వరి, గోధుమలో విటమిన్‌ డీ!

ABN , First Publish Date - 2021-03-01T09:15:37+05:30 IST

సంప్రదాయ పద్ధతిలో పంటలను సాగు చేయడమే కాదు.. వాటిలో విటమిన్‌ ఉండేలా చేశారు. డీ విటమిన్‌ లోపంతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై తన స్నేహితుడైన ఓ డాక్టర్‌ చెబితే విన్నారు.

వరి, గోధుమలో విటమిన్‌ డీ!

  • సేంద్రియ పద్ధతిలో సాగులోనూ నవీన ఆవిష్కరణ.. 
  • వినూత్న ప్రయోగంతో విజయవంతం
  • పేటెంట్‌ హక్కులూ పొందిన రైతు వెంకట్‌రెడ్డి

అల్వాల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పద్ధతిలో పంటలను సాగు చేయడమే కాదు.. వాటిలో విటమిన్‌ ఉండేలా చేశారు. డీ విటమిన్‌ లోపంతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై తన స్నేహితుడైన ఓ డాక్టర్‌ చెబితే విన్నారు. దానికి తానేం చేయగలను? సేద్యంతో పరిష్కారం కనుగొనగలనా? అని ఆలోచించారు. పంటలపై అనేక ప్రయోగాలు చేశారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసి సూర్యరశ్మిలో లభ్యమయ్యే విటమిన్‌ డీని వరి, గోధుమల్లో ఆవిష్కరించారు. ఆయనే తెలంగాణ రైతు బిడ్డ చింతల వెంకట్‌రెడ్డి. ఆయన చేస్తున్న సాగు కొత్త ఒరవడిని సృష్టించింది. వెంకట్‌రెడ్డి ఆవిష్కరణలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వెంకట్‌రెడ్డి పరిశోధన ప్రపంచ మేధో హక్కుల సంస్థ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది. దీనిపై ఆయనకు పేటెంట్‌ హక్కులూ లభించాయి. 


విప్లవాత్మక అవిష్కరణ

విటమిన్‌ డీ సూర్యరశ్మి, పాలు, గుడ్లు, కూరగాయలు, చేపల్లో లభిస్తుంది. వెంకట్‌రెడ్డి కనుగొన్న ఫార్ములా వల్ల బియ్యం, గోధుమల్లోనూ లభిస్తోంది. ఇతర విటమిన్లతో పోలిస్తే మార్కెట్‌లో విటమిన్‌ డీ, సీలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి అంతగా ఉండని కొన్ని దేశాల్లో విటమిన్‌ డీని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటారు. సహజంగా తీసుకునే ఆహారంలో కూడా డీ విటమిన్‌ ఉండేలా చూడాలనుకున్న వెంకట్‌రెడ్డి.. ప్రయోగాలు మొదలు పెట్టారు. ఎక్కువ మంది ఆహారంగా తీసుకునే వరి, గోధుమల సాగును ప్రారంభించారు. ఎకరాకు రూ.2-3వేలు ఖర్చుతో తేలికగా లభించే మూడు పదార్థాలతో మిశ్రమాన్ని తయారు చేశారు. వరి, గోధుమ పంటలకు ఉపయోగించారు. ఆయన పండించిన వరి, గోధుమల్లో విటమిన్‌ డీ ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్షలో తేలింది. పండించిన ధాన్యాన్ని వెంకట్‌రెడ్డి పిండి చేసి పరీక్ష చేయించగా పలుసార్లు డీ విటమిన్‌ అధికంగా ఉన్నట్లు రుజువైంది. వరికి సంబందించి యాసంగిలో 100 గ్రాములు బియ్యంలో 140 ఇంటర్నేషనల్‌ యూనిట్లు (ఐయూ) విటమిన్‌ డీ ఉన్నట్లు వెల్లడైంది. వానాకాలం పంటలో 104 ఐయూ ఉన్నట్లు గుర్తించారు. ఐయూ తక్కువ రావడంతో ఆయన పంటపై మళ్లీ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో గత వానాకాలంలో పండించిన వరిలో 311 ఐయూ వచ్చింది. ఇక గోధుమల విషయానికి వస్తే 100 గ్రాముల గోధుమ పిండిలో ఒకసారి పంటలో 1,606 ఐయూ, మరోసారి 1,830 ఐయూ ఉన్నట్లు తేలింది.


అంతర్జాతీయ గుర్తింపు

వరి, గోధుమల్లో విటమిన్‌ డీ గుర్తించిన వెంకట్‌రెడ్డి వెంటనే ఇండియన్‌ పేటెంట్‌ రైట్స్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. అనంతరం జెనీవాలో ఉన్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌కు ధరఖాస్తు చేసుకోగా, వెంటనే ఆమోదం తెలపడం గమనార్హం.


ప్రధాని గుర్తించడం సంతోషంగా ఉంది

నేను చేస్తున్న సేద్యం గురించి ప్రధాని మోదీ చెప్పడం సంతోషంగా ఉంది. వరి, గోధుమల్లో విటమిన్‌ డీ అధిక మోతాదులో ఉండడాన్ని గుర్తించి మన్‌కీ బాత్‌లో ప్రస్తావించడం ఆనందంగా ఉంది. నేను సాగు చేసిన విధానాన్ని చూసి ఇతర దేశాల వారూ మెచ్చుకున్నారు. కొన్ని పురస్కారాలు అందించారు. తొలిసారిగా ప్రధాని నా సాగు విధానంపై మాట్లడడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

- చింతల వెంకట్‌రెడ్డి, రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత

Updated Date - 2021-03-01T09:15:37+05:30 IST