విరార్ ఘటన జాతీయ వార్త కాదు... 'మహా' మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-04-23T21:37:59+05:30 IST

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. విరార్ ఆసుపత్రిలో..

విరార్ ఘటన జాతీయ వార్త కాదు... 'మహా' మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముంబై: మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. విరార్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం జాతీయ వార్త ఏమీ కాదంటూ వ్యాఖ్యానించారు. విరార్‌లోని విజయ్ వల్లభ్ కోవిడ్-19 కేర్ ఆసుపత్రిలోని ఐసూయూలో షార్క్ సర్క్యూట్ జరిగిన ఘటనలో 14 మంది మృతి చెందారు. దీనిపై మీడియాతో మంత్రి తోపే మాట్లాడుతూ, అగ్నిప్రమాదానికి కారణంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఫైర్, స్ట్రక్టరల్, ఎలక్ట్రికల్ ఆడిట్లు నిర్వహించి, 10 రోజుల్లోగా నివేదికకు ఆదేశించామని తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని, మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు తెలిపారు.


పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు

విరార్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఓ ట్వీట్‌లో ఆకాంక్షించారు.

Updated Date - 2021-04-23T21:37:59+05:30 IST