విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు!

ABN , First Publish Date - 2021-04-12T09:17:10+05:30 IST

‘పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ షెడ్యూల్డ్‌ ఏరియాస్‌’ (పీసా), అటవీ హక్కుల చట్టాల ప్రకారం షెడ్యూల్డ్‌ ఏరియాలో గనుల తవ్వకాలను కేవలం గిరిజనులు, గిరిజన సహకార సంఘాలు మాత్రమే

విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు!

కాల్సైట్‌పై ఇద్దరు పెద్దల కన్ను?

ఓ మాజీ ప్రజాప్రతినిధికి బాధ్యత!

ఆయన బినామీల ద్వారా టెండర్‌

గిరిజనులు, సంఘాలు పోటీకి రాకుండా ఏపీఎండీసీ కఠిన నిబంధనలు

రూ.5 లక్షల డిపాజిట్‌ చెల్లించాలి

ఖనిజ తవ్వకాలకు ముందుగానే సొంత యంత్రాలు ఉండాలి

వాటిని కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్‌లు సమర్పించాలి

గిరిపుత్రులను అడ్డుకోవడానికే సవాలక్ష ఆంక్షలు!


విశాఖ ఏజెన్సీలోని కాల్సైట్‌ గనులను కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ పెద్దలిద్దరు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పనులను గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఒక నాయకుడికి అప్పగించినట్లు సమాచారం. నేరుగా తానే లీజులు పొందితే ఇబ్బందులు వస్తాయని.. ఆయన బినామీలను తెరపైకి తీసుకొచ్చారు. గిరిజనులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ఏపీఎండీసీ కూడా సవాలక్ష నిబంధనలతో యథాశక్తి సహకరించింది.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ షెడ్యూల్డ్‌ ఏరియాస్‌’ (పీసా), అటవీ హక్కుల చట్టాల ప్రకారం షెడ్యూల్డ్‌ ఏరియాలో గనుల తవ్వకాలను కేవలం గిరిజనులు, గిరిజన సహకార సంఘాలు మాత్రమే చేపట్టాలి. ఇతరులకు ఇవ్వరాదని సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పింది. అలా ఇచ్చిన లీజులను రద్దుచేసింది కూడా. అయినప్పటికీ జగన్‌ ప్రభుత్వంలోని పెద్దలు ఖాతరు చేయడం లేదు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం నిమ్మలపాడులో కాల్సైట్‌ గనుల తవ్వకాలకు సంబంధించి ఏపీఎండీసీ.. గ్రామ సభ తీర్మానం లేకుండానే ఈ-టెండర్‌ ఆహ్వానించి నిబంధనలను ఉల్లంఘించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వైసీపీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనులు గానీ, గిరిజన సహకార సొసైటీలు గానీ టెండర్లలో పాల్గొనే వీల్లేకుండా ఏపీఎండీసీ కఠినతరమైన నిబంధనలు విధించింది.


టెండర్‌లో పాల్గొనే వ్యక్తులు/సంస్థలు రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని, గనుల తవ్వకాల కోసం అవసరమైన యంత్ర సామగ్రి (విలువ సుమారు రూ.6-7 కోట్లు) సొంతంగా కలిగి ఉండాలని.. తవ్వకాలకు వినియోగించే డోజర్లు, హైడ్రాలిక్‌ ఎక్స్‌కవేటర్లు, డంపర్లు కొనుగోలు చేసిన ఇన్‌వాయి్‌సలు పొందుపరచాలని స్పష్టం చేసింది. సాధారణంగా ఎంత పెద్ద కాంట్రాక్టరైనా గనుల తవ్వకాలకు అవసరమైన యంత్రాలన్నింటినీ సొంతంగా,  ముందుగానే సమకూర్చుకోడు. కొన్నింటిని అద్దెకు తెచ్చుకుంటాడు. టెండర్‌ కోసం కొత్తగా యంత్రాలు కొనుగోలు చేస్తే.. చివరకు అది రాకపోతే వాటిని ఏం చేయాలి? ఇలాంటి నిబంధనలు విధించడంలోని ఆంతర్యమేంటి? ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సదరు యంత్రసామగ్రిని ముందే కొనుగోలు చేసిన అధికార పార్టీ పెద్దలు.. బినామీతో బిడ్‌ దాఖలు చేయించాలని నిర్ణయించారు. ఇక గిరిజన సొసైటీలు కన్సార్షియంగా ఏర్పడి టెండర్‌లో పాల్గొనరాదని మరో నిబంధన విధించారు. అంటే.. టెండర్‌లో స్థానికంగా ఉండే గిరిజనులు గానీ, గిరిజన సహకార సొసైటీలు గానీ పాల్గొనకుండా పట్టుబిగించారన్న మాట.


