వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రీకరణ ప్రస్తుతం రాత్రి వేళల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మిగతా సన్నివేశాల చిత్రీకరణను ఇటీవలే పునఃప్రారంభించాం. రాత్రి వేళల్లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ షెడ్యూల్లో రానా కూడా పాల్గొంటున్నారు. విభిన్నంగా, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపిస్తారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు’’ అని చెప్పారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు సమర్పకులు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.