ltrScrptTheme3

‘డి’తో ఢీ కొడదాం!

Jun 2 2020 @ 11:50AM

ఆంధ్రజ్యోతి(02-06-2020)

‘కొవిడ్‌ - 19’ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది.  కరోనా వైరస్‌ మానవాళిపై ఎలాంటి ప్రభావాల్ని చూపుతోంది? దీన్ని అరికట్టడం ఎలా? కరోనా అంతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోయినా, రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఈ వ్యాధిని నియంత్రించవచ్చనీ, అందులో విటమిన్‌-డి కీలకపాత్ర పోషిస్తుందనీ చెబుతున్నారు పరిశోధకులు. 


రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తం!

ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడే రోగనిరోధక వ్యవస్థ కొన్నిసార్లు దారి తప్పి, అతిగా ప్రతిస్పందిస్తుంది. ఆ క్రమంలో అధిక మొత్తంలో సైటోకైన్స్‌ను విడుదల చేసే పరిస్థితి తలెత్తుతోంది. సైటోకైన్స్‌ రోగనిరోధక వ్యవస్థ కర్తవ్యాన్ని గుర్తు చేసి, వ్యాధినిరోధకతకు తోడ్పడాలి. కానీ అనేక కరోనా కేసుల్లో వైరస్‌ కాకుండా సైటోకైన్‌ స్టార్మ్‌ ఎక్కువ నష్టాన్ని కలగజేస్తోందని వైద్య నిపుణులు గ్రహించారు. ‘కొవిడ్‌ - 19’ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న రోగుల రక్తం సైటోకైన్స్‌తో నిండిపోయిందని పరీక్షలు చెబుతున్నాయి. 


‘సైటోకైన్‌ స్టార్మ్‌’లో ఏం జరుగుతుంది?

శరీరం వైర్‌సతో పోరాడడానికి బదులు తన సొంత కణాలు, కణజాలాల మీద దాడి చేస్తుంది. వైరస్‌ సోకినప్పుడు, నష్ట నివారణలో భాగంగా తనను తాను కణం చంపుకుంటుంది. అలా ఎక్కువ కణాలు మృతి చెందుతున్నప్పుడు కణజాలం నిర్జీవమవుతుంది. కొన్నిరకాల సైటోకైన్స్‌ ఇలా కణాల మృతిని ప్రేరేపిస్తాయి. ‘కొవిడ్‌ - 19’లో ఇలా మృతి చెందే కణజాలం ఎక్కువగా ఊపిరితిత్తులలోనిది! సైటోకైన్‌ స్టార్మ్‌ విపరీతమైన ఇన్‌ఫ్లమేషన్‌ను కలగజేస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులలో ద్రవం చేరి, న్యుమోనియా, ఎక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోయి గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు లాంటి అతి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. 


‘డి’ విటమిన్‌ పనితీరు!

విటమిన్‌-డి రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి, దాన్లో మార్పులు తీసుకువచ్చి, సైటోకైన్‌ స్మార్ట్‌ రాకుండా నిరోధిస్తుంది. దీనివల్ల మరణాల సంఖ్య సగానికి సగం తగ్గుతుందన్నది పరిశోధకుల విశ్వాసం. ఈ లోపం ఎక్కువగా ఉండే వృద్ధులూ, దీర్ఘకాలిక వ్యాధులు తగిన మోతాదులో విటమిన్‌-డి తీసుకొని, ఆ లోపాన్ని సరి చేసుకోవడం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లూ, కండరాల నొప్పులు, గుండె వ్యాధులు, మధేమేహం, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, ఆస్టియో పోరోసిస్‌, డిప్రెషన్‌, కేన్సర్‌ లాంటి వ్యాధులు తలెత్తే ప్రమాదాన్ని తప్పించే విటమిన్‌-డి ప్రతి వ్యక్తిలో 40 నుంచి 60 నానో గ్రాములు ఉండాలి. కానీ, మన దేశంలో దాదాపు 70 నుంచి 80 శాతం మందికి విటమిన్‌-డి లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.


విటమిన్‌-డి ఏం చేస్తుంది?

విటమిన్‌-డి లోపానికీ, ‘కొవిడ్‌ - 19’ మరణాల రేటుకూ చాలా దృఢమైన సహసంబంధం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఎక్కువ మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌, ఇంగ్లండ్‌లోని రోగుల వివరాలనూ, తక్కువ మరణాలు నమోదైన ఫిన్లాండ్‌, నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌ రోగుల వివరాలనూ పోల్చి చూస్తే...  విటమిన్‌-డి స్థాయికీ - సైటోకైన్‌ స్టార్మ్‌కూ, అలాగే విటమిన్‌-డి లోపానికీ - మరణాలకూ సంబంధం ఉందని తెలుసుకున్నారు.


వీటి ద్వారా భర్తీ చేసుకోవాలి!

ఆహారం: కొవ్వు ఉన్న చేపలు, కోడి గుడ్డు, పాలు, పుట్టగొడుగులు, పన్నీర్‌, జున్ను, వెన్న... వీటిని ఆహారంలో తీసుకోవాలి. 

ఎండ: తీక్షణం కాని ఎండలో రోజుకు కనీసం 20-30  నిమిషాల పాటు ఉండాలి. శరీరంలో 70 శాతం మేరకు ఎండ తగలాలి. 

సప్లిమెంట్లు: ఇంజక్షన్‌, మాత్రలు, సిరప్‌, పొడి రూపంలో విటమిన్‌-డిని తీసుకోవచ్చు. రక్తంలో 40-60 నానో గ్రాములు ఉండాలన్నది లక్ష్యం. ఆ స్థాయికి తగ్గకుండా చూసుకోవాలి. 

రక్తంలో విటమిన్‌-డి స్థాయి ఎంత ఉందో పరీక్ష చేయించుకోవాలి. లోపం ఉంటే సరి చేసుకోవాలి. దీనివల్ల ‘కొవిడ్‌ - 19’ నుంచి కొంత మేరకు రక్షణ లభిస్తుంది.
- డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

శ్రీశ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌, 

హైదరాబాద్‌. ఫోన్‌: 9849022441

Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.