గర్భిణులపై వైరస్‌ పంజా

ABN , First Publish Date - 2021-05-10T04:51:04+05:30 IST

కరోనా మహమ్మారి గర్భిణులపై..

గర్భిణులపై వైరస్‌ పంజా

కేజీహెచ్‌, వీజీహెచ్‌లో 103 మందికి పాజిటివ్‌

కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో 96 మందికి డెలివరీ 

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు  


(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం): కరోనా మహమ్మారి గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇతరుల కంటే గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారికే వైరస్‌ వేగంగా సోకుతుంది. జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో గర్భిణులు కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కేజీహెచ్‌, జార్జ్‌ విక్టోరియా ఆస్పత్రికి సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన గర్భిణుల్లో లక్షణాలు గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించగా.. పలువురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి  ఇప్పటివరకు ఘోషా ఆస్పత్రికి వచ్చి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన 362 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 218 మందికి, కేజీహెచ్‌లో 246 మందికి పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో స్వల్ప లక్షణాలున్న 20 మందిని హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించగా, మిగిలిన వారికి కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ కొవిడ్‌ వార్డులో వైద్య సేవలందిస్తున్నారు. 


96 మందికి డెలివరీ.. 

కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ కొవిడ్‌ వార్డు ఐదో అంతస్తును గర్భిణుల కోసమే కేటాయించారు. ఇందులో కేజీహెచ్‌, వీజీహెచ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికీ  చికిత్స చేస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు 96 మందికి ఇక్కడ డెలివరీ కాగా 41 మందికి సాధారణ ప్రసవం,  55 మందికి సిజేరియన్‌ చేశారు. 


తల్లికి వేరుగా బిడ్డ.. 

కొవిడ్‌ సమయంలో డెలివరీ అయిన తల్లుల నుంచి బిడ్డను వైద్యసిబ్బంది వెంటనే వేరు చేసి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకకుండా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. సాధారణ ప్రసవమైతే  48 గంటల తరువాత, సిజేరియన్‌ అయితే వారం రోజుల తరువాత డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత మరో వారం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.  


ఇవీ లక్షణాలు.. 

కొవిడ్‌ బారినపడుతున్న గర్భిణుల్లో చాలా మందిలో సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నడుము నొప్పి, కొందరిలో నీరసం వంటివి ఉన్నాయి.  


పోషకాహారం తీసుకోవాలి.. 

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ ఆలోచనలకు దూరంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటున్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.


పరీక్షలంటూ వెళ్లకూడదు..: డాక్టర్‌ హేమలతాదేవి, ఘోషా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

గర్భిణిలు ప్రస్తుతం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండవచ్చు. పరీక్షలంటూ ఎక్కువసార్లు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగడం మంచిది కాదు. 3, 5, 7, 9 నెలల్లో మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. ఇబ్బందికరంగా ఉంటే ఫోన్‌లో వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు నడుచుకోవాలి.  మానసికంగా ప్రశాంతంగా ఉంటూ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. 

Updated Date - 2021-05-10T04:51:04+05:30 IST