విఠల్‌రెడ్డికే కారు స్టీరింగ్‌

Published: Wed, 26 Jan 2022 23:56:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విఠల్‌రెడ్డికే కారు స్టీరింగ్‌ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని సన్మానిస్తున్న పార్టీ శ్రేణులు

అంచనాలన్నీ తలకిందులు 

ముథోల్‌ నియోజకవర్గానికి దక్కిన ప్రాధాన్యం 

వ్యూహాత్మకమేనంటున్న పార్టీ శ్రేణులు 

నిరాశలో సీనియర్‌ నాయకులు 

నిర్మల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి)  : టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముథోల్‌ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి నియమితులయ్యారు. గత కొంతకాలం నుంచి జిల్లా పార్టీకి అధ్యక్షునిగా ఎవరూ లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలన్నీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలే పర్యవేక్షిస్తున్నారు. అయితే జిల్లాఅధ్యక్షపదవిపై చాలామంది సీనియర్‌లు పెట్టుకున్న ఆశలు అధిష్టానం నిర్ణయంతో తలకిందులయ్యాయి. పార్టీ అధిష్టానం అనూహ్యంగా బుధవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగానే నిర్మల్‌ జిల్లాకు సైతం విఠల్‌ రెడ్డిని నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. ముథోల్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌పార్టీ పరంగా మొదటిసారి అత్యధిక ప్రాధాన్యత దక్కినట్లయ్యిందంటున్నారు. వివాద రహితునిగా, సౌమ్యునిగా, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి సన్నిహితునిగా ఉన్న విఠల్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపిందంటున్నారు. మొదట ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ పేరు కూడా ప్రస్థావనకు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ఆ పేరును పక్కన పెట్టి విఠల్‌రెడ్డికి ప్రాధాన్యత కల్పించారంటున్నారు. చివరి వరకు జిల్లా అధ్యక్షుల పదవుల కేటాయింపులపై సమాచారం లీక్‌ అవ్వకపోవడం ప్రా ధాన్యతను సంతరించుకుంటోంది. కాగా సభ్యత్వ కార్యక్రమం ముగిసిన నాటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం నిర్మల్‌కు జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సీనియర్‌ నాయకులు ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్‌ ఈ పదవిని ఆశించారు. ఈయనతో పాటు నిర్మల్‌కు చెందిన మరో  సీనియర్‌ నేత శ్రీహరిరావు, ఖానాపూర్‌కు చెందిన మాజీ ఏయంసీ చైర్మన్‌ నారాయణ, ముథోల్‌ నియోజకవర్గానికి చెందిన విలాస్‌ గాదేవార్‌లతో పాటు తదితరులు జిల్లా అధ్యక్ష పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నించినట్లు పేర్కొంటున్నారు. అయితే వీరిలో నుంచి సత్యనారాయణగౌడ్‌కు గాని ఖానాపూర్‌కు చెందిన నారాయణకు గాని ఎలాగైనా టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఓ దశలో నారాయణకు పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు జిల్లాలో చర్చ జరిగింది. ఇలాంటి చర్చలను పక్కన పెట్టి అధిష్టానం అనూహ్యంగా విఠల్‌ రెడ్డి పేరును తెరపైకి తేవడమే కాకుండా అధ్యక్ష పదవి ఖరారు చేయడం గమనార్హం. అయితే అధ్యక్షపదవిని ఆశించిన సీనియర్‌ నాయకులు అధిష్టానం నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు. చాలా సంవత్స రాల నుంచి పదవులు లేక కేవలం తామంతా మా మూలు నాయకులుగానే మిగిలిపోయామని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వ్యూహత్మకంగా..

ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం వ్యూహంలో భాగమేనంటున్నారు. అధిష్టానం పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలనే నియమించాలని తీసుకున్న నిర్ణయం కారణంగా సీనియర్‌లను పక్కనపెట్టి ఇక్కడ విఠల్‌రెడ్డికే బాధ్యతలను అప్పగించిందంటున్నారు. కాగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ పేరును కూడా అధిష్టానం ఓ దశలో అధ్యక్ష పదవి కోసం పరిశీలించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె పేరును తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నా యకుల నుంచే కాకుండా అధికార యంత్రాంగం నుంచి కూడా రేఖా శ్యాంనాయక్‌పై వ్యతిరేక ఫిర్యాదులు ఉన్న కారణంగా ఆమెను పక్కన పెట్టారంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సన్నిహితునిగా ప్రధాన అనుచరునిగా మొదటి నుంచి కొనసాగుతున్న విఠల్‌రెడ్డి వ్యక్తిగత స్వభా వం కూడా వ్యక్తిగత ఎంపికకు కారణమైందటున్నారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూసేందుకే మధ్యస్థంగా విఠల్‌రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసిందంటున్నారు. 

సీనియర్‌లలో నిరాశ

కాగా పదవిని ఆశించిన సీనియర్‌ నాయకులు అధిష్టానం నిర్ణయంతో తీవ్రనిరాశకు లోనవుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు సత్యనారాయణగౌడ్‌, కల్వకుంట్ల నారాయణ, శ్రీహరిరావు, గాదే విలాస్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డిలతో పాటు తదితరులు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినట్లు పేర్కొంటున్నారు. అయితే సీనియర్‌ల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లి కొత్తగా ఎమ్మెల్యే రూపంలో విఠల్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం కారణంగా సీనియర్‌లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిర్మల్‌కు చెందిన సత్యనారాయణగౌడ్‌, ఖానాపూర్‌కు చెందిన నారాయణలు మాత్రం జిల్లా అఽధ్యక్ష పదవిని మొదటి నుంచి సీరియస్‌గా ఆశించారంటున్నారు. నారాయణకు కేసీఆర్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడం, ఉద్యమకాలం నుంచి ఆయన పార్టీ లో కొనసాగుతున్న కారణంగా ఈసారి ఎలాగైనా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే నారాయణ విషయంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేసి ఉండకపోవచ్చంటున్నారు. అలాగే సత్యనారాయణగౌడ్‌ సైతం మొదట ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి గాని, ఎమ్మెల్సీ పదవి గాని తనకు కేటాయించాలని కోరారు. చివరకు అధిష్టానం అధ్యక్ష పదవి విషయమై తన పేరును పరిశీలిస్తే అందుకు అంగీకరిస్తానంటూ కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే అధి ష్టానం అనూహ్య నిర్ణయంతో వీరు నిరాశకు లోనయ్యారంటున్నారు. 

కత్తీమీద సాము

ఇప్పటి వరకు ముథోల్‌ నియోజకవర్గానికే పరిమితమైన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఇక తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌ సెగ్మెంట్‌లను సైతం పార్టీపరంగా సారథ్యం వహించాల్సి వస్తోంది. ముథో ల్‌ నియోజకవర్గంతో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు, గ్రూపు తగాదాలున్న సంగతి తెలిసిందే. ఇలా ఉన్న గ్రూపు తగాదాలు, బేధాభిప్రాయాలను తొలగించి అందరిని ఏకతాటిపై నిలిపే వ్యవహారం విఠల్‌రెడ్డికి సవాలుగా మారనుందంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి అనుచరవర్గాన్ని కూడా పార్టీ జిల్లా అధ్యక్ష హోదాలో కట్టడి చేయాల్సి ఉంటుందంటున్నారు. అధికారిక, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి తన నియోజకవర్గంలో ఇతరుల జోక్యాన్ని సహించని ఖానాపూర్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నాయకత్వానికి ఏ మేరకు సహకరిస్తుందోనన్న చర్చకు కూడా మొదలైంది. మరో ఏడాదిన్నరలోగా సాధారణ ఎన్నికలు జరగబోనున్న ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కీలకఅధ్యక్ష పదవి విఠల్‌రెడ్డికి దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అందరిని ఏకతాటిపై నిలిపి మళ్లీ మూడు నియోజకవర్గాల్లో గులాబీజెండాను ఎగురవేసే బాధ్యతను అధిష్టానం విఠల్‌ రెడ్డి భుజాలపై పెట్టింది. విఠల్‌రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అండదండలు పూర్తిగా ఉండనున్న కారణంగా ఆయన అఽఽధ్యక్ష పదవి విషయంలో స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించుకునే అవకాశం ఉందంటున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.