స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌లో వింత పరిస్థితి

ABN , First Publish Date - 2020-07-06T10:53:57+05:30 IST

ఆసుపత్రికే సుస్తి చేసింది. వైద్యులు, సిబ్బంది..

స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌లో వింత పరిస్థితి

వైద్యానికి వైరస్‌..!

వైద్యులు, పీజీలు, సిబ్బందికి కరోనా

నాణ్యత లేని మాస్కులతో ముప్పు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికే సుస్తి చేసింది. వైద్యులు, సిబ్బంది రోగులుగా మారారు. ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి..? ఏడు జిల్లాల ఆరోగ్య ప్రదాయిని.. రాయలసీమ వైద్య కేంద్రంగా పేరున్న స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఇది. కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నర్సులు క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌ కేంద్రాల్లో గడుపుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పెద్దాసుపత్రి ప్రాంగణం నిర్జన ప్రదేశంగా మారింది. 


కర్నూలు జీజీహెచ్‌లో 250 మంది  వైద్యులు ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 200 మంది, హౌస్‌ సర్జన్లు 250 మంది, నర్సులు 350 మంది, సిబ్బంది 2000 మంది ఉన్నారు. సాధారణ రోజుల్లో వీరి ద్వారానే ఆసుపత్రిలో సేవలు కొనసాగాయి. ప్రస్తుతం పెద్దాసుపత్రిని స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చారు. దీంతో వీరందరూ ఇతర ఆసుపత్రులకు, కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సేవలు అందిస్తున్నారు.


ముంబై బాధితులతోనే..

కొవిడ్‌ అత్యవసర బాధితులకు కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ముంబై నుంచి వచ్చినవారిలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కారణంగా బాధితులకు సేవలు అందించే వైద్యులు, పీజీలు, హౌస్‌ సర్జన్లు, నర్సులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. ముంబై బాధితుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు సీనియర్‌ వైద్యులు విశ్లేషిస్తున్నారు. గైనిక్‌, పీడీయాట్రిక్‌ విభాగాలను కర్నూలు జీజీహెచ్‌లోనే కొనసాగిస్తున్నారు. గైనిక్‌ విభాగంలో ఇద్దరు పీజీలు, ఒక సీనియర్‌ రెసిడెంట్‌, ఇద్దరు హౌస్‌సర్జన్లు కరోనా బారినపడ్డారు.


ఇద్దరు వైద్యులు కూడా పాజిటివ్‌తో చికిత్స తీసుకున్నారు. గైనిక్‌ విభాగం, పీడీయాట్రిక్‌ విభాగంలో పని చేసే నలుగురు స్టాఫ్‌ నర్సులుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మెడిసిన్‌, ఈఎన్‌టీ విభాగాలకు చెందిన ఇద్దరు పీజీలలో గురువారం వైరస్‌ బయట పడింది. దీంతో వైద్య వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఓ వాచ్‌మన్‌, ఓ టెక్నీషియన్‌, సెక్యూరిటీ గార్డులు కొందరు కరోనా బారిన పడ్డారు. వైద్య సిబ్బంది, నర్సులకు, కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ సోకినట్లు గుర్తించారు.


క్వాలిటీ మాస్కులు ఏవీ..?

జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం క్వాలిటీ లేని మాస్కులను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో ఎన్‌-95 మాస్కుల బదులు కేఎన్‌-95 మాస్కులు వాడుతున్నారు. కరోనా వైరస్‌ కళ్లు, ముక్కు, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది నాణ్యమైన ఎన్‌-95 మాస్కులు ధరిస్తే వైరస్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొందరు సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. కానీ నాన్‌ మెడికల్‌ సిబ్బంది వాడే కేఎన్‌-95 మాస్కులను సరఫరా చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా నాణ్యమైన ఎన్‌-95 మాస్కులను సరఫరా చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.


ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లా..

కేఎన్‌-95 మాస్కుల క్వాలిటీ బాగానే ఉంది. కొందరు వైద్యులు మాస్కుల నాణ్యతపై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాం. 

- డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి


 

తిప్పి పంపాం..

కేఎన్‌-95 మాస్కులను పారా మెడికల్‌ సిబ్బందికి మాత్రమే పంపిణీ చేస్తున్నాం. వీటిని వైద్యులకు ఇవ్వడం లేదు. కేఎన్‌-95 మాస్కులపై ఫిర్యాదులు రావడంతో 5 వేల మాస్కులను హెడ్‌ ఆఫీసుకు తిరిగి పంపుతున్నాం. 

- ఎం విజయ భాస్కర్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ

Updated Date - 2020-07-06T10:53:57+05:30 IST