Advertisement

మూడో దశలోకి ప్రవేశిస్తున్నట్టే..

Jun 30 2020 @ 10:32AM

మూడో దశలోకి ప్రవేశిస్తున్నట్టే..

కొన్ని కేసుల కాంటాక్ట్‌ హిస్టరీ దొరకడం లేదంటున్నారు

సామాజిక వ్యాప్తి మొదలైతే పరిస్థితి ఆందోళనకరం

త్రిముఖ సూత్రం మరవొద్దు..

లక్షణాలుంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం మేలు

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి

‘ఆంధ్రజ్యోతి’తో ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ కేఎస్‌ ఫణీంద్రకుమార్‌


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ‘తెలంగాణతో పోలిస్తే వైరస్‌ తీవ్రత మన దగ్గర కొంత తక్కువగానే ఉంది. విశాఖలో వైరస్‌ వ్యాప్తి కొంత మెల్లగానే వున్నప్పటికీ... జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో విజృంభించే అవకాశం ఉంది. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి...’ అని అంటున్నారు కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రి పల్మనాలజీ వైద్య నిపుణుడు డాక్టర్‌ కేఎస్‌ ఫణీంద్రకుమార్‌. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి, తీవ్రత, రానున్న రోజుల్లో పరిస్థితులు, తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 


అప్రమత్తత అవసరం

రానున్న రోజుల్లో వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక వ్యాప్తికి సంబంధించి ఐసీఎంఆర్‌ నుంచి ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రానప్పటికీ...కొన్ని కేసుల కాంటాక్ట్‌ హిస్టరీ దొరకడం లేదని తెలుస్తోంది. దీనిని బట్టి మెల్లగా మూడో దశలోకి మనం ప్రవేశిస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. సామాజిక వ్యాప్తి మొదలైతే పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారే అవకాశముంది. వందలాది కేసులు వస్తాయి. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, కేన్సర్‌, కిడ్నీ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వర్గాలకు చెందినవారు వైరస్‌ బారినపడితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశముంది. బయటకు వెళ్లే వ్యక్తుల ద్వారానే ఇంటిలోకి వైరస్‌ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కోసం ఒకరు మాత్రమే బయటకు వెళ్లాలి. పిల్లలను వెంట తీసుకుని వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు.


పాజిటివ్‌ వచ్చినా ఆందోళన వద్దు.. 

దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో ఇతరులకు దూరంగా ఒక గదికి పరిమితం కావడం మంచిది. పరీక్ష చేయించుకుని, రిపోర్ట్‌ వచ్చేంత వరకు ఇదే ఫార్ములా పాటించాలి. ఒకవేళ దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతి స్వల్ప కేసుల్లో మాత్రమే..అదీ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రమే ఈ వైరస్‌ కొంత ఇబ్బందికరంగా పరిణమించేందుకు అవకాశముంది. మిగిలిన వారిలో సాధారణ ఫ్లూ బారినపడిన లక్షణాలు మినహా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆందోళన చెందకుండా ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొంది సురక్షితంగా ఇంటికి చేరవచ్చు.   


త్రిముఖ సూత్రం మరవొద్దు.. 

కరోనా బారినపడకుండా వుండేందుకు ఒక్కటే మార్గం. త్రిముఖ సూత్రాన్ని ఆచరిం చడమే. సామాజిక దూరం పాటించడం, బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం. ఈ త్రిముఖ సూత్రాన్ని పాటిస్తే వైరస్‌ బారినపడకుండా ఉండవచ్చు.


ప్రచారం అవాస్తవం.. 

చేతిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం ద్వారా వైరస్‌ దానికి అలవాటుపడి బతికేస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌పై వుండే ప్రొటీన్‌ (పొర) నాశనం అయి వైరస్‌ పోతుంది. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.