Sasikala: అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వంను బహిష్కరించడంపై శశికళ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-12T00:43:11+05:30 IST

తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత పన్నీరుసెల్వం.. ఆయన అనుచరులు పిలుచుకునే ఓపీఎస్‌కు తన రాజకీయ జీవితంలో..

Sasikala: అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వంను బహిష్కరించడంపై శశికళ రియాక్షన్ ఏంటంటే..

చెన్నై: తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత పన్నీరుసెల్వం.. ఆయన అనుచరులు పిలుచుకునే ఓపీఎస్‌కు తన రాజకీయ జీవితంలో మరో చేదు అనుభవం ఎదురైంది. ఏక నాయకత్వం కోసం అన్నాడీఎంకేలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్గత పోరులో ఆయన ఓడిపోక తప్పలేదు. ఈ రాజకీయ క్రీడలో ఓడిన పన్నీరుసెల్వాన్ని అన్నాడీఎంకే నుంచి బహిష్కరిస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పన్నీరు సెల్వం అనుచరులను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే.. అన్నాడీఎంకే నుంచి పన్నీరుసెల్వంను బహిష్కరిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ బహిష్కృత నేత వీకే శశికళ తీవ్రంగా తప్పుబట్టారు.



కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరిగిందని, ఇవాళ జరిగిన ఈ సమావేశం చెల్లదని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. హైకోర్టులో తాను వేసిన కేసుపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉందని శశికళ తెలిపారు. డీఎంకేలో పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎంజీఆర్ బయటికొచ్చి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని చెప్పారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని శశికళ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేలా ఎంజీఆర్ నియమావళి రూపొందించారని, ఇప్పుడు ఆ పద్ధతిని పళనిస్వామి, ఆయన వర్గం అనుసరించడం లేదని వీకే శశికళ చెప్పుకొచ్చారు.



పన్నీరుసెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి కూడా తప్పించిన పళనిస్వామి ఏఐఏడీఎంకే నూతన కోశాధికారిగా దిండికల్ శ్రీనివాసన్‌ను ప్రకటించారు. ఓపీఎస్‌ను పార్టీ నుంచి తప్పిస్తారనే విషయం పళనిస్వామి వర్గానికి ముందే తెలుసు. అందుకే.. గత జూన్‌ 23న జరిగిన సర్వసభ్యమండలి సమావేశం సందర్భంగా వానగరం కల్యాణమండపం వద్ద ఓపీఎస్‌, ఈపీఎస్‌ ఫొటోలు ఉన్న బ్యానర్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినప్పటికీ ఈసారి ఓపీఎస్‌ చిత్రపటాలు లేకుండా ఈపీఎస్‌, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలు కలిగిన బ్యానర్లతో ఆ ప్రాంతాన్నంతా నింపేశారు. పూందమల్లి హైవే నుంచి కల్యాణమండపానికి వెళ్లే దారికి ఇరువైపులా ఈపీఎస్‌ చిత్రపటాలు కలిగిన బ్యానర్లే అధికంగా కట్టారు.

Updated Date - 2022-07-12T00:43:11+05:30 IST