టెండర్‌ దాఖలు కోసం వ్యక్తిగతంగా రూ.ఐదు లక్షలు డిపాజిట్‌ చేసేంత స్థోమత స్థానిక గిరిజనులకు లేదు. ఆరేడు కోట్లు పెట్టి ముందుగానే యంత్ర సామగ్రి కొనుక్కునే అవకాశం అసలే లేదు. చివరకు సొసైటీలకు కూడా అంత సామర్థ్యం లేదనే చెప్పాలి. తమకు ఎవరూ పోటీ రాకూడదనే ఉద్దేశంతోనే ఏపీఎండీసీపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ఈ విధంగా టెండర్‌ నిబంధనలు మార్పించారని స్థానిక గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.


125 ఎకరాల్లో..

ఏజెన్సీలో కరకవలస, రాళ్లగరువు, నిమ్మలపాడు పరిసరాల్లో సుమారు 125 ఎకరాల్లో మేలు రకం కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది. వీటిని చేజిక్కించుకోవడానికి ఐదు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1990ల్లో బిర్లా కంపెనీ నిమ్మలపాడు పరిసరాల్లో కాల్సైట్‌ తవ్వకాలకు లీజులు పొందింది. స్థానిక గిరిజనుల ఉపాధి, వ్యవసాయం, జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనేతరులకు లీజులు ఇవ్వరాదని.. ఇంకా గ్రామసభ తీర్మానం లేకుండా లీజులు ఇవ్వడం చెల్లదని సమత స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బిర్లాకు ఇచ్చిన లీజులు రద్దు చేసింది. తర్వాత 1995లో ఏపీఎండీసీ నిమ్మలపాడు పరిసరాల్లో 20 హెక్లార్ల వరకు లీజుకు తీసుకుంది. అప్పటి నుంచి వాటిని ఇతరులకు లీజుకివ్వడానికి ప్రయత్నిస్తోంది. 2015లో టెండర్‌ ఆహ్వానిస్తే స్థానికంగా ఉండే అభయ గిరిజన మ్యూచువల్‌ ఎయిడెడ్‌ లేబర్‌ కాంట్రాక్టు కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ కోర్టును ఆశ్రయించడంతో రద్దు చేశారు. ఆ తర్వాత అదే సొసైటీ తమకే ఆ గనులు లీజుకివ్వాలని నేరుగా ఏపీఎండీసీకి దరఖాస్తు చేసుకుంది. దానిని పక్కనపెట్టి 2016లో 5.6 హెక్టార్లలో కాల్సైట్‌ తవ్వకాలకు ఏపీఎండీసీ టెండర్లు ఆహ్వానించింది. అయితే బిడ్డింగ్‌లో ఎల్‌-1, ఎల్‌-2గా నిలిచినవారు గనులు తీసుకునేందుకు ముందుకురాలేదు. అభయ సొసైటీ ఎల్‌-3గా వచ్చింది. అయినప్పటికీ దానికి ఖరారు చేయలేదు. అప్పటి నుంచి గనుల కోసం ఈ సొసైటీ దరఖాస్తు చేస్తున్నా ఏపీఎండీసీ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత నిమ్మలపాడులో 8.725 హెక్టార్ల విస్తీర్ణంలో కాల్సైట్‌ తవ్వకాలకు కనీస నిబంధనలు పాటించకపోగా.. గిరిజనులు, వారి సొసైటీలు పాల్గొనడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టి టెండర్లు పిలిచింది. విలువైన ఖనిజ నిక్షేపాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పెద్దలు ఇలా పావులు కదుపుతున్నారు. కాల్సైట్‌ తవ్వకాలకు స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినందువల్లే ఓ మాజీ ప్రజా ప్రతినిధికి ఇటీవల పదవి కట్టబెట్టినట్టు సమాచారం. 


గిరిజనులకు అప్పగించాలి

ఏజెన్సీలో గనులపై గిరిజనులకే అధికారముంది. తవ్వకాలు చేపట్టాలనుకుంటే వారికే అవకాశమివ్వాలి. ఒకరిద్దరు కలిసి పనిచేసే అవకాశం లేకపోతే సహకార సంఘంగా ఏర్పాటుచేసి వారికి ఇవ్వాలి. టెండర్‌ దాఖలు నిబంధనలు కఠినతరం చేయడం దారుణం. ఇటువంటి పరిస్థితుల్లో బినామీలను ఏపీఎండీసీయే ప్రోత్సహిస్తోందన్న అనుమానం కలుగుతుంది. నిమ్మలపాడులో లీజుకు ఇవ్వాలనుకుంటున్న 8.725 హెక్టార్లు.. స్థానిక గిరిజనులకు చెందిన పట్టా భూమి. అది వారికి కాకుండా బయట వ్యక్తులకు ఎలా ఇస్తారు? ఏపీఎండీసీ మొండిగా వెళ్తే గిరిజనుల నుంచి వ్యతిరేకత వస్తుంది.

రెబ్బాప్రగడ రవి, సమత స్వచ్ఛంద సంస్థ

Updated Date - 2021-04-12T09:17:10+05:30 IST