ఆటగాళ్లకు బబుల్‌ నుంచి బ్రేక్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-10-24T08:52:01+05:30 IST

కరోనా కారణంగా నెలకొన్న బయో బబుల్‌ జీవితం నుంచి ఆటగాళ్లకు ‘పరిమితంగా విరామం’ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

ఆటగాళ్లకు బబుల్‌ నుంచి బ్రేక్‌ ఇవ్వాలి

కోహ్లీ సూచన

దుబాయ్‌: కరోనా కారణంగా నెలకొన్న బయో బబుల్‌ జీవితం నుంచి ఆటగాళ్లకు ‘పరిమితంగా విరామం’ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని విరాట్‌ కోహ్లీ అన్నాడు. దీంతో క్రికెటర్లకు సేదతీరే సమయం లభిస్తుందన్నాడు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. ప్లేయర్ల ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఆడించడం వల్ల క్రికెట్‌కు ఎటువంటి ప్రయోజనమూ ఒనగూరదన్నాడు. ‘అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. క్రికెటర్లకు కొంత కాలం విరామం ఇవ్వడం ముఖ్యం. దీంతో వారు మానసికంగా సేదతీరతారు. మళ్లీ ఆటలోకి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సత్తాచాటగలర’ని శనివారం  జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ అన్నాడు. సుదీర్ఘ కాలం బయోబబుల్‌లో ఉండడం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై పడే ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ విషయంలో ఆటగాడితో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చర్చించాలని విరాట్‌ సూచించాడు. ‘టీమ్‌లో ఐదారుగురు సంతోషంగా ఉంటే.. అందరూ అలాగే ఉన్నారని కాదు. ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా వారి పరిస్థితిని మేనేజ్‌మెంట్‌ తెలుసుకోవాల’ని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2021-10-24T08:52:01+05:30 IST