viral video: ప్రభుత్వంపై మండిపడ్డ ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

ABN , First Publish Date - 2022-03-04T01:28:24+05:30 IST

తరలింపు గురించి ఆ విద్యార్థి మాట్లాడుతూ ‘‘తరలింపు అంటే చిక్కుకున్న ప్రదేశం నుంచి తీసుకురావడం. మరి ఇది తరలింపు ఎలా అవుతుంది? మాకు మేముగా సరిహద్దు దాటి వచ్చాము. అక్కడి నుంచి ఇండియా విమానాలు మమ్మల్ని తీసుకువస్తున్నాయి..

viral video: ప్రభుత్వంపై మండిపడ్డ ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

కీవ్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తోంది. ఇలా వస్తున్న క్రమంలో కొంత మంది విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎన్నో కష్టాలకు ఓర్చి ఉక్రెయిన్ సరిహద్దు దాటుతున్నారని, సరిహద్దు దాటిన వారినే ఇండియాకు తీసుకువస్తున్నారని, కానీ ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నవారికి దీనికి మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఒక విద్యార్థి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక ప్రముఖులతో పాటు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సైతం ఈ వీడియోను షేర్ చేశారు.


తరలింపు గురించి ఆ విద్యార్థి మాట్లాడుతూ ‘‘తరలింపు అంటే చిక్కుకున్న ప్రదేశం నుంచి తీసుకురావడం. మరి ఇది తరలింపు ఎలా అవుతుంది? మాకు మేముగా సరిహద్దు దాటి వచ్చాము. అక్కడి నుంచి ఇండియా విమానాలు మమ్మల్ని తీసుకువస్తున్నాయి. మాలాగే ప్రతి ఒక్కరు అనేక కష్టాలు పడుతూ తమకు తాముగా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఎంబసీ తీరు సరిగా లేదు. వారిని ఏదైనా అడిగితే బస్సు తీసుకుని సరిహద్దు దాటండి అంటున్నారు. ఇక టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే పది మంది పది రకాలుగా చెప్తున్నారు. ఎవరూ ఏ విషయాన్ని సరిగా చెప్పడం లేదు. ఇంకా ఏమైనా అడిగితే ‘సారీ సర్.. మా దగ్గర అంత సమాచారం లేదు’ అంటున్నారు. ఉక్రెయిన్ భారతీయులకు భద్రత కల్పించాలి. కానీ ప్రభుత్వం నుంచి అలాంటిదేమీ అందడం లేదు’’ అని విమర్శించింది.


ఈ వీడియోను కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ షేర్ చేస్తూ.. ‘‘తరలింపు బాధ్యత.. సహకారం కాదు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సెటైర్ వేశారు. ఉక్రెయిన్‌లో ఎనిమిదో రోజు రష్యా విజృంభన కొనసాగుతోంది. అయినా ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు పట్టు సాధించలేదు. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి ‘న్యూక్లియర్’ హెచ్చరికలు చేశారు. యుద్ధం మధ్యలో ఒకసారి ఉక్రెయిన్‌-రష్య మధ్య జరిగిన చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా, చర్చలకు సిద్ధమని రష్యా గురువారం మరోసారి ప్రకటించింది.

Updated Date - 2022-03-04T01:28:24+05:30 IST