విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం

ABN , First Publish Date - 2021-03-01T06:07:14+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా..

విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం
వాసుపల్లి గణేశ్‌కుమార్, గరికిన గౌరి

అభ్యర్థుల జాబితా ప్రకటనతో అసంతృప్తి సెగలు

గతంలో టిక్కెట్‌ దక్కించుకున్న వారిలో ముగ్గురి పేర్లు గల్లంతు

34వ వార్డులో గరికన గౌరి బదులు తోట పద్మావతికి టిక్కెట్టు

36వ వార్డులో కొప్పుల స్వర్ణలత స్థానంలో మాసిపోగు మేరీజోన్స్‌

37వ వార్డులో వడ్డాది రాజు అవుట్‌....  చెన్నా జానకిరామ్‌ ఇన్‌

అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి

ఇండిపెండెంట్లుగా బరిలో దిగాలని నిర్ణయం

మరో ముగ్గురు ఆశావహులదీ అదే దారి


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థుల మలి జాబితాను వైసీపీ ఆదివారం విడుదల చేయడంతో దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైంది. గతంలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా టిక్కెట్లు దక్కించుకున్నవారిలో కొందరి పేర్లు తాజా జాబితాలో కనిపించలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నేతలపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఇండిపెండెంట్లుగా పోటీలో కొనసాగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆయా స్థానాల్లో కొత్తగా టిక్కెట్లు పొందిన అభ్యర్థులపాటు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.


జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకుగాను 13 వార్డులు దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. గత ఏడాది మార్చిలో జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అప్పట్లో దక్షిణ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్‌... తన అనుచరులు, పార్టీ విధేయులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోవడం, అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిచెందడంతోపాటు టీడీపీ తరపున దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నియోజకవర్గంలో తన పట్టు కొనసాగేందుకు గతంలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా టిక్కెట్టు దక్కించుకున్న వారిలో కొందరిని మార్చాలని ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభం కావడంతో దక్షిణ నియోజకవర్గం పరిధిలో టిక్కెట్లు దక్కించుకున్నవారిలో చాలామందిని మార్చేస్తారని ప్రచారం సాగింది. అనుకున్నట్టుగానే పలు నియోజకవర్గాల పరిధిలోని వార్డులకు అభ్యర్థులను గత శుక్రవారం ప్రకటించిన అధిష్ఠానం... దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వార్డులకు మాత్రం ప్రకటించలేదు. చివరకు ఆదివారం దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 13 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో టిక్కెట్లు పొందిన వారిలో ముగ్గురి పేర్లు తాజా జాబితాలో లేవు. మరికొన్ని వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసి, టిక్కెట్‌ ఖరారవుతుందన్న ఆశతో వున్న వారి పేర్లు కూడా జాబితాలో కానరాలేదు. 


గతంలో 34వ వార్డు టిక్కెట్టు దక్కించుకున్న గరికన గౌరిని తప్పించి, తోట పద్మావతికి కేటాయించారు. 36వ వార్డులో కొప్పుల స్వర్ణలత బదులు మాసిపోగు మేరీజోన్స్‌కి, 37వ వార్డులో వడ్డాది రాజు స్థానంలో చెన్నా జానకిరామ్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నేతల తీరును ఎండగడుతున్నారు. ఏడాదిపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వార్డుల్లో కార్యక్రమాలు చేపడితే ఇప్పుడు పక్కనపెట్టేయడం దారుణమని ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఇండిపెండెంట్‌లుగా పోటీ చేసి, సత్తాచాటుతామని పార్టీ నేతల వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా కొత్త జాబితాలో అయినా తమకు టిక్కెట్టు దక్కుతుందన్న కొండంత ఆశ పెట్టుకున్న 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు, 35వ వార్డు అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావుతోపాటు 39వ వార్డులో మహ్మద్‌సాధిక్‌లకు నిరాశ ఎదురవడంతో తాము కూడా ఇండిపెండెంట్లుగా పోటీలో కొనసాగుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయా వార్డుల్లోని వైసీపీ అభ్యర్థులు గుబులు చెందుతున్నారు. 

Updated Date - 2021-03-01T06:07:14+05:30 IST