
విజయనగరం: కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. విజయనగరం, రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. శంకుస్థాపన బోర్డుపై అశోక్‌గజపతిరాజు పేరును లేకుండా చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంతో అశోక్‌గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అశోక్‌గజపతిరాజును తోసేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. చట్టాన్ని దేవాదాయశాఖ ఉల్లంఘిస్తోందంటూ దుయ్యబట్టారు.
తర్వాత మంత్రులు బొత్స, వెల్లంపల్లి తదితరులు ఆలయ పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను అధికారపార్టీ పాటించలేదని, ధర్మకర్త చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కొబ్బరాయ కూడా కొట్టకుండా వైసీపీ శ్రేణులు నెట్టేశారన్నారు. ప్రభుత్వం చాలా మూర్ఖత్వంగా వెళుతోందని, రాజ్యాంగాన్ని అతిక్రమించి, చట్టాలు, కోర్టులు చెప్పిన అంశాలను తుంగలో తొక్కిందన్నారు. ఏకపక్ష ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు.