జీవీఎంసీలో కరోనా అలజడి

ABN , First Publish Date - 2020-07-14T16:07:26+05:30 IST

జీవీఎంసీలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. సీ సెక్షన్‌లో పనిచేస్తున్న..

జీవీఎంసీలో కరోనా అలజడి

ఒకేరోజు నలుగురు ఉద్యోగులకు పాజిటివ్‌

ఉద్యోగులందరికీ నిర్ధారణ పరీక్షలు

క్యూ కట్టిన ఉద్యోగులు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. సీ సెక్షన్‌లో పనిచేస్తున్న నలుగురికి సోమవారం వైరస్‌  నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఇప్పటికే అకౌంట్స్‌ విభాగం, సీ-సెక్షన్‌లో ఒక్కొక్కరికి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.  దీంతో సోమవారం కార్యాలయం తెరవగానే ఉద్యోగులు విధుల్లో చేరడానికి భయపడిపోయారు.  వైరస్‌ మరికొందరికి వ్యాప్తిచెంది ఉంటుందనే భావనతో కొన్ని సెక్షన్లను మూసేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఉద్యోగుల ఆందోళనను గుర్తించడంతోపాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి జీవీఎంసీ కార్యాలయంలోనే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం వంద మందికి పరీక్షలు నిర్వహించగా, ఇంకా హైరిస్క్‌ గ్రూపులో ఉన్నవారిని గుర్తించి వారికి మరోసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.


కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని తెలియడంతో ఉద్యోగులు పరీక్షలు చేసుకునేందుకు పోటీపడ్డారు. సెల్లార్‌లోకి అందరూ స్వచ్ఛందంగా ఒకేసారి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ముందుగా ఉద్యోగులు తమ పేర్లను నమోదుచేసుకున్న తర్వాత వైద్యులు ప్రత్యేక వాహనంలో వచ్చి ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు భారీగా బారులు తీరారు. వీరిని చూసి వివిధ పనులపై జీవీఎంసీ కార్యాలయానికి వచ్చినవారంతా భయంతో వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది. 


Updated Date - 2020-07-14T16:07:26+05:30 IST