వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా సీఎం?

ABN , First Publish Date - 2020-07-14T15:49:40+05:30 IST

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) ఛైర్మన్‌గా..

వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా సీఎం?

వీఎంఆర్‌డీఏ పీఠం ఖాళీ

ముగిసిన ద్రోణంరాజు పదవీకాలం

పొడిగింపుపై వెలువడని ఉత్తర్వులు

రేసులో పలువురు ఆశావహులు

స్థానిక ఎన్నికలు ముగిసే వరకు భర్తీ ఉండదంటున్న కీలక నేత 

ముఖ్యమంత్రే ఛైౖర్మన్‌గా ఉంటారని సమాచారం!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ పదవీ కాలం సోమవారంతో పూర్తయింది. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)ను వీఎంఆర్‌డీఏగా మార్చిన తరువాత నియమితులైన మొదటి ఛైర్మన్‌ ఆయనే. కేవలం ఏడాది కాలానికే ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. పదవీ కాలం పొడిగిస్తూ ఆదేశాలు వస్తాయని ఆయనతోపాటు అనుచరగణం ఆశించారు. అయితే రాత్రి 9 గంటల వరకు దీనిపై ఎటువంటి సమాచారం లేదు. ఇదిలా ఉండగా వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ పదవిని వైసీపీకి చెందిన చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఓడిపోయిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఏడాది గడువుతో పదవి ఇచ్చినట్టుగానే ఉత్తర నియోజకవర్గంలో ఓడిపోయిన కేకే రాజుకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నది.


అయితే ఇటీవల జిల్లా పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాల కారణంగా ఇప్పట్లో ఎవరికీ ఎటువంటి పదవీ ఇచ్చే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. విశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని, పార్టీలోనే ఉంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో తెర వెనుక ఎవరు ఏమి చేస్తున్నారనే దానిపై నిఘా వర్గాలు కూపీ తీస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాతే వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవిని భర్తీ చేస్తారని జిల్లాలో కీలకంగా వ్యవహరించే ఒక నేత అభిప్రాయపడ్డారు.


ఛైౖర్మన్‌గా సీఎం?

వాస్తవానికి వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి లేదా సీనియర్‌ మంత్రి ఉండాలని వీఎంఆర్‌డీఏ చట్టం చెబుతున్నది. ఇందుకు భిన్నంగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఏడాది క్రితం నియమించింది. కాగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ కేంద్రంగా పరిపాలన చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా ఆయనే ఉంటారనే వాదన కూడా వినిపిస్తున్నది. వీఎంఆర్‌డీఏ పరిధిలో చాలా కీలకమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. భోగాపురాన్ని కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్ట్‌, విశాఖ-భోగాపురం మధ్య ఐటీ సిటీ, బీచ్‌ కారిడార్‌, మోనో రైలు వంటి ప్రాజెక్ట్‌లు రాబోతున్నాయి. వీఎంఆర్‌డీఏను ఇంకా బలోపేతం చేయాల్సి ఉంది. సంస్థకు ఏడాది క్రితం ఛైర్మన్‌ను నియమించినప్పటికీ బోర్డుని మాత్రం వేయలేదు. ద్రోణంరాజు హయాంలో ఒక్కసారి కూడా బోర్డు సమావేశం కూడా నిర్వహించలేదు.  


ఎక్కడి పనులు అక్కడే...

కరోనా నేపథ్యంలో వీఎంఆర్‌డీఏకి ఆదాయం బాగా తగ్గిపోయింది. సీఎం జగన్‌ చేతులు మీదుగా పలు ప్రాజెక్ట్‌లకు గత డిసెంబరులో శంకుస్థాపనలు చేయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులు మాత్రమే ప్రస్తుతం సాగుతున్నాయి. బీచ్‌ రోడ్డులో సీ హ్యారియర్‌ మ్యూజియం పనులు టెండర్ల దశలోనే వున్నాయి. ముడసర్లోవ పార్కు అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. కాపులుప్పాడలో హిస్టరీ మ్యూజియం, కైలాసగిరిపై ప్లానిటోరియం పనులు ఇంకా మొదలుకాలేదు. కొత్తగా ఒక్క లేఅవుట్‌ కూడా వేయలేదు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సమీకరించిన భూముల్లో మాత్రం లేఅవుట్లు వేశారు. దీంతో ఇంజనీరింగ్‌ విభాగానికి పెద్దగా పనులు ఏమీ లేవు. సెక్రటరీ పదవి కరోనా రాకముందు నుంచే ఖాళీగా ఉంది. చీఫ్‌ ఇంజనీర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. 

Updated Date - 2020-07-14T15:49:40+05:30 IST