందుకు కదిలిన వ్యక్తికి మోదీ సూచన చేస్తున్న సమయంలో కెమెరామెన్లు ఫొటోలు తీయకుండా నిల్చున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ ‘ఫొటో జీవి’ ‘ఇదేం ఆసనం?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అనేక సందర్భాల్లో కెమెరాలకు కనిపించేలా మోదీ చేసిన సైగలు, సూచనలను షేర్ చేస్తూ తాజాగా వీడియోతో పోల్చుతూ విమర్శిస్తున్నారు. మీమ్స్ వేస్తూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

Updated Date - 2022-06-21T22:55:31+05:30 IST