వామ్మో.. వైరస్‌!

ABN , First Publish Date - 2021-04-24T04:46:47+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నాయి. ప్రస్తుతం వైరస్‌ రెండో దశ వ్యాప్తి జిల్లాలో తీవ్రంగా ఉంది.

వామ్మో.. వైరస్‌!

కరోనా బారిన అధికారులు, ఉద్యోగులు

వర్క్‌ఫ్రం హోం అనుమతి ఇవ్వండి : సీనియర్ల వినతి


నెల్లూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నాయి. ప్రస్తుతం వైరస్‌ రెండో దశ వ్యాప్తి జిల్లాలో తీవ్రంగా ఉంది. ప్రజలతోపాటు పెద్ద సంఖ్యలోనే ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు కరోనా సోకుతోంది. జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లో ముగ్గురు అధికారులకు, మరో ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి, మరో 30 మంది వరకు వైరస్‌ బారిన పడ్డారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో నెల్లూరు, కావలి, రాపూరు, గూడూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నలుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కూడా ఓ ఉన్నతాధికారితోపాటు పలువురు ఉద్యోగులకు కరోనా వచ్చింది. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి, మరో నలుగురు ఉద్యోగులు  మహమ్మారి బారిన పడ్డారు. నెల్లూరు కార్పొరేషన్‌లో సుమారు పది మందికి,  ్యవసాయ శాఖలో ఎనిమిది మంది, అగ్నిమాపక శాఖలో నలుగురికి, రవాణా శాఖలో ఆరుగురికి, విద్యుత్‌ శాఖలో సుమారు 20 మందికి కరోనా సోకింది. ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ పరిధిలో 50 మంది సిబ్బందికిపైగా కరోనా బారినపడ్డారు. రాపూరు డిపోలోనే ఎక్కువ కేసులు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇలా దాదాపుగా ప్రతి శాఖ కార్యాలయంలో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీరితోపాటు పనిచేస్తున్న సహోద్యోగులు  వణికిపోతున్నారు. గతంలో ఒక కార్యాలయంలో ఎవరికైనా కరోనా సోకితే వారి కాంటాక్ట్స్‌కు పరీక్షలు నిర్వహించేవారు. అప్పటివరకు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కార్యాలయానికి దూరంగా పెట్టేవారు. అయితే ఆ స్థాయిలో ఇప్పుడు పరీక్షలు జరగడం లేదు. అదే సమయంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా సోకుతుండటంతో సీనియర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 50 ఏళ్లు దాటిన ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు తమ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నివారణకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో థర్మల్‌ స్కానర్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రత కొలవడంతో పాటు శానిటైజ్‌ చేయాలని ఆయన సూచించారు. అనవరసంగా కార్యాలయాలకు వచ్చే వారిని అరికట్టాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-04-24T04:46:47+05:30 IST