పశువులను బలితీసుకుంటున్న వైరస్‌

ABN , First Publish Date - 2020-11-29T05:55:13+05:30 IST

ఉమ్మడి జిల్లాలో పశువులు మేత మేయకపోవడం, నీరసంగా ఉండటం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు పాడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఈ లక్షణాలు లంపి చర్మ వ్యాధిగా పశువైద్యులు నిర్ధారించారు.

పశువులను బలితీసుకుంటున్న వైరస్‌
లంపి వ్యాధితో ఆవు శరీరంపై ఏర్పడ్డ కణతులు

లంపి చర్మ వ్యాధితో మృత్యువాత

జాగ్రత్తలు తీసుకుంటేనే వ్యాధి అదుపులోకి

సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 70 కేసులు నమోదు

తొమ్మిది లేగదూడల మృతి

డిండి, సూర్యాపేట సిటీ, పెన్‌పహాడ్‌, నవంబరు 28: ఉమ్మడి జిల్లాలో పశువులు మేత మేయకపోవడం, నీరసంగా ఉండటం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు పాడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఈ లక్షణాలు లంపి చర్మ వ్యాధిగా పశువైద్యులు నిర్ధారించారు. పాక్స్‌ కుటుంబానికి చెందిన ఈ వైర్‌సతో పశువులు మృత్యువాతపడుతున్నాయి. ఇది అంటువ్యాధి కావడంతో ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతోంది. గాలి, నీరు, ఆహారం ద్వారా కూడా పశువులు ఈ వ్యాధిబారినపడుతున్నాయి. గుర్తించేలోపే వ్యాధి తీవ్రత పెరిగి మృతిచెందుతున్నాయి. దూడల్లో దీని ప్రభావం అధికంగా 78శాతం వరకు ఉంటోందని పశువైద్యులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఐదు మండలాలు మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్‌, హుజూర్‌నగర్‌, మేళ్లచెర్వులో మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఈ వైరస్‌ లక్షణాలు కనిపించాయి. 70 లేగదూడలు ఈ వైరస్‌ బారినపడి 9 మృత్యువాత చెందగా, మిగిలినవి కోలుకున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో ఎక్కడా లంపి చర్మ వ్యాధి ఆనవాళ్లు లేవు. కాగా, నల్లగొండ జిల్లాలో ఈ వ్యాధి ప్రస్తుతం విస్తృతమైంది. ప్రధానంగా దేవరకొండ డివిజన్‌లో ఈ వ్యాధి లక్షణాలతో మూగజీవాలు మృతిచెందుతున్నాయి.


వ్యాధి లక్షణాలు

లంపి చర్మవ్యాధి. ఇది ఒక రకమైన అంటువ్యాధి. పశువులకు దోమలు, ఈగల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిసోకిన పశువుల లాలాజలం, ముక్కుద్వారా వచ్చే నీరు, పాలు, వీర్యం ద్వారా మరో పశువుకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పెద్దపశువుల్లో ఓ మోస్తరుగా, దూడల్లో తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వ్యాధి సోకిన పశువులకు జ్వరం 104-105 డిగ్రీలు ఉంటుంది. మేత తినేందుకు ఇష్టపడవు. నొప్పులు ఉండి పశువులు నీరసంగా, నలతగా ఉంటాయి. కళ్లు, నోటి నుంచి నీరుకారడం, పాలదిగుబడి, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. దీంతోపాటు ముఖ్యమైన లక్షణం బొబ్బలు, దద్దుర్లు, కణుతుల రూపంలో చర్మం, మూతి నాసిక రంధ్రాలు, తల, మెడ భాగం, వీపు మీద, కాళ్ల దగ్గర, పొదుగు భాగం, కనుబొమ్మల మీద కనిపిస్తాయి. ఈ దద్దుర్లు, కణుతులు ఊపిరితిత్తులతో కూడా ఏర్పడి నిమ్ముగా మారి శ్యాస ఆడక దూడలు చనిపోతుంటాయి. ఈ వైరస్‌ దద్దుర్లు, నల్లని మచ్చగా ఏర్పడి ఆ తరువాత చీముపట్టి పశువులోపల మాంసాన్ని తింటాయి. ఈ సమయంలో వైద్యం అందకుంటే పశువులు మృత్యువాతపడతాయి.


రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పశువులను తరచుగా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, నల్లనిమచ్చలు, కణతులు ఉన్నాయో లేదో చూడాలి. వలస వచ్చిన, కొత్త పశువులను కలవకుండా చూసుకోవాలి. పశువుల దొడ్లలో దోమలు, ఈగలు లేకుండా జాగ్రత్త వహించాలి. వీటి నివారణకు పశువుల పాకలో తరచుగా వేప ఆకులతో పొగపెట్టాలి. వీలైతే దోమ తెరలు కట్టాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును మందనుంచి వేరుచేసి 10-15 రోజులపాటు ప్రత్యేకంగా ఆహారం అందించాలి. మిగతా పశువులను కలవకుండా జాగ్రత్తవహించి దగ్గరలో ఉన్న పశువైద్యుడిని సంప్రదించి చికిత్స అందించాలి. వ్యాధి తీవ్రత లేగదూడల్లో ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్‌ ఉధృతి పెరుగుతుంది.


నివారణ చర్యలు

స్టేప్‌టో పెన్సిల్‌ లాంటి యాంటిబయాటిక్‌ మందులు నాలుగు నుంచి ఆరు రోజుల వరకు పశువులకు ఇవ్వాలి. నొప్పులు తగ్గేందుకు ప్లూమెగ్లూమిన్‌, మెలోరెక్స్‌ప్ల్‌స(జ్వరంఉంటే) వాడాలి. హెవిల్‌ 12-15 ఎంఎల్‌ వాడాల్సి ఉంటుంది. గాయాలపై పొవిడిన్‌, అయోడిన్‌ మందు పూయాల్సి ఉంటుంది.


నిర్లక్ష్యంచేస్తే పశువులు మృత్యువాత : జి.నాగయ్య, కొండమల్లేపల్లి పశువైద్యాధికారి

లంపి వ్యాధి లక్షణాలు కనబడిన పశువులను వెంటనే సమీప పశువైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. ఒక పశువు నుంచి మరోదానికి వ్యాధి ప్రబలకుండా వేరుగా ఉంచాలి. దూడల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున పాడి రైతులు నిర్లక్ష్యం వహించవద్దు.


పశువైద్యశాలలో మందులు లేవు : మూడావత్‌ శ్రీను, రైతు డిండి

లంపి వ్యాధి సోకిన పశువులకు పశువైద్యశాలలో మందులు అందుబాటులో లేవు. వైద్యులు పాడిరైతులనే మందులు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా పశువులు మృతి చెందుతున్నాయి. ప్రభుత్వ పశువైద్యశాల్లో మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.


వ్యాధిబారిన పడటంతో విక్రయించా : పోలిశెట్టి పిచ్చయ్య, నాగులపాటి అన్నారం 

ఆరేళ్ల లేగదూడ చర్మంపై ఏప్రిల్‌ నెలలో అక్కడక్కడ బుడిపెలు వచ్చాయి. నీరసంగా ఉండి మేత కూడా సరిగా తినేది కాదు. ఏం వ్యాధో అర్థం కాలేదు. ఈ లోగా డబ్బు అవసరంపడటంతో మా గ్రామం పక్కన ఉన్న బంధువులకు లేగదూడను విక్రయించా. ప్రస్తుతం లేగదూడ, ఆవు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిసింది.

Updated Date - 2020-11-29T05:55:13+05:30 IST