వీఎంఆర్‌డీఏ సెక్రటరీ పోస్టుకు పోటీ!

ABN , First Publish Date - 2022-08-16T07:06:40+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది.

వీఎంఆర్‌డీఏ సెక్రటరీ పోస్టుకు పోటీ!

విజయవాడ గవర్నర్‌ బంగ్లాలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న ఓ అధికారి తీవ్ర యత్నం

మరోవైపు జీవీఎంసీకి చెందిన ఒక అధికారి కన్ను

భూముల వేలం నేపథ్యంలో కీలకంగా మారిన కార్యదర్శి పోస్టు

కమిషనర్‌ పోస్టు కూడా నాలుగు నెలలుగా ఖాళీయే...

ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌ 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. వాణిజ్య పన్నుల శాఖ నుంచి డిప్యుటేషన్‌పై సెక్రటరీగా వచ్చిన రఘునాఽథరెడ్డి పదవీ విరమణ దగ్గర పడడంతో మాతృ సంస్థకు వెళ్లిపోయారు. దాంతో పోస్టు ఖాళీ అయింది. ప్రస్తుతం జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రవీంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి వీఎంఆర్‌డీఏలో కీలకమైన కమిషనర్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినప్పుడు ఇక్కడ కమిషనర్‌గా వున్న వెంకటరమణారెడ్డికి కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి రాయలసీమకు పంపించారు. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలలు దాటినా కమిషనర్‌ను నియమించలేదు. 

జిల్లాల విభజన తరువాత విశాఖ నుంచి అనకాపల్లి, పాడేరు విడిపోవడంతో విశాఖ చిన్న జిల్లా అయిపోయింది. దాంతో కలెక్టర్‌కు కూడా పనిభారం తగ్గింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఉదయం జిల్లా వ్యవహారాలు, మధ్యాహ్నం వీఎంఆర్‌డీఏ పనులు చూసుకుంటున్నారు. అయితే వీఎంఆర్‌డీఏలో సెక్రటరీ పదవి అత్యంత కీలకమైనది. పరిపాలనకు సంబంధించిన ఫైళ్లన్నీ అక్కడి నుంచే నడుస్తాయి. కీలకమైన భూముల వేలం, భూ కేటాయింపులు, దుకాణాల లీజు, ఎన్‌ఓసీలు, ఉద్యోగుల సర్వీసు వంటి వ్యవహారాలు సెక్రటరీ పరిధిలోనే ఉంటాయి. దాంతో ఆ స్థానంలోకి రావాలని చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు యత్నిస్తుంటారు. వీఎంఆర్‌డీఏలో పరిపాలన, అకౌంట్స్‌, ఎస్టేట్‌, ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, నగర అటవీ విభాగాలన్నింటికీ అధిపతులను డిప్యుటేషన్‌పై ఇతర శాఖల నుంచి నియమించడం ఆనవాయితీగా వస్తోంది. దాంతో సెక్రటరీ పోస్టుపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో పనిచేస్తున్నవారు, ఇక్కడ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి రావడానికి యత్నిస్తున్నారు. 

జైళ్ల శాఖకు చెందిన అధికారి ఒకరు గతంలో జీవీఎంసీలో కీలక పదవిలో పనిచేశారు. ప్రస్తుతం విజయవాడ గవర్నర్‌ బంగ్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన వీఎంఆర్‌డీఏ సెక్రటరీ పోస్టు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే క్రీడల శాఖకు చెందిన అధికారి ఒకరు కొంతకాలంగా జీవీఎంసీలో వివిధ కీలక పోస్టులు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతల తలలో నాలికలా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఈ పోస్టుపై కన్నేశారు. ఇటీవల బదిలీల్లో విశాఖపట్నం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన అధికారులు కూడా కుటుంబ అవసరాలను చూపిస్తూ తిరిగి వచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే వీఎంఆర్‌డీఏలో పోస్టు కావాలంటే...ఎవరైనా సరే విజయవాడ వెళ్లి పురపాలక శాఖ పేషీలో మాట్లాడుకోవాల్సిసిందేనని  అంటున్నారు. వీఎంఆర్‌డీఏ ఇటీవల భారీమొత్తంలో ప్రాజెక్టులను భుజాన వేసుకుంటోంది. అందులోను ముఖ్యంగా బల్క్‌ ల్యాండ్‌ ఆన్‌లైన్‌ విక్రయాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో సెక్రటరీ పోస్టుకు డిమాండ్‌ బాగా పెరిగింది. అనేక వ్యవహారాలు నడిపే అవకాశం వుండడంతో ఎలా అయినా ఇక్కడకు రావాలని పలువురు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-16T07:06:40+05:30 IST