విశాఖ ఉక్కు... మన హక్కు!

ABN , First Publish Date - 2021-03-01T06:17:48+05:30 IST

‘‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు 1960వ దశకం విద్యార్థులు, యువత ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం. తెలుగు వారందరినీ ఏకం చేసి, మహోజ్వల పోరాటానికి తెరతీసిన అపూర్వ ఘట్టం.

విశాఖ ఉక్కు... మన హక్కు!

  • అప్పుడైనా... ఇప్పుడైనా...



‘‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు 1960వ దశకం విద్యార్థులు, యువత ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం. తెలుగు వారందరినీ ఏకం చేసి, మహోజ్వల పోరాటానికి తెరతీసిన  అపూర్వ ఘట్టం. ఆడిన మాట తప్పిన ఢిల్లీ పెద్దల చెవులు మెలిపెట్టి మరీ, సాధించుకున్న తెలుగు జాతి ఉక్కు సంకల్పానికి ప్రతీక... విశాఖ ఉక్కు కర్మాగారం. కొన్ని వేలమంది త్యాగఫలం, 32మంది ప్రాణత్యాగంతో పురుడుపోసుకున్న ఈ కర్మాగారం ప్రైవేటుపరం కానున్నదని తెలిసి తెలుగు సమాజం ఉలిక్కిపడింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని నిలిపిన ఈ ఫ్యాక్టరీని కాపాడుకొనేందుకు మరో ఉద్యమానికి పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా ఆనాటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న, మద్దతుగా గళం కలిపిన కొందరు మహిళలు తమ జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు. 







పోరాటం, త్యాగం పునాదులుగా...

- తుమ్మల కృష్ణాబాయి 


‘‘విశాఖ ఉక్కు ఉద్యమ జ్ఞాపకాలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఆ ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, పరోక్షంగా మద్దతుగా నిలిచాను. నా సహచరుడు తుమ్మల వేణుగోపాలరావు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కావడంతో, మేము ఆంధ్రా యూనివర్సిటీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత బలంగా సాగిన ఉద్యమం విశాఖ ఉక్కు పోరాటం. దీనిలో యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మార్కెట్‌ రోడ్డులో రోజూ జరిగే సభలు, సమావేశాల్లో వేణుగోపాలరావు పాల్గొని ప్రసంగించేవారు. ఆయనతో పాటు నేనూ చాలాసార్లు వెళ్లాను. ఆ ఉద్యమంలో ప్రముఖ రచయిత రావిశాస్త్రి ముఖ్య పాత్ర పోషించారు. అమృతరావు నిరాహార దీక్ష ఆ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారంతా ఒక్కటై, ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అని నినదించారు. నల్గొండ, వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన కాల్పుల్లో ఇరవై మంది విద్యార్థులు గాయపడ్డారు. జగిత్యాలలో పోలీసు కాల్పుల్లో సాయిరెడ్డి అనే వ్యక్తి కన్నుమూశారు. ఆ సమయంలో వరంగల్‌లో సాగిన పోరాట ఘటనల్ని ‘కొండపల్లి సీతారామయ్య సంస్మరణ వ్యాస సంకలనం’లో ప్రొఫెసర్‌ బీవీ సుబ్బారావు కళ్లకు కట్టారు. 1966, నవంబరు ఒకటో తేదీన విశాఖలో పోలీసు కాల్పులు యావత్‌ దేశాన్నీ కలవరపెట్టాయి. వాళ్ల కర్కశత్వానికి తొమ్మిదేళ్ల బాబూరావుతో సహా మరో ఎనిమిది మంది బలయ్యారు. ఆ రోజు విశాఖలో  యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ ఉద్యమంలో విశాఖ వాసులు మొత్తం పన్నెండు మంది ప్రాణాలు వదిలారు. 32 మంది ప్రాణ త్యాగ ఫలితమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. విశాఖ కర్మాగారం వస్తే, తమ జీవితాలు మారతాయని ఆ చుట్టుపక్కల గ్రామవాసులంతా కలలుగన్నారు. ఫ్యాక్టరీ కోసం 64 గ్రామాల్లో 26 వేల ఎకరాల భూమి సేకరించారు. కురుపాం జమీందారు ఆరువేల ఎకరాలు ఇచ్చారు. కొట్లాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం అన్యాయం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. సినీనటుడు ఆర్‌. నారాయణమూర్తి వంటి వాళ్లు ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మిగతా పౌరసమాజం కూడా స్పందించాలి. ప్రజా సంపద పరిరక్షణకు ప్రజలంతా ఏకమవ్వాలి.’’



నేటి విద్యార్థులూ స్పందించాలి!

