విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు

ABN , First Publish Date - 2021-03-01T09:01:19+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దని కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ కోరారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు

నష్టాలకు కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణం

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ఆక్షేపణ

ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలకు లేఖలు


విశాఖపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దని కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ కోరారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ద్వారా ప్రధాని మోదీకి లేఖ పంపారు. విశాఖ ప్రజల మనోభావాలు, కర్మాగారం ఏర్పాటుకు జరిగిన ఉద్యమాల గురించి లేఖలో ప్రస్తావించారు. సొంత గనులు కేటాయించి ఉంటే విశాఖ ఉక్కు నష్టాలబారిన పడేదికాదని, ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకే వచ్చేదికాదన్నారు. నష్టాల బూచి చూపి 100 శాతం వాటాలు విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీ సెక్రటరీలు విధివిధానాలు రూపొందించడం తగదన్నారు. ఫిబ్రవరి 9న విశాఖ కు చెందిన పలువురు ప్రముఖుల సంతకాలతో లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.


పోస్కోతో ఆర్‌ఐఎన్‌ఎల్‌(విశాఖ స్టీల్‌ ప్లాంట్‌)కు 2019 అక్టోబరులో జరిగిన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన మరో లేఖ రాశారు. ఆ ఒప్పందం వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ బహిర్గతం చేసిన నేపథ్యంలో శర్మ ఈ లేఖ రాశారు. ఆ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, అది దేశ సార్వభౌమాధికారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కెయిర్న్‌ ఎనర్జీ, వోడాఫోన్‌తో ఒప్పందాలతో వాటిల్లిన నష్టాలను ప్రస్తావించారు. భారతదేశానికి సొంత చట్టాలు ఉన్నాయని గుర్తుచేశారు. విశాఖ ఉక్కుపై జరుగుతున్న ప్రజాందోళనలు, ఆంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం పునరాలోచన చేయాలని శర్మ కోరారు.

Updated Date - 2021-03-01T09:01:19+05:30 IST