గంగమ్మ విశ్వరూపం

ABN , First Publish Date - 2022-05-19T07:39:38+05:30 IST

తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం..చెంప నరుకుడుతో వారం రోజుల తిరుపతి గంగజాతర వేడుక ముగిసింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పేరంటాళ్ల వేషం ధరించిన కైకాల కులస్తుడు సాంబ గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు.భక్తుల అమ్మవారి నామస్మరణల మధ్య చెంప నరికారు.

గంగమ్మ విశ్వరూపం

పులకించిన భక్తజనం


చెంప నరికిన పేరంటాళ్లు


 తిరుపతి, మే 18 (ఆంధ్రజ్యోతి) : తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం..చెంప నరుకుడుతో వారం రోజుల తిరుపతి గంగజాతర వేడుక ముగిసింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పేరంటాళ్ల వేషం ధరించిన కైకాల కులస్తుడు సాంబ గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆచారులు విశ్వరూప స్తంభానికి ఎండుగడ్డి, బంకమన్నుతో అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసి ఉండడంతో భక్తుల అమ్మవారి నామస్మరణల మధ్య  చెంప నరికారు.విశ్వరూప ప్రతిమ మట్టి కోసం భక్తులు ఎగబడ్డారు.దొరికినవారు పవిత్రంగా భావించి ఇంటికి తీసుకెళ్లారు. కాగా మంగళవారం అర్ధరాత్రి నుంచే మగాళ్లు...స్ర్తీ వేషాలు ధరించి డప్పుల వాయిద్యాల నడుమ ఒక్కో వీధి నుంచీ బృందాలుగా ఏర్పడి చిందులేస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు సైతం పూనకంతో ఊగిపోతూ కనిపించారు. ఆలయానికి చేరుకుని వజ్రకిరీటధారి అయిన గంగమ్మను దర్శించుకున్న అనంతరం విశ్వరూప దర్శనం కోసం అక్కడే ఉండిపోయారు.ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, డిప్యూటీ మేయరు అభినయ్‌ రెడ్డి, ఆలయ ఛైర్మన్‌ గోపి యాదవ్‌,  ఈవో మునికృష్ణయ్య, పాలకమండలి సభ్యులు తదితరులు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.  


ఆచారమా ప్రచారమా....


ఈ ఏడాది జరిగింది వైసీపీ గంగ జాతర 


 తిరుపతి నగర ప్రజలు అనాదిగా అత్యంత భక్తివిశ్వాసాలతో జరుపుకునే విలక్షణమైన ఒక ఆచారం.. గంగ జాతర. రెండేళ్ల కొవిడ్‌ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకలో ఈసారి ఆచారంకన్నా, ఆర్భాటమే ఎక్కువగా కనిపించింది. భాష, సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన అనుభవం ఉన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వేడుకలు భారీగానే జరుగుతాయని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టే సందడి కనిపించింది. అయితే ఈ సందడంతా సాధారణ భక్తులకన్నా ఎక్కువగా వైసీపీ నాయకులూ, వారి అనుచరులది కావడమే విమర్శలకు గురైంది. సంప్రదాయంగా వస్తున్న ఆచారాలను పట్టించుకోకుండా కొత్త సంప్రదాయాలను జాతరలో మొదలు పెట్టడం మీద కూడా విమర్శలు వచ్చాయి. 