- అరుణ కుమారి నాగుబడి


‘‘విశాఖ ఉద్యమంలో నేనూ చురుగ్గా పాల్గొన్నాను. అప్పుడు నేను గుంటూరు మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. మా నాన్న దండా నారాయణస్వామి తెలంగాణ సాయుధ పోరాటంలో కన్నుమూశారు. అప్పుడు నా వయసు రెండు నెలలు. మా నాన్న పోరాట స్ఫూర్తిని వింటూ పెరిగిన నాకు, చిన్నప్పటి నుంచి వామపక్ష ఉద్యమాల పట్ల అభిమానం. మోటూరి ఉష పరిచయంతో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)సంఘంలో క్రియాశీలంగా ఉండేదాన్ని. అప్పుడు నాకు రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా, అన్యాయంపై స్పందించాలని ఉండేది. అలా ఉక్కు ఉద్యమంలో భాగస్వామినయ్యాను. విశాఖలో 1966 నవంబరు ఒకటిన జరిగిన పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా, తెలుగునాట నలుచెరగులా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి నాయకులు చాగంటి భాస్కరరావు, నాగుబడి రామ్మూర్తి (తర్వాత నా సహచరుడు) తదితరులు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వాళ్ల మార్గ నిర్దేశకత్వంలో మహిళా కాలేజీ నుంచి మేమంతా ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షల్లో పాల్గొన్నాం. విశాఖలో పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ, గుంటూరులో పెద్ద ర్యాలీ జరిపాం. 200 మంది మహిళా కాలేజీ విద్యార్థినులం కలిసి కలెక్టరేట్‌ ముందు నిరాహారదీక్షకు కూర్చున్నాం. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ జరుపుతూండగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఒక్కో విద్యార్థిని పదిమంది పోలీసులు కలిసి కొట్టారు. అంతటితో ఆగక, బాష్పవాయువు ప్రయోగించారు. అప్పుడు విద్యార్థులతో పాటు సామాన్యులూ చాలామంది గాయపడ్డారు. అయితే, ఆ ర్యాలీలో అమ్మాయిలు పాల్గొనలేదు. మరొక రోజు మెడికల్‌ కాలేజీ విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారనే వార్త రావడంతో, పదివేల మంది విద్యార్థులు మూకుమ్మడిగా ఎస్పీ ఆఫీసును చుట్టుముట్టారు. అప్పటికే భయపడి ఎస్పీ, కలెక్టరు లాలాపేట పోలీసు స్టేషన్‌లో తలదాచుకున్నారు. అప్పుడు అక్కడ మూడుగంటల పాటు పెద్ద హైడ్రామా నడిచింది. విద్యార్థులు కాస్త చల్లబడడంతో పరిస్థితి సద్దుమణిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆనాడు అంతలా విద్యార్థిలోకం స్పందించింది. మరి, నేటి విద్యార్థులూ స్పందించాలి కదా.! స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్త వినగానే బాఽధ కలిగింది. ఆనాటి విద్యార్థుల పోరాట స్మృతులన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదిలాయి. వాళ్ళ త్యాగం వృథా కావలసిందేనా?’’





అలాంటి ఉద్యమం మళ్ళీ అవసరం

- రావెల అరుణ

‘‘అప్పుడు నేను గుంటూరు మహిళా కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. నా భర్త రావెల సోమయ్య నన్ను చదువులోనే కాదు, ప్రజాస్వామ్య ఉద్యమాల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఇందిరా గాంధీ ప్రభుత్వం మాట మార్చారని వార్తలు వచ్చాయి. తెన్నేటి విశ్వనాథం, కాకాని వెంకటరత్నం తదితర నాయకులు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించారు. ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు విశాఖ అనువైనదిగా కేంద్ర నిపుణులు సూచించినా, ఇందిరగాంధీ తమిళనాడు వైపు మొగ్గుచూపడంతో తెలుగు వారంతా భగ్గుమన్నారు. అందులో నేనూ ఒకరిని. అప్పుడు మా కాలేజీలోనూ ఇండో- సోవియట్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ విభాగం ఉండేది. దానిద్వారా వామపక్ష విద్యార్థి సంఘాలతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వాటితో కలిసి ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నాను. కొంతమంది అమ్మాయిలం కలిసి అనేక విద్యాసంస్థల్లో ఒక్కొక్క తరగతికీ వెళ్ళి, ఉక్కు పరిశ్రమ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ, ప్రచారం చేశాం. విశాఖలో పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాం. గాంధీ పార్కులో దీక్షా శిబిరం ఉండేది. కొందరు అమ్మాయిలు కూడా రిలే నిరాహారదీక్షలో కూర్చునేవారు. అప్పుడు గర్భవతిని కావడంతో నేను సంఘీభావం తెలిపేదాన్ని. స్వాతంత్ర్యోద్యమం తర్వాత ఆడపిల్లలు బయటకు వచ్చి పోరాడిన ఉద్యమం బహుశా ఇదే!. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం అవసరం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ప్రజలంతా కలిసి అడ్డుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కావాలనే పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. సొంత గనులు కేటాయించకుండా, విశాఖ ఉక్కు పట్ల వివక్ష చూపారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామంటున్నారు. కొన్ని వేలమందికి జీవనాధారమైన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం తెలుగు ప్రజల తక్షణ కర్తవ్యం. అందుకోసం పార్టీలకు అతీతంగా నాయకులందరూ ముందుకు రావాలి.’’





త్యాగఫలాన్ని అమ్మకానికి పెడతారా..!

