Virat Kohli: సౌతాఫ్రికాతో రెండో టీ20లో కోహ్లీ చేసిన పనికి కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..

ABN , First Publish Date - 2022-10-03T18:03:49+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కోహ్లీ ఆవేశపరుడని కొందరు అతనిని విమర్శించినా..

Virat Kohli: సౌతాఫ్రికాతో రెండో టీ20లో కోహ్లీ చేసిన పనికి కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కోహ్లీ ఆవేశపరుడని కొందరు అతనిని విమర్శించినా అదే అతనికి అలంకారం అని కోహ్లీ ఫ్యాన్స్ (Kohli Fans) చెబుతుంటారు. క్రికెట్‌లో (Cricket) ఆ మాత్రం ఆవేశం లేకుండా మన్ను తిన్న పాములా ఉంటే మజా ఎలా ఉంటుందనేది కోహ్లీ ఫ్యాన్స్ వాదన. కోహ్లీపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈతరం క్రికెట్ అభిమానుల్లో కోహ్లీకి ఉండే ఫాలోయింగ్ ‘వేరె లెవెల్’ అని ఎవరైనా అంగీకరించాల్సిందే. కెప్టెన్‌గా టీమిండియాకు (Team India) ఎన్నో మరపురాని విజయాలను అందించిన విరాట్ కోహ్లీ (Virat Kohli SA T20) తాజాగా జరిగిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో (IND vs SA) తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. సొంత రికార్డుల కంటే జట్టు స్కోరే ముఖ్యమని భావించి కోహ్లీ చూపిన హుందాతనానికి టీమిండియా అభిమానులు ఫిదా అయ్యారు. కోహ్లీ నిస్వార్థ స్వభావంపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.



విరాట్ కోహ్లీ ‘Selfless Cricketer’ అని అతని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. ఆదివారం టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. ఆ ఒక్క పరుగు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని వ్యక్తిగత రికార్డు నమోదు చేసుకునే అవకాశం కోహ్లీకి ఉంది. 20వ ఓవర్‌లో దినేష్ కార్తీక్, కోహ్లీ క్రీజులో ఉన్నారు. 20వ ఓవర్‌లో నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో డీకే దుమ్మురేపాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉన్నాయి. కోహ్లీ 49 పరుగుల (Kohli 49 Runs) వద్ద ఉన్నాడు.



డీకే ఆ రెండు బంతులు మిగిలి ఉన్న సమయంలో సింగిల్ తీసి బ్యాటింగ్ కోహ్లీకి వచ్చేలా చేస్తే అతని హాఫ్ సెంచరీ పూర్తవుతుందని భావించి కోహ్లీ దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే.. కోహ్లీ హుందాగా అదేం అక్కర్లేదని.. ఆ రెండు బంతులు కూడా బాదేయమని దినేష్ కార్తీక్‌కు చెప్పాడు. దీంతో.. ఆ రెండు బంతుల్లో ఐదో బంతికి డీకే సిక్స్ బాదేశాడు. చివరి బంతికి సింగిల్ వచ్చింది. కోహ్లీకి 50 పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్కర్లేదని డీకేను బ్యాటింగ్ కొనసాగించమని విరాట్ చెప్పడంతో ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు. వ్యక్తిగత రికార్డు కోసం స్వార్థంగా ఆలోచించకుండా కోహ్లీ నిస్వార్థంగా వ్యవహరించడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత రికార్డ్ కంటే టీమిండియా అత్యుత్తమ స్కోర్ చేయడం ముఖ్యమని విరాట్ కోహ్లీ భావించడం క్రికెట్ చరిత్రలో ఒక గుర్తుపెట్టుకోదగిన పరిణామం అని చెప్పాల్సిందే.

Updated Date - 2022-10-03T18:03:49+05:30 IST