విశాఖ వేదిక... పోరాట వీచిక!

ABN , First Publish Date - 2022-08-15T06:33:06+05:30 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో ఉమ్మడి విశాఖ జిల్లా తనదైన ముద్రను వేసింది.

విశాఖ వేదిక... పోరాట వీచిక!
టౌన్‌ హాల్‌

స్వాతంత్య్ర సంగ్రామంలో అరుదైన ముద్ర 

తొలి సిపాయిల తిరుగుబాటు ఇక్కడే 

మన్యం వీరుడి విప్లవానికి నాంది 

మహాత్ముడి పాదస్పర్శతో ఐదుసార్లు పునీతమైన నగరం  

 

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

స్వాతంత్య్ర సంగ్రామంలో ఉమ్మడి విశాఖ జిల్లా తనదైన ముద్రను వేసింది. ఇక్కడ జరిగిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దేశంలోనే తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ నగరంలోనే జరిగింది. అటు తరువాత బ్రిటీష్‌ పాలకులను పారదోలేందుకు కొందరు జమీందారులు ప్రారంభించిన ఉద్యయమం అనేక ఘట్టాలుగా కొనసాగింది. ఈ పోరాటాల్లో అత్యంత కీలకమైనది అల్లూరి సీతారామరాజు చేపట్టిన మన్యం తిరుగుబాటు. అంతేకాదు స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ ఐదు పర్యాయాలు విశాఖను సందర్శించడం మరచిపోలేని జ్ఞాపకం.


అప్పటి విశాఖ జిల్లాలో స్వాతంత్య్ర పోరాటానికి 1780లో జరిగిన సిపాయిల తిరుగుబాటు స్ఫూర్తి. ఇక్కడి పోరాటాన్ని చరిత్ర కారులు నాలుగు ఘట్టాలుగా పేర్కొన్నారు.  ఇందులో మొదటిది తమ పాలనను విస్తరించిన బ్రిటీష్‌ పాలకులు ఒక్కో సంస్థానాన్ని విలీనం చేయడంతో అసంతృప్తి చెందిన జమీందారులు తిరుగుబాటు చేశారు. ఇందులో భాగంగా తొలుత 1830లో శృంగవరపుకోట, 1840లో అనకాపల్లి జమీందారులు తిరుగుబాటు చేయడంతో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమయిందని చెప్పవచ్చు. తరువాత సిపాయిల తిరుగుబాటు నుంచి బెంగాల్‌ విభజన ఉద్యమాన్ని (1857 నుంచి 1905 వరకు) రెండో ఘట్టంగా పేర్కొన్నారు. ఈ దశలో అనేక కీలక పరిమాణాలు చోటుచేసుకున్నాయి. విశాలో క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలల ఏర్పాటుతో హిందూ వాదులు అప్రమత్తమయ్యారు. క్రైస్తవ మత వ్యాప్తిపై తమదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ఒక రకంగా దీనిని సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. 


భారత జాతీయ కాంగ్రెస్‌తో... 

ఇదే సమయంలో విశాఖకు చెందిన పలువురు నాయకులు  భారత జాతీయ కాంగ్రెస్‌ నేతలతో సత్సంబంధాలు నెలకొల్పడం ద్వారా స్వాతంత్య్రపోరాటానికి  సంసిద్ధులయ్యారు. తొలితరం ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో మారేపల్లి రామచంద్రకవి, తదితరులున్నారు. ఇక మూడో ఘట్టంగా అల్లూరి మన్యం తిరుగుబాటును పేర్కొనవచ్చు. 1907లో బీచ్‌రోడ్డులోని టౌన్‌హాల్లో బిపిన్‌ చంద్రపాల్‌ నాయకత్వంలో సభ జరిగింది. ఆ తరువాత జిల్లాలో ఉద్యమం ఊపందుకున్నది. రౌలత్‌ చట్టం ఉల్లంఘన సందర్భంగా జరిగిన సత్యాగ్రహంలో మల్లెమడుగుల కోదండరామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జాతీయ కాంగ్రెస్‌ పత్రాలను చదివేందుకు పలువురు వెనుకంజవేయగా స్థానిక న్యాయవాది మల్లెమడుగుల బంగారయ్య ముందుకొచ్చారు. ఉద్యమాన్ని విప్లవ పంథాలో నడపాలని భావించిన ఏవీఎన్‌ కళాశాలలో చదువుతున్న వసంతరావు బుచ్చి సుందరరరావు మరికొందరితో కలిసి తెల్లదొరలపై పోరాటం చేశారు. స్థానికంగా ఉద్యమాలను కొనసాగిస్తూ జాతీయనాయకులు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విశాఖ ఉద్యమానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. 


