స్వచ్ఛంద బంద్‌

Sep 28 2021 @ 00:49AM
ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ, వామపక్షాలు, రైతు, ప్రజా సంఘాల నాయకులు

కేంద్ర విధానాలపై వెల్లువెత్తిన నిరసన

ఎక్కడికక్కడ రాస్తారోకోలు, భారీ ర్యాలీలు

నిలిచిన ఆర్టీసీ బస్సులు, మూతపడిన విద్యాసంస్థలు

వ్యాపార కార్యకలాపాలు, కార్యాలయాల్లో పనులకు ఆటంకం

మద్దతుగా పాల్గొన్న టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు

ప్రభుత్వ సంఘీభావంతో ప్రశాంతంగా సