ఉక్కు మీద కోపం!

ABN , First Publish Date - 2021-03-06T09:12:17+05:30 IST

విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సమయంలోనే... దీనికి అనుబంధంగా ఒక ఓడరేవు ఉండాలని ప్రతిపాదించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌), సెయిల్‌ కలిసి రూ.250 కోట్లతో గంగవరంలో పోర్టు

ఉక్కు మీద కోపం!

విశాఖ స్టీల్‌ స్థలాలపై మాత్రం ప్రేమ

సొంత పోర్టు ఏర్పాటుకు ససేమిరా..

సహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఆ తర్వాత తెరపైకి ‘గంగవరం పోర్టు’

ప్రభుత్వ ఆధ్వర్యంలో పెడతామని ప్రకటన

విశాఖ ఉక్కు నుంచి 1400 ఎకరాల 

విలువైన భూములు 98 కోట్లకే స్వాధీనం

తర్వాత... రంగంలోకి ప్రైవేటు సంస్థలు

విశాఖ ఉక్కు నుంచే అధికాదాయం

నామమాత్రంగానే ప్రభుత్వ వాటా


‘గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను రూ.1954 కోట్లకు కొనుగోలు చేసిన అదానీ సంస్థ! పోర్టులో మెజారిటీ వాటా కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు’’...


ఇది రెండు రోజుల కిందట వచ్చిన వార్త! ఈ వార్తలోని అసలు విశేషంలోకి వెళితే... అసలు గంగవరం పోర్టు ఎవరి ఆధీనంలో ఉండాల్సింది? దీనివల్ల ఎవరికి మేలు జరగాల్సింది? ఇది ఎందుకు ప్రైవేటుకు దక్కింది? ఈ మొత్తం క్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎలా అన్యాయం జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి! 


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సమయంలోనే... దీనికి అనుబంధంగా ఒక ఓడరేవు ఉండాలని ప్రతిపాదించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌), సెయిల్‌ కలిసి రూ.250 కోట్లతో గంగవరంలో పోర్టు నిర్మించుకుంటామని ప్రతిపాదించాయి. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలేవీ సహకరించలేదు. కానీ... 2004లో ప్రభుత్వ ఆధ్వర్యంలో గంగవరంలో ఓడరేవు పెడతామని ప్రకటించారు. దీనికోసం కోసం 1400 ఎకరాల విశాఖ ఉక్కు భూములనే లాక్కున్నారు. కానీ... ప్రభుత్వ పోర్టు కాస్తా, ప్రైవేటుగా మారింది. దుబాయ్‌ కన్సార్షియం (డీవీఎస్‌ రాజు బృందం) తెరపైకి వచ్చింది. పోర్టులో ప్రభుత్వ వాటా 10.4 శాతానికి మాత్రమే  పరిమిమైంది.  విశాఖ ఉక్కు నుంచి దక్కించుకున్న 1400 ఎకరాలకు కేవలం 98 కోట్లు చెల్లించారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మొక్కల పెంపకానికి అవసరమైన 800 ఎకరాలను జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతం దేవరాపల్లిలో కేటాయించారు.


ఎన్నో ప్రత్యేకతలున్నా...


గంగవరం పోర్టుకు 2005లో శంకుస్థాపన చేశారు. 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. విశాఖపట్నానికి చేరువలో, అన్ని కాలాల్లో పని చేయగల లోతైన రేవుగా గంగవరం పేరు సాధించింది. ఏటా 6.4 కోట్ల టన్నుల  సరుకుల ఎగుమతి, దిగుమతి సామర్థ్యం దీని సొంతం. 2019-20లో రూ.516 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతేకాదు... ఇది పూర్తి రుణ రహిత కంపెనీ. అయితే ఏం లాభం!? వచ్చే ఆదాయంలో పది శాతమే ప్రభుత్వానికి.. మిగిలిందంతా ప్రైవేటుకు! ఇక... 1400 ఎకరాలను చిల్లర ధరకే అప్పగించిన విశాఖ ఉక్కుకు పూర్తిగా చిల్లు! ఇదే పోర్టును విశాఖ ఉక్కు సొంతంగా ఏర్పాటు చేసుకుని ఉంటే.. తనకు అవసరమైన ఎగుమతులు, దిగుమతులు సులువు అయ్యేవి.


