ఇదేం రోగం..?

ABN , First Publish Date - 2022-05-23T05:35:44+05:30 IST

ఇదేం రోగం..?

ఇదేం రోగం..?
ఆసుపత్రిలో పర్యటిస్తున్న నవీన్‌కుమార్‌

బందరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యపు జబ్బు

గైనిక్‌ వార్డులో అడుగడుగునా అవస్థలు

తెరుచుకోని ఆపరేషన్‌ గది

పనిచేయని ఆరోగ్యమిత్రల ఫోన్‌ నెంబర్లు

బదిలీపై వెళ్లిన వైద్యులు, సిబ్బందికి హాజరు ఇక్కడే

 వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ పరిశీలనలో నిజాలు


తెరుచుకోని గైనిక్‌ ఆపరేషన్‌ గది.. తప్పులతడకగా హాజరుపట్టీ.. అక్కరకు రాని ఆరోగ్యమిత్రలు.. పనిచేయని ఫోన్‌ నెంబర్లు.. ఎంతమంది రోగులకు అన్నం పెట్టారో అందుబాటులో లేని వివరాలు.. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ శనివారం ఐదు గంటల పాటు జరిపిన పరిశీ లనలో వెల్లడైన నిజాలు.. నిర్లక్ష్యపు రోగాలివీ..


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి తీరే వేరు. 450 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ ఆసుపత్రిలో రోజూ 1,500 మందిపైగా ఓపీ సేవలు పొందుతున్నారు. అయితే, ఈ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరు, ఎక్కడ పనిచేస్తారో,  ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. అభివృద్ధి కమిటీ ఉన్నా సమావేశాలతో సరిపుచ్చడం తప్ప పరిపాలనను గాడిలో పెట్టేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోదు. ఒకరిద్దరు వైద్యులు తప్ప మిగిలిన వారెవరూ రోగులకు అందుబాటులో ఉండరు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్‌ నవీన్‌కుమార్‌ ప్రభుత్వాసుపత్రిని శనివారం పరిశీలించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన ఒక్కరే వచ్చి ఆసుపత్రిలోని ఆయా విభాగాలకు వెళ్లి రోగులకు అందుతున్న సేవల తీరును ఐదు గంటలపాటు నిశితంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆయన ఆసక్తికర అంశాలను గమనించారు. 

తెరుచుకోని ఆపరేషన్‌ థియేటర్లు

నవీన్‌కుమార్‌ పరిశీలన సమయంలో సూపరింటెండెంట్‌ జయకుమార్‌, ఆర్‌ఎంవోను మినహా మరెవ్వరినీ దగ్గరకు రానీయలేదు. రూ.16 కోట్లతో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన  గైనిక్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్లను వినియోగించకపోవడం ఆయన పరిశీలనలో వెల్లడైంది. ఈ సమయంలోనే ఆపరేషన్‌ ద్వారా ప్రసవించినమహిళకు కుట్లు ఊడిపోతున్నాయనే అంశంపై బంధువులు ఆసుపత్రి వర్గాలతో వాదనకు దిగారు. ఈ విషయాన్ని గమనించిన నవీన్‌కుమార్‌ఆపరేషన్‌ థియేటర్లను ఏ కారణంతో వినియోగించలేదని ప్రశ్నించారు. ఈ అంశంపైనా ఆయన రిమార్కులు రాశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించిన ఆయన అన్ని అంశాలనూ నోట్‌ చేసుకున్నారు.  

తప్పులతడకగా హాజరు

అనంతరం నవీన్‌కుమార్‌ హాజరును పరిశీలించారు. బదిలీపై వెళ్లిన వైద్యులు, ఆసుపత్రిలో అందుబాటులో లేని వైద్యులు, సిబ్బంది ఇక్కడ సంతకాలు చేస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. హాజరు పట్టీలపైనా ఆయన రిమార్కులు రాశారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ విభాగంలో వైద్యసేవలు పొందినవారి వివరాలను పరిశీలించిన ఆయన స్కానింగ్‌ తీయించుకున్న వారితో ఫోన్‌లో మాట్లాడారు. ఏమైౖనా ఇబ్బందులు పడ్డారా అని ఆరా తీశారు. 

రోగులకు పెట్టే భోజనానికి లెక్కేలేదు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందించే భోజనశాలను నవీన్‌కుమార్‌ పరిశీలించారు. ఎంతమంది రోగులకు ఈరోజు భోజనం పెడుతున్నారనే అంశంపై ఆరా తీశారు. సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. భోజనం వండే గది  అపరిశుభ్రంగా ఉండటం, నాణ్యతలేని కూరగాయలు కనిపించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. 

పనిచేయని ఆరోగ్యమిత్రల ఫోన్‌ నెంబర్లు

ఆరోగ్యశ్రీ విభాగాన్ని పరిశీలించిన సమయంలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. అక్కడున్న బోర్డ్డుపై ఉన్న ఆరోగ్యమిత్రలు, సూపర్‌వైజర్‌ నెంబర్లకు ఫోన్‌ చేయగా, పని చేయలేదు. దీంతో ఆయన ఆసుపత్రి గోడపై ఉన్న ఆర్‌ఎంవో నెంబర్‌కు కాల్‌ చేశారు. అది కూడా పని చేయలేదు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న ఆర్‌ఎంవోను మీ నెంబరు ఏ కారణంతో పనిచేయట్లేదని ప్రశ్నించారు. తాను ఇంకా ఆ నెంబరును తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఆరోగ్యశ్రీ విభాగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇతర వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆయన్ను ఆదేశించారు. 

వివాదాల్లో ఆరోగ్యశ్రీ విభాగం

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో 30 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారు. వీరిలో పదిమంది వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాటలు కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 



Updated Date - 2022-05-23T05:35:44+05:30 IST