వివేకానంద డేకు గరికిపాటి మద్దతు

ABN , First Publish Date - 2022-01-01T00:54:10+05:30 IST

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు మద్దతు తెలిపారు.

వివేకానంద డేకు గరికిపాటి మద్దతు

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు మద్దతు తెలిపారు. క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వివేకానంద పోస్టర్‌పై ఆయన సంతకం పెట్టారు. ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో స్ఫూర్తి నింపాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు స్వామి వివేకానంద బోధనలు ఎంతైనా అవసరమని గరికిపాటి చెప్పారు. 


వివేకానంద డేకు గతంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి, రుషిపీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖశర్మ, సినీ దర్శకుడు విశ్వనాథ్ మద్దతు తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ తదితరులు ఇప్పటికే వివేకానంద డేకు మద్దతిచ్చారు. క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వివేకానంద పోస్టర్‌పై సంతకం పెట్టారు. ఫిబ్రవరి 13ను వివేకానంద దినోత్సవంగా గుర్తించాలనే విషయాన్ని తాను తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మాటిచ్చారు. 


1893లో హైదరాబాద్ పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో ఫిబ్రవరి 13న మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారు. యూరోపియన్లు, నిజాం కొలువులోని మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బహిరంగసభను ఉద్దేశించి వివేకానంద తొలిసారిగా ఆంగ్లంలో ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో వివేకానందలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే స్ఫూర్తితో ఆయన చికాగో వేదికపై ప్రసంగించి విజయవంతమయ్యారు. వివేకానందలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేసిన ఫిబ్రవరి 13ను వివేకానంద దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కోరుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అందరి మద్దతునూ కూడగడుతున్నారు.

Updated Date - 2022-01-01T00:54:10+05:30 IST