వైరస్‌ ఉధృతం!

ABN , First Publish Date - 2021-04-18T05:29:17+05:30 IST

పార్వతీపురం మండలంలోని ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో కుటుంబసభ్యుల్లో ముగ్గురికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. శనివారం తల్లీ, కుమారుడు మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.

వైరస్‌ ఉధృతం!


 జిల్లాలో పెరుగుతున్న కేసులు

 కనీస నిబంధనలు పాటించని ప్రజలు

 పట్టించుకోని అధికారులు

 మోగుతున్న ప్రమాద ఘంటికలు

 మేలుకోకుంటే ముప్పే

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు సగటున 300 కు పైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉన్నా.. చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదు. గతంలో మాదిరిగా అధికారులు సైతం కట్టడి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, సినిమాహాళ్లు, బస్సులు, ఆటోల్లో ఏఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు లేకుండా ఆరుబయట సంచరిస్తున్నవారిని గుర్తించి పోలీసులు జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో ఆశించిన మేరకు మార్పు రావడం లేదు. విజయనగరం, పార్వతీపురం, సాలూరు, ఎస్‌.కోట, బొబ్బిలితో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో సైతం కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 72 కంటైన్మెంట్‌ జోన్‌లు కొనసాగుతున్నాయి. ఓవైపు అధికారులు కరోనా కట్టడి కోసం చర్యలు చేపడుతున్నా, అవి క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


సర్వత్రా ఆందోళన

జిల్లాలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే 304 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,283కి చేరింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 1,348 ఉన్నాయి. కరోనా పాజిటివ్‌ నిర్థారణ జరగగానే గతేడాది యంత్రాంగం ఆ వీధిలో శానిటైజేషన్‌ చేయించేవారు. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు చేసేవారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చర్యలు చేపట్టేవారు. పోలీసు పహారా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి కానరావడం లేదు. ప్రజల్లో నిర్లక్ష్యధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా, బాధితుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగిపోతున్నా పట్టించుకున్నవారే కరువయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై నిఘా లేనేలేదు.. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దిరోజుల్లోనే మహమ్మారి కాటుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.


తల్లీ, కుమారుడి మృతి

పార్వతీపురం  మండలంలోని ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో కుటుంబసభ్యుల్లో ముగ్గురికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. శనివారం తల్లీ, కుమారుడు మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. 


మెంటాడలో మండల స్థాయి అధికారి..

మెంటాడ మండలంలో కరోనా బారినపడి మండల స్థాయి అధికారి ఒకరు శనివారం మృతిచెందారు. గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందారు. మండల పరిషత్‌ ఎన్నికల సమయంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లోనే ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 


జామి మండలంలో ఒకరు..

 జామి మండలంలో ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో మృతిచెందారు. కొద్దిరోజుల కిందట స్థానిక పీహెచ్‌సీలో బాధిత కుటుంబసభ్యులు కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నారు. అక్కడకు మూ డు రోజుల తరువాత ఆ కుటుంబ పెద్దలో లక్షణాలు బయటపడ్డాయి. దీంతో నిర్థారణ పరీక్షలు చేసుకోగా కుటుంబసభ్యులందరికీ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వారిని విజయనగరం మహారాజ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కానీ వారు అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కుటుంబపెద్ద శనివారం మృతిచెందారు. 


ఓ గ్రామంలో కరోనా బారిన 38 మంది

దత్తిరాజేరు మండలంలో ఒకే గ్రామంలో 38 మంది కరోనా బారిన పడ్డారు. గ్రామంలో ఇటీవల ఎనిమిది మంది వ్యక్తుల్లో లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గ్రామస్థులందరికీ  నిర్థారణ పరీక్షలు చేయగా 38 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యాధికారి ఆర్‌.ఆనంద్‌ తెలిపారు. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కార్యదర్శి మహేష్‌ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు.



Updated Date - 2021-04-18T05:29:17+05:30 IST