సొంత పోర్టు కావడంవల్ల ఖర్చులు కూడా మిగిలేవి. పైగా ఎంతోకొంత ఆదాయం కూడా వచ్చేది. ఇప్పుడు అవేవీ లేవు. అసలు విషయం ఏమిటంటే... గంగవరం పోర్టుకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం విశాఖ ఉక్కు నుంచే లభిస్తోంది. మరోవైపు... గంగవరం పోర్టు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెందిన విశాఖ పోర్టు ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అంతకుముందు స్టీల్‌ప్లాంటుకు అవసరమైన ముడి పదార్థాలన్నీ విశాఖపట్నం పోర్టు ద్వారా దిగుమతి అయ్యేవి. గంగవరం పోర్టు వచ్చాక ఆ వ్యాపారమంతా అటు వెళ్లిపోవడంతో విశాఖ పోర్టు దారుణంగా నష్టపోయింది. 


భూముల్లో పాగా వేసి...

పోర్టులకు భూముల ద్వారానే అధిక ఆదాయం వస్తోంది. ఇప్పుడు అన్నీ ల్యాండ్‌లార్డ్‌ పోర్టులుగా మారి లాభాలు గడిస్తున్నాయి. దిగుమతి, ఎగుమతి చేసుకునే సరకులను నిల్వ చేయడానికి పెద్ద పెద్ద యార్డులు అవసరం కావడం, వాటికి అద్దె రూపేణా ఎక్కువ ఆదాయం వస్తుండడంతో పోర్టులు పరిసరాల్లోని భూములపై కన్నేస్తున్నాయి. ఇప్పుడు గంగవరం పోర్టు ఆధీనంలో సుమారు 1,800 ఎకరాల భూములు ఉన్నాయి. పైగా గంగవరంలో మహా విశాఖ నగర పాలక సంస్థ నిర్మించిన 60 అడుగుల రహదారిని కూడా ఆక్రమించి ప్రహరీ కట్టేసింది. దీంతో అదొక ప్రత్యేక ప్రపంచంలా మారిపోయింది. స్టీల్‌ప్లాంటే ప్రధాన వినియోగదారు కావడంతో... ఆదాయానికి ఢోకాలేదు. ఇక ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ నిర్మాణానికి ఒప్పందం కోసం పలు సంస్థలు ముందుకురావడంతో ఈ పోర్టుకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది.


కొసమెరుపు: ప్రభుత్వం సొంత ఖర్చుతో ఓడరేవులు నిర్మించి, వాటిని ప్రైవేటుకు అప్పగిస్తామని ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అయితే, వైఎస్‌ అప్పుడెప్పుడో ప్రభుత్వ రేవు పేరిట విశాఖ ఉక్కు భూములు తీసుకుని, రేవును మాత్రం ప్రైవేటుకు కట్టబెట్టడం కొసమెరుపు.


మత్స్యకారులకు కష్టం...

పోర్టు నిర్మాణం కోసం సముద్రంలోకి వెళ్లకుండా చుట్టూ గోడ నిర్మించడంతో తాము ఉపాధి కోల్పోతామని, ప్రత్యామ్నాయం చూపాలని గంగవరం మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. గతంలో భారీగా ఆందోళనలు చేశారు. పోలీసుల కాల్పుల్లో ఒక మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ప్రభుత్వం దిగివచ్చింది. ఉపాధి కల్పించడానికి, వారి చేపలవేటకు అనువుగా దిబ్బపాలెంలో జెట్టీ నిర్మాణానికి అంగీకరించింది. ఇప్పటికీ ఆ హామీ అమలులోకి రాలేదు.

Updated Date - 2021-03-06T09:12:17+05:30 IST