నాగ్‌పూర్‌ సభకు జిల్లా నేతలు 

ఈ క్రమంలో 1920లో నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభకు విశాఖ నుంచి బుచ్చి సుందరరావు, కందాళం సర్వేశ్వరశాస్త్రి హాజరయ్యారు. గాంధీ స్వాతంత్య్రపోరాటానికి నాయకత్వం వహించిన తరువాత చివరగా 1947 వరకు నాల్గో ఘట్టంలో ఇక్కడ ఉద్యమం విస్తరించడంతో అనేకమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు కూడా వెనుకంజ వేయకుండా ఉద్యమం అగ్రభాగాన నిలిచారు. విశాఖతోపాటు బాలచెరువు వద్ద జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో దిగుమర్తి జానకీబాయి నాయకత్వం వహించారు. అటుతరువాత జరిగిన పోరాటంలో నిండుచూలాలు జానకీబాయిని అరెస్టుచేసి జైలుకు పంపారు. జైలులోనే ఆమె కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమెకు మాయాదేవి అని పేరు పెట్టారు. 


జిల్లాకు ఐదు సార్లు వచ్చిన గాంధీ 

విశాఖలో ఉద్యమానికి మారేపల్లి రామచంద్రకవి, కె.ఎస్‌.గుప్త, తెన్నేటి విశ్వనాథం, సత్యనారాయణరాజు తదితర నాయకులు నాయకత్వం వహించారు. 1921 నుంచి పోరాటం ముగిసేవరకు మహాత్ముడు ఐదుసార్లు విశాఖ వచ్చారు. 1921లో తొలిసారిగా విశాఖలో జరిగిన గాంధీ సభకు అల్లూరి సీతారామరాజు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో బలమైన సంస్థానాలు ఉన్నప్పటికీ, వారిని లెక్కచేయకుండా ఉద్యమం సాగింది. నౌకాయానం సదుపాయం ఉన్న విశాఖలో బ్రిటిష్‌ మిలట్రీ క్యాంపు ఉండేది. అయినా స్వాతంత్య్రపోరాటంలో పాల్గొనేందుకు నాయకులు ఉత్సాహం చూపించేవారు. విశాఖలో స్వాతంత్ర సభలు ఎక్కువగా బీచ్‌రోడ్డులోని టౌన్‌హాలుకు ఎదురుగా జరిగేవి. అనంతర కాలంలో బాలచెరువు, దిమిలి, చోడవరం, అనకాపల్లి, విజయనగరం, ఏజెన్సీలోని కొన్నిప్రాంతాలు కేంద్రంగా సాగే ఉద్యమాలపై ఇప్పటికీ జీవించి ఉన్న వృద్థులు కథలు కథలుగా చెబుతారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా కర్రా సీతారామయ్య నేతృత్వంలో విశాఖ కేంద్రంగా స్వశక్తి పత్రిక నడిపారు. విజయభేరి పత్రికను జగన్నాథరావు, కోడకంటి బ్రహ్మాజీ నిర్వహించారు. 


జెండా పండగకు సర్వం సిద్ధం

పోలీస్‌ బారెక్స్‌లో ఏర్పాట్లు 

పతాకావిష్కరణ చేయనున్న ఇన్‌చార్జి మంత్రి విడదల రజని 

398 మందికి ప్రశంసాపత్రాలు


విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలకు పోలీస్‌ బ్యారెక్స్‌ మైదానం సిద్ధమయింది. సోమవారం ఉదయం 8.58 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు  వేదిక, కవాతు, శకటాల ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తుండడంతో కవాతు జరిపే ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖలకు చెందిన 39 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ఈ పర్యాయం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ప్రతిభ చూపిన సిబ్బందిని కూడా చేర్చారు. వీరిలో 19 మంది అధికారులు ఉన్నారు. వివిధ పఽథకాల నుంచి 1,16,507 మందికి రూ.137.99 కోట్ల నిధులు పంపిణీ చేస్తారు. పదిశాఖలకు చెందిన శకటాలు ప్రదర్శించనున్నారు.   పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 