- సంకు మనోరమ, ఏలూరు

‘‘విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం తెగనమ్మడం కన్నా దారుణం మరొకటుండదు. అందుకే, కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు పూనుకున్నారు. ఇందులో భాగంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు గుంటూరు నుంచి విశాఖపట్నానికి మోటారు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఆ యాత్ర ఫిబ్రవరి 15న తణుకు చేరినప్పుడు నేనూ   సంఘీభావం తెలిపాను. విద్యార్థినిగా... 1966లో... విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న నాకు ఆ బైక్‌ర్యాలీ నూతనోత్సాహాన్ని కలిగించింది. విశాఖ ఉక్కును కాపాడుకుంటామనే నమ్మకాన్ని కలిగించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 1966, అక్టోబరు 15న అమృతరావు విశాఖలో నిరాహార దీక్ష ప్రారంభించారు. వారం తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందన్న వార్త తెలుగునాట ఒక కదలిక తెచ్చింది. అప్పుడు నేను ఏలూరు సెయింట్‌ థెరిస్సా కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాను. మా నాన్న సంకు అప్పారావు స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కూడా. ఆయన ప్రోత్సాహంతో నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చాను. ఉక్కు ఫ్యాక్టరీ సాధన ధ్యేయంగా తెన్నేటి విశ్వనాథం కమిటీ సారథ్యంలో రాష్ట్ర బంద్‌ జరిగింది. తర్వాత విశాఖ, విజయవాడ, గుంటూరులో జరిగిన పోలీసు కాల్పుల్లో చాలామంది మరణించారు. అమృతరావు దీక్ష విరమించినా ఉద్యమం ఆగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ పట్టణాలలో దీక్షా శిబిరాలు వెలిశాయి. ఏలూరు, పేరయ్య కోనేరులోని దీక్షా శిబిరంలో కొంతమంది విద్యార్థులం కలిసి నిరాహార దీక్షలో కూర్చున్నాం. అనంతరం విజయవాడలో పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా, నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఏలూరు పార్లమెంటు సభ్యురాలు విమలాదేవి, శాసనసభ సభ్యురాలు అత్తలూరి సర్వేశ్వరరరావులు రాజీనామా చేసి, ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సాధించిన ఉక్కు పరిశ్రమను అంగట్లో అమ్మకానికి పెట్టడం, వారి త్యాగాలను అవమానపర్చడమే. ఇప్పటికైనా, తెలుగువారంతా కలిసి ఉద్యమించాలి. 

 (1966, ఉక్కు పోరాటం నాటి జ్ఞాపకం.. ఏలూరులో నిరాహారదీక్ష చేపట్టిన విద్యార్థులు...కింద కూర్చున్న వారిలో కుడి నుంచి రెండో వ్యక్తి మనోరమ)






తెలుగు రాష్ట్రాలు ఒక్కటై పోరాడాలి!

- కనపర్తి జ్యోత్స్న


‘‘విశాఖ ఉక్కు ఉద్యమం సమయంలో నేను ఉస్మానియా లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీలో చదువుతున్నాను. అప్పటికే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి నాయకత్వ బాధ్యతల్లో ఉన్నాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం హైదరాబాద్‌లోనూ పెద్ద పోరాటం జరిగింది. అప్పుడు దీక్షా శిబిరం సెక్రెటేరియేట్‌కు ఎదురుగా ఉండేది. మేమంతా రోజూ అక్కడికి వెళ్ళి రిలే నిరాహారదీక్షలో కూర్చొనేవాళ్లం. సురవరం సుధాకర్‌రెడ్డి, అజీజ్‌పాషా సారఽథ్యంలో ర్యాలీలు నిర్వహించాం. నగరం బంద్‌కు పిలుపునిచ్చాం. అదే రోజు చార్మినార్‌ నుంచి భారీ ఊరేగింపు తీశాం. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. సమర సమితి నాయకులు భాస్కరరావు, సాంబమూర్తి, వైవీ కృష్ణారావు, సల్లాముద్దీన్‌ తదితరులను అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులనూ నిర్బంధించారు. అయినా, పోరాటం కొనసాగింది. హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేపట్టిన ఏలూరు ఎమ్మెల్యే ప్రత్తి శేషయ్యను ఒక రోజు అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేసి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు అసెంబ్లీ అట్టుడికింది. శేషయ్య అరెస్టుపై ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి విశ్వనాథం సభలో నిలదీశారు. ఆ తర్వాత శాసనసభాపక్ష నాయకులుగా ఉన్న తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, తెన్నేటి విశ్వనాథం, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, గౌతు లచ్చన్నతో పాటు 67మంది శాసనసభ్యులు, ఏడుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. వారిలో గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్న కనపర్తి నాగయ్య కూడా ఒకరు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆనాడు వందల మంది విద్యార్థులు చదువులను పణంగా పెట్టి పోరాడారు. ఇప్పుడు మన జాతీయ సంపదను కార్పొరేట్‌ చేతుల్లో పెడుతుంటే... ఈనాటి యువత, విద్యార్థులు మౌనం వహించడం బాధాకరం. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలవాలి. మనమంతా ఒక్కటై, ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలి.’’


Updated Date - 2021-03-01T06:17:48+05:30 IST