రాజకీయ సారెలు 


గత ఆచారం ప్రకారం గంగ జాతరలో రెండు సారెలు మాత్రమే ఉండేవి. జాతర చాటింపు రోజున అవిలాల పుట్టింట సారె ఉరేగింపుగా వస్తుంది. జాతర మొదలైన ఐదు రోజుల తర్వాత తోబుట్టువైన గంగమ్మకు వేంకటేశ్వరస్వామి సారెను టీటీడీ అధికారికంగా ఘనంగా తీసుకువచ్చి సమర్పిస్తుంది.ఈ రెండూ ఈసారి కూడా ఉన్నా వీటి సందడి పెద్దగా కనిపించలేదు. రాజకీయ నేతలు సమర్పించిన సారెల హడావుడే హోరెత్తింది. మంత్రులు, అధికార ప్రముఖులతో పాటు నగరంలోని 50 డివిజన్ల నుంచి గంగమ్మకు సారె తీసుకురావాలని ఎమ్మెల్యే నిర్ణయించడంతో సారెల పోటీ పెరిగింది. వైసీపీ కార్పొరేటర్లు కనీసం మూడేసి వందలమంది అనుచరులతో రావడంతో గుడివద్ద సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బంది కలిగింది.ముఖ్యంగా టీటీడీ సారెను చప్పగా సమర్పించేసిన తీరు అందరినీ విస్మయపరిచింది. 


దర్శనాల దందా


 కొందరు నాయకులు గర్భాలయంలో ఎక్కువ సమయం ఉంటూ తెలిసిన భక్తులకు పసుపు, పూలు పంచుతూ హడావుడి చేశారు. వైసీపీ నేతల, అనుచరుల దూకుడు వల్ల క్యూలైన్లలోని భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. కొందరు భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఆలయానికి, పాలకమండలికి సంబంధంలేని వ్యక్తులు, క్యూలైన్లను క్రమబద్దీకరించే పేరుతో గర్భాలయం ముందు హల్‌చల్‌ చేశారు. జాతర రోజున 22ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకునే గంగమ్మ భక్తుడైన ఓ వ్యాపారవేత్త ఈసారి గందరగోళానికి భయపడి బయటనుంచే దండం పెట్టుకుని వెళ్లిపోయారు. దర్శనం కోసం వచ్చిన విపక్ష పార్టీ నేతలకూ అవమానాలు జరిగాయి. కొందరు అలిగి వెళ్లిపోయారు. మరికొందరు వాగ్వాదానికి దిగి దర్శనం చేసుకున్నారు. పోలీసులు, ఆలయ సిబ్బందిది ప్రేక్షక పాత్రే అయ్యింది. 



సప్పరాలు ఏవీ? 


గంగ జాతర ప్రత్యేకతే వేషాలు. వేషాలను ప్రోత్సహించడం మీద కూడా నేతలు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. గతంలో చివరి రోజు సప్పరాలు పెద్ద సంఖ్యలో వచ్చేవి. వివిధ ప్రాంతాల నుంచీ పలకల దరువుకు అనుగుణంగా ఆడుతూ వీపుకి కొక్కీలతో తగిలించుకున్న సప్పరాలతో భక్తులు గుడికి చేరుకునేవారు. దారంతా ఊరేగింపులా సాగేది.తిరుపతి గంగజాతరలో ప్రత్యేక ఆచారం ఇది. నిదానంగా కనుమరుగైపోతోంది. మంగళవారం నాడు ఒకటీ అరా మాత్రమే సప్పరాలు కనిపించాయి. నిర్వాహకులు ఈ ఆచారాన్ని ప్రోత్సహించి ఉండొచ్చు. ప్రతి డివిజన్‌ నుంచీ సప్పరాలను వచ్చే ఏర్పాటు చేసివుండవచ్చు. ఆచారాన్ని వదిలేసి, సారెల మీద నాయకులు దృష్టిపెట్టడమే విచిత్రం. 


మనకూ కళలున్నాయి!


జాతర సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి తప్పెటగుళ్లు, థింసా, కొమ్మునృత్యం వంటి జానపద కళారూపాలు వచ్చాయి. సారెల ఊరేగింపులో, జాతర సందడిలో వీరిది ప్రధాన పాత్ర. ఇవి ఆకట్టుకున్నాయి కూడా. అయితే, జానపద కళలకు పుట్టిల్లు అయిన చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ అనేక కళారూపాలు ఉన్నాయి. ఆ బృందాలను విస్మరించి బయటి కళారూపాలకే జాతరను పరిమితం చేయడం   కూడావిమర్శలకు గురైంది.

Updated Date - 2022-05-19T07:39:38+05:30 IST