విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీల భిన్న స్వరాలు

ABN , First Publish Date - 2021-12-09T22:19:13+05:30 IST

లోక్‌సభ జీరోఅవర్‌లో విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు.

విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీల భిన్న స్వరాలు

ఢిల్లీ: లోక్‌సభ జీరోఅవర్‌లో విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనల్లో ఎక్కడా విశాఖ రైల్వేజోన్‌ ప్రస్తావనే లేదన్నారు. రైల్వేజోన్‌పై కేంద్రం పూటకోమాట మాట్లాడుతోందని భరత్‌ విమర్శించారు. అయితే భరత్‌ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వైసీపీ ఎంపీ సత్యవతి మాట్లాడారు. రైల్వేజోన్‌ ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు సత్యవతి చెప్పారు. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అందులో విశాఖ జోన్‌ కనిపించ లేదు. పైగా దేశంలో కొత్త రైల్వే జోన్‌ను మంజూరు చేసే అవకాశమే లేదని ఆయన సెలవిచ్చారు. ఇదే మంత్రి వారం రోజుల క్రితం (డిసెంబరు 1న) పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్త దక్షిణ కోస్తా జోన్‌కు 2020-21 బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించామని.. ఈ జోన్‌కు తూర్ప కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్‌తో కలిపి రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు.

Updated Date - 2021-12-09T22:19:13+05:30 IST