అణగారిన వర్గాలకు మెరుగైన విద్య అందించాలి

ABN , First Publish Date - 2022-05-19T13:15:12+05:30 IST

సమాజంలో అణగారిన వర్గాలు, నిరుపేదలకు విద్య చేరువ చేసి, మెరుగైన విద్య అందించేందుకు జరిగే ప్రయత్నాల్లో విద్యార్థులు సైతం భాగస్వామ్యులు కావాలని భారత

అణగారిన వర్గాలకు మెరుగైన విద్య అందించాలి

                 - విద్యార్థులకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు


ప్యారీస్‌(చెన్నై): సమాజంలో అణగారిన వర్గాలు, నిరుపేదలకు విద్య చేరువ చేసి, మెరుగైన విద్య అందించేందుకు జరిగే ప్రయత్నాల్లో విద్యార్థులు సైతం భాగస్వామ్యులు కావాలని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నీలగిరి సమీపంలో ఉన్న లౌడేల్‌లోని లారెన్స్‌ పాఠశాలను బుధవారం వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య మార్పులకు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు. విద్య గణాత్మకమైన ఒత్తిడి అందిస్తూనే, దేశాభివృద్ధి వేగానికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. నేడు భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు భారతదేశ యువజన శక్తి కృషి ప్రశంసనీయమన్నారు. దేశంలో 60 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు యువత ఉన్నారని, యువజన సామర్ధ్యాన్ని దేశాభివృద్ధి కోసం వినియోగించుకోవలసిన అవసరాన్ని ఆయన ఉద్భోధించారు. భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జాతీయ నూతన విద్యా విధానం-2020 విప్లవాత్మక మార్పులకు నాంది పలుకగలదని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాచీనకాలంలో నలంద, తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా, విశ్వగురువుగా భారతదేశం భాసిల్లిందని, మళ్లీ ఆ వారసత్వాన్ని తిరిగి అందుకొనే ప్రయత్నాల్లో విద్యార్థులు భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు. నీలగిరిలోని లారెన్స్‌ పాఠశాల విద్యార్థులు చేపడుతున్న గిరిజన గ్రామాల్లోని నివాసాల పునర్నిర్మాణం, వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులకు చేయూతలాంటి అంశాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.రామచంద్రన్‌, నీలగిరి జిల్లా కలెక్టర్‌ అమృత్‌, లారెన్స్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్‌ సహా అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T13:15:12+05:30 IST