విష తుంగ

ABN , First Publish Date - 2022-06-29T05:55:26+05:30 IST

తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుందా..? అంటే అవుననే అంటున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.

విష తుంగ
తుంగభద్రలో చేరుతున్న మురుగునీరు

  1. 14 ప్రాంతాల్లో తుంగభద్ర నదిలోకే మురుగునీటి కాల్వలు
  2. రోజుకు 57 మిలియన లీటర్ల (ఎంఎల్‌డీ) మురుగు
  3. డ్రైనేజీల ద్వారా ఆసుపత్రుల వ్యర్థాలు కూడా..
  4. నదీజలాల్లో కలుస్తున్న పాలిథిన్, విషపూరితాలు
  5. మురుగు నీటి శుద్ధికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
  6. వైసీపీ వచ్చాక అసంపూర్తిగా ఎస్‌టీపీ ప్లాంట్లు
  7. తుంగభద్ర, హంద్రీ కాలుష్య నియంత్రణకు చర్యలేవి?

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుందా..? అంటే అవుననే అంటున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. కర్నూలు నగరపాలక సంస్థ డ్రైనేజీలను నేరుగా నదిలోకి వదిలేశారు. మురుగునీటి చేరికతో నదీ జలాలు కాలుషితం అవుతున్నట్లు నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ), సెంట్రల్‌ పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ) అధికారులు పరిశీలించారు. తుంగభద్ర జలాలు విషపూరితమవుతున్నాయని గుర్తించారు. కార్పొరేషనకు రూ.5.20 కోట్ల అపరాధ రుసుం చెల్లించమని నోటీసులు కూడా జారీ చేశారు. అంటే.. నది ఏ స్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకుందో ఇట్టే తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ.. రూ.9 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) నిర్మాణాలు చేపడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయి.


కర్నూలు నగరంలోని డ్రైయినేజీల ద్వారా వచ్చే మురుగు నీరు ఓల్డ్‌ తుంగభద్ర పంప్‌హౌస్‌, రోజా దర్గా, సంకల్బాగ్‌, సాయిబాబా టెంపుల్‌, బండిమెట్ట, రాంబోట్ల టెంపుల్‌ ఏరియా వంటి 14 ప్రాంతాల్లో నేరుగా తుంగభద్ర నదిలో కలుస్తోంది. అలాగే.. కల్లూరు, కల్లూరు ఎస్టేట్‌, దేవానగర్‌, కృష్ణానగర్‌, చెన్నమ్మ సర్కిల్‌, తదితర కాలనీలకు చెందిన మురుగునీరు హంద్రీనది, వక్కలేరు వాగుల్లో కలసి జోహరాపురం వంతెన సమీపంలో తుంగభద్ర నదిలో కలుస్తోంది. ఇది పూర్తిగా విషపూరితమని నిపుణులు గుర్తించారు. ఏ మేరకు కలుషితం అవుతున్నాయో తెలుసుకునేందుకు పొల్యూషన కంట్రోల్‌ బోర్డు అధికారులు నదిలో కలుస్తున్న మురుగు నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తే విషపూరితాలు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. నగరంలో 51 వార్డులు ఉన్నాయి. జనాభా 6 లక్షలు పైగానే ఉంది. తాగునీటి కోసం రోజుకు రోజకు 75 మిలియన లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేస్తున్నారు. అందులో 80 శాతం 60 ఎంఎల్‌డీ నీరు మురుగు కాల్వలకు చేరుతోంది. నీటి ఆవిరి పోను 57 ఎంఎల్‌డీ మురుగు నీరు తుంగభద్ర నదిలో విడుదల అవుతున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు.



అసంపూర్తిగా శుద్ధి కేంద్రాలు: 

కార్పొరేషన ఓల్డ్‌ పంప్‌హౌస్‌, సంకల్బాగ్‌, హంద్రీ నది దగ్గర ఏర్పాటు చేసిన మూడు మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) ద్వారా 2.40 ఎంఎల్‌డీల నీటినే శుద్ధి చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదు. పంప్‌హౌస్‌ దగ్గర ఎస్‌టీపీ మరమ్మతుల కారణంగా నిరుపయోగంగా మారింది. గత చంద్రబాబు ప్రభుత్వం మురుగు నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రూ.9 కోట్లతో హంద్రీ నదిపై దేవనగర్‌ వద్ద 2 ఎంఎల్‌డీల సామర్థ్యంలో ఎస్‌టీపీ, హంద్రీనది తుంగభద్రలో కలిసే జోహరాపురం బ్రిడ్జి వద్ద 10 ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేసే మరో ఎస్‌టీపీ నిర్మాణం 2018లో చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. పిల్లర్లతో అసంపూర్తిగా ఉన్నాయి. అయితే.. ఎలకో్ట్ర మెకానికల్‌ పరికరాలు కొనుగోలు చేసి త్వరలోనే పూర్తి చేస్తామని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లు అంటున్నారు. అలాగే.. 35 ఎంఎల్‌డీల మురుగు నీరు శుద్ధి చేసేందుకు రాంబొట్ల దేవాలయం సమీపంలో మరో ఎస్‌టీపీ నిర్మాణానికి రూ.79 కోట్లతో కార్పొరేషన్ ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా టెండర్లు పిలిచారు. 