గాంధీ చిరునవ్వు కోసం పరితపించే వాళ్లం 

అదే కొండంత సంతృప్తినిచ్చేది 

గాంధీ విలువలు పాటించి, ఇతరులకు చెప్పేవారు  

నిజాయితీ, నిస్వార్థం ఊపిరిగా బతికే సమాజాన్ని చూశా

‘ఆంధ్రజ్యోతి’తో గాంధేయవాది రాచర్ల సారంగరావు


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నిష్కళంక దేశభక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. తల్లి రాచర్ల సామ్రాజ్యం స్వాతంత్య్ర పోరాటంలో జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత జీవితాంతం గాంధేయ విలువలతోనే జీవించారు. తాత గోపరాజు సుబ్బారావు బ్రిటీష్‌ ఇండియాలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసినా, గాంధీ వేలం వేసిన కండువాను కొనుగోలు చేసి భద్రపరచుకున్న దేశభక్తుడు. మేనమామ ప్రముఖ నాస్తిక ఉద్యమకర్త గోరా. పదేళ్ల వయసులోనే తల్లి, మేనమామ కుటుంబంతో గాంధీగ్రామ్‌లోని సేవాగ్రామ్‌ ఆశ్రమంలో గాంఽధీని చూసి, పదిహేను రోజులు గడిపి, అక్కడి జీవన విధానాన్ని ఆసాంతం అవగతం చేసుకున్న వ్యక్తి రాచర్ల సారంగరావు. గాంధేయ విలువలు వంట బట్టించుకుని, ఉద్యోగ బాధ్యతల్లో వాటినే పాటించి, విశాఖ మన్యంలో విద్యాభివృద్ధికి కృషిచేసిన ఆయన ప్రస్తుత వయసు 89 సంవత్సరాలు. కుమారుడు మహేష్‌తో కలిసి రేసపువానిపాలెంలో ఉంటున్న సారంగరావు ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ సందర్భంగా అప్పటి తరంతో అనుభవాలు... ఇప్పటితరం తీరుపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 

అమ్మ రాచర్ల సామ్రాజ్యం క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాయవెల్లూరు జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ఆమె, మేనమామ గోరా కుటుంబంతో 1945లో సేవాగ్రామ్‌లో గాంఽధీ ఆశ్రమానికి వెళ్లాం. అప్పుడు నా వయసు పదేళ్లు. అక్కడ పదిహేను రోజులున్నాం. ఉదయం 4.30 గంటలకు బెల్‌ మోగిన వెంటనే గాంధీజీతో సహా ప్రతి ఒక్కరూ లేచి ప్రార్థన చేసేవారు. ఆశ్రమంలో ఎవరి పనులు వారే చేసుకోవాలి. నాతోపాటు చిన్నపిల్లలకు కూరగాయలు, చెరకు గడలు శుభ్రపరిచే పనులు అప్పగించేవారు. గాంధీజీ స్నానం చేసే గదికి ఆనుకునే పిల్లలంతా కూరగాయలు కడిగే పనిలో ఉండేవాళ్లం. ప్రతిరోజూ ఉదయం పది గంటల సమయంలో స్నానాల గదికి వెళ్లే ముందు గాంధీ అక్కడే నిలబడి మా వైపు చూసి చిరునవ్వుతో పలుకరించేవారు. అంటే మా పనులను గుర్తించారన్నమాట. అలా ఆయన చిరునవ్వు నవ్వితే మాకు కొండంత బలం వచ్చేది. పదేళ్ల వయసు అయినా ఆశ్రమంలో వున్న 15 రోజులు ఎంతో నేర్చుకున్నా. సమయపాలన, క్రమశిక్షణ, అంకితభావం, చిత్తశుద్ధితో మెలిగేతత్వం అలవర్చుకున్నా. ‘చేసే పనికి, ఆడే మాటకు పొంతన ఉండాలి...చేసే పనిని పది మందికి చెప్పడం కాదు...మన చేతల వల్ల పది మందికీ తెలియాలి...నిజాయితీగా మెలిగేతత్వం అలవర్చుకోవాలి...’ వంటి అనేక అంశాలను సేవాగ్రామ్‌లో ఆచరించి, చెప్పేవారు. ప్రతి మంగళవారం గాంధీ మౌనవ్రతం పాటించేవారు. సామూహిక చరఖా రాట్నంలో గాంధీతో సహా ప్రతి ఒక్కరు పాల్గొనేవారు. పిల్లలకు తకిలీలు ఇచ్చి నూలు వడకమనేవారు.


