అందుకు పుతిన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్

ABN , First Publish Date - 2021-03-18T19:00:49+05:30 IST

2020 నవంబర్‌లో జరిగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉన్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగం తేల్చిన నేపథ్యంలో అధ్యక్షుడు జో జైడెన్​ స్పందించారు.

అందుకు పుతిన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్

వాషింగ్టన్: 2020 నవంబర్‌లో జరిగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉన్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగం తేల్చిన నేపథ్యంలో అధ్యక్షుడు జో జైడెన్​ స్పందించారు. తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో బైడెన్ మాట్లాడిన సందర్భంలో ఈ విషయమై తలెత్తిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకుగానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తగిన మూల్యం చెల్లించక తప్పదని బైడెన్ అన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2020 నవంబర్ 3న జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ను అణచివేసేందుకు రష్యా ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం ధృవీకరించింది. 


ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఎన్నికల్లో తనకు నష్టం కలిగించేలా చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అతి త్వరలోనే అతను దీని పరిణామాలు చూస్తాడని అన్నారు. తన ప్రత్యర్థులతో కఠినంగా వ్యవహారించే పుతిన్ కిల్లర్‌తో సమానం అని ఈ సందర్భంగా బైడెన్ చెప్పుకొచ్చారు. అయితే, అధ్యక్షుడు పుతిన్‌ను ఓ కిల్లర్‌ అని బైడెన్‌ సంభోదించడాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. తన వ్యాఖ్యలతో రష్యా దేశ ప్రజలను అగ్రారాజ్యం అధ్యక్షుడు ఘోరంగా అవమానించారని రష్యా పార్లమెంట్ స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వొలోడిన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-18T19:00:49+05:30 IST