నదిలోకి పాలిథిన్ కూడా..:

తుంగభద్ర నదిలోకి అనేక రకాల విషపూరితాలు మురుగు నీటి ద్వారా తుంగభద్రలో కలుస్తున్నాయని కాలుష్య నియంత్రణ నిపుణులు గుర్తించారు. పాలిథిన వ్యర్థాలు డ్రైయినేజీల ద్వారా నేరుగా నదిలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్‌లో ఉండే విషపూరిత రసాయనాలు నదీజలాల్లో కలిసే ప్రమాదం లేకపోలేదని ఓ ఇంజనీరు ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు. మురుగు నీటి ద్వారా ప్రమాదకర ఆర్సినిక్‌, కోలాల్ట్‌, నికెల్‌, కార్బన మోనాక్సైడ్‌.. వంటి ప్రమాదకరమైన విష పదార్థాలు నదిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లోని చిన్నచిన్న పరిశ్రమలు, మెకానిక్‌ షెడ్లు నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, వృథా అయిల్‌ కూడా నదీజలాల్లో కలుస్తున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. నదీతీరంలో కాలనీవాసులు దుర్గంధంతో సహజీనం చేస్తున్నారు. 



ఆస్పత్రుల వ్యర్థాలు: 

నగరంలో కార్పొరేట్‌ సహా వివిధ హోదాల్లో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడిక్కడే డీకంపోజింగ్‌ చేయాల్సి ఉంది. అలా చేయకుండా పలు ఆస్పత్రుల వ్యర్థాలు కూడా ముగురునీటి ద్వారా నదిలో కలుస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. తద్వారా ప్రమాద క్రిములు తుంగభద్రలో కలిసే ప్రమాదం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మాంసపు దుకాణాలు ద్వారా వచ్చే వ్యర్థాలు మెజార్టీగా హంద్రీ నది, వక్కిలేరు వాగు, తుంగభద్ర నది ఒడ్డునే వేస్తున్నారు. ఆ వ్యర్థాలు నదీజలాల్లో కలుస్తున్నాయి. 


తుంగభద్ర ప్రక్షాళన చర్యలు శూన్యం: 

తుంగభద్ర కాలుష్య నియంత్రణకు యుద్ధప్రాతి పదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. డ్రైనేజీ మురుగు నీటిని ఎక్కడికక్కడ తుంగభద్ర, హంద్రీ నదుల్లో కలపకుండా ప్రైత్యేక పైపులైన్ల ద్వారా మురుగు నీటిని ఓ ప్రాంతానికి చేర్చాలి. అక్కడే మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ (ఎస్‌టీపీ) ద్వారా శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన నీటిని నగరంలో భవన నిర్మాణాలు, పచ్చదనం మొక్కలకు, ఇతర అవసరాలకు వినియోగించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు నామమాత్రమే. గంగా నది తరహాలో తుంగభద్ర నది ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. అయితే.. మురుగునీటి చేరికతో కాలుష్యం ప్రభావం ఉంటుందని, నమూనాలు పూర్తిస్థాయిలో పరిశీలించి.. వివిధ రకాల రసాయనాలు కలిసినట్లయితే తప్పనిసరిగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


తుంగభద్రలో మురుగు నీరు చేరిక వాస్తవమే 

నగరంలో 14 ప్రాంతాల్లో మురుగు నీరు తుంగభద్రలో కలుస్తున్నట్లు గుర్తించాం. రోజుకు 57 ఎంఎల్‌డీ మురుగు నీరు చేరుతోంది. ప్రస్తుతం 2 ఎంఎల్‌డీల నీటినే శుద్ధి చేస్తున్నాం. 14 ఎంఎల్‌డీల మురుగు నీటి శుద్ధి కోసం పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లు రెండు ఎస్‌టీపీ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. నగరంలోని మురుగు నీరంతా పైపులైన ద్వారా రాంబొట్ల దేవాలయం సమీపంలోకి తీసుకొచ్చి అక్కడ రూ.79 కోట్లతో 35 ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపానదలు పంపి టెండర్లు పిలిస్తే సింగిల్‌ టెండర్‌ రావడంతో రద్దు చేసి రెండవ పర్యాయం టెండర్లు పిలుస్తున్నాం. ఇవి పూర్తి అయితే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. 

- సురేంద్రబాబు, ఎస్‌ఈ, కర్నూలు నగరపాలక సంస్థ: 


రూ.5.2 కోట్లు అపరాధ రుసుం విధించాం 

కర్నూలు నగరపాలక సంస్థ డ్రైయినేజీల ద్వారా మురుగునీరు తుంగభద్ర నదిలో కలుస్తోంది. తద్వారా నది కాలుష్యం అవుతున్నట్లు గుర్తించాం. రూ.5.20 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశాం. 

 - ఎంవీఎన్, పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు, కర్నూలు

Updated Date - 2022-06-29T05:55:26+05:30 IST