గాంధీ చేతి కర్ర విశిష్టత..

అహింసను ఆయుధంగా చేసుకుని, స్వాతంత్య్రం సాధించిన మహాత్ముడికి చేతి కర్ర ఎందుకు? హింసను ప్రేరేపించడానికా...అంటూ ఈ తరం వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది తప్పు. యావత్‌ జాతిని స్వాతంత్య్ర పోరాటంలోకి తీసుకువచ్చే క్రమంలో ఆయనకు చేతికర్ర ఆలంబనగా నిలిచింది. గాంధీ ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్‌ చేసేవారు. ఆ సమయంలో వడివడిగా (చిన్నపాటి పరుగు) అంగలేసుకుని నడిచేవారు. అప్పుడు చేతికర్ర ఉపయోగించేవారు. అలా ఆశ్రమంలో చేతి కర్రతో వాకింగ్‌ చేసే గాంధీని దగ్గరుండి చూసిన వాడ్ని. నాయకుడిగా ఆయన మాట్లాడిన ప్రతిది రైట్‌ అనే దానికి ఆయన వ్యతిరేకం. ఆయన మాటలు విని, వాటిలోని లోపాలను సరిచేస్తే అంగీకరించే గొప్ప వ్యక్తి. ఆయనకు కోపం ఎక్కువే...అలాగే సర్దుకుపోయే గుణం వున్న మనిషి. గాంధీని కలుసుకునేందుకు ఆశ్రమానికి ఎవరు వచ్చినా అక్కడ పాయఖానాలు కడగాల్సిందే. ఆశ్రమంలో ఆహార పదార్థాలు సిద్ధం చేయడానికి గోధుమలు ఇస్తే పిండి కోసం తిరగలిలో పోసి తిప్పాల్సిందే. 


గాంధేయవాదమే అమ్మ జీవన విధానం 

తాతగారు గోపరాజు సుబ్బారావు కాకినాడ కలెక్టరేట్‌లో తహసీల్దారుగా పనిచేసేవారు. ఆయన కుమారులే గోపరాజు రామచంద్రరావు (గోరా), సాంబశివరావు. నాకు మూడేళ్ల వయసులో నాన్న కాలం చేస్తే అమ్మ సామ్రాజ్యంతో కలిసి తాతగారింటికి వచ్చేశాం. అమ్మ హిందీ భాషలో కోర్సు చేయడానికి అనంతపురంలో శిక్షణ కళాశాలకు వెళ్లారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా కళాశాల మూతపడడంతో విజయవాడలో మేనమామ గోరా ఇంటికి వచ్చారు. 1944లో గోరాగారి సతీమణి సరస్వతి, ఆమె కుమార్తె మనోరమతో కలిసి అమ్మ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో ఆరు నెలలు రాయవెల్లూరు జైలుకు వెళ్లారు. ఇక్కడ క్షేమ సమాచారాలు చెబుతూ ఎప్పటికప్పుడు తాతగారు అమ్మకు ఉత్తరాలు రాసేవారు. ఉత్తరంలో ఏముందో తెలియకూడదని జైలు సిబ్బంది వాటిని నీళ్లలో ముంచి, ఇచ్చేవారని అమ్మ చెప్పేవారు. జైలు నుంచి వచ్చిన తరువాత మేనమామ సూచన మేరకు అమ్మతోపాటు మరో ఏడుగురిని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ నాగపూర్‌ సమీపంలోని సేవాగ్రామ్‌ ఆశ్రమానికి తీసుకువెళ్లి అక్కడ శిక్షణ ఇప్పించారు. శిక్షణ తరువాత రాజమండ్రి సమీపంలోని సీతానగరం గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి 1980 వరకు అమ్మ అక్కడే ఉండేవారు. అమ్మను చూడడానికి రాజమండ్రి నుంచి లాంచిలో వెళుతుండేవాణ్ని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఖాదీ వస్త్రాలనే ధరించారు. చరఖా వడికి దారం తయారుచేసేవారు. ఆమె నుంచే ఖాదీ ధరించే అలవాటు వచ్చింది. ఇప్పటికీ ఖద్దరు వస్త్రాలు ధరిస్తున్నా. అమ్మ సామ్రాజ్యం 98 సంవత్సరాలు వరకు జీవించారు. చివరి వరకు గాంధేయ వాదాన్ని అనుసరించారు. 1972లో ఆమెకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తామ్రపత్రం అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ ఇస్తామని అధికారులు చెప్పినప్పుడు తొలుత ఆమె తిరస్కరించారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు పింఛన్‌ తీసుకుని, కొద్దిమొత్తం ఉంచుకుని మిగిలినది ప్రేమ సమాజానికి ఇచ్చేవారు. అమ్మ చనిపోయే ముందు తన బ్యాంకు ఖాతాలో వున్న రూ.3 లక్షలు ప్రేమ సమాజానికి ఇవ్వమన్నారు. సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే భూమిని వద్దని చెప్పిన వ్యక్తిత్వం ఆమెది. మనకున్న దాంట్లో కొంత మొత్తం లేనివారికి ఇవ్వాలని చెప్పేవారు. నిబద్ధత, నిజాయితీ, సేవాగుణంతో బతకాలని, వాటినే ఆచరించాలన్న ఆమె సూచనలను పాటించాను. నిజాయితీ, నిస్వార్థమే ఊపిరిగా బతికే సమాజాన్ని చూశాను. ఈ సూత్రాలే జీవితంలో పనికి వచ్చాయి. 


నాటి నాయకత్వం ఏదీ? 

గాంధీ పిలుపుతో ఆసేతు హిమాచలం కదిలిపోయిన రోజులవి. దేశం నుంచి తెల్లదొరలను తరిమికొట్టాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండేది. నిరాడంబరత, నిజాయితీ, అంకితభాతం, నిబద్ధతతో ప్రజల మనసులను గెల్చుకున్న గాంధీ నాయకత్వానికి దేశం మొత్తం కదిలి ఆయన వెంట నడిచింది. ఇప్పుడు అటువంటి నాయకత్వం కనిపించడం లేదు. ఒకరు పిలిస్తే కదిలే రోజులు పోయాయి. తరం మారిందని అనే కంటే...నాయకత్వం వహించే వారిలో స్ఫూర్తి లోపిస్తోందనడం సబబు.  


మార్గదర్శి గాంధీ 

అధ్యాపకుడిగా సర్వీస్‌లో చేరిన తరువాత విశాఖ మన్యంలో 15 ఏళ్ల పాటు పాడేరు, అరకులోయ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌గా పనిచేశా. పాడేరు జూనియర్‌ కళాశాలకు వసతులు కల్పించడంలో అందరి సాయం తీసుకున్నా. 1978లో ప్రిన్సిపాల్‌గా పాడేరు వెళ్లేసరికి 27 మంది విద్యార్థులే ఉండేవారు. 1983లో ఎలమంచిలికి బదిలీపై వచ్చే సమయానికి 400 మంది విద్యార్థులు ఉన్నారు. కాలంతో పోటీపడి పరుగులు పెట్టే ఈతరం నిజాయితీ, నిస్వార్థం, అంకితభావం, సేవాగుణాలను అలవర్చుకోవాలి. మహాత్ముడి సూత్రాలు, ఆయన పాటించిన విలువలను ఇప్పుడు ప్రపంచంలో అనేకమంది ఆచరిస్తున్నారు. వాటిని ఇక్కడి యువత పుణికిపుచ్చుకోవాలి. బహుశా వాటినే భవిష్యత్తుకు ఆలంబనగా చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. 



Updated Date - 2022-08-15T06:33:06+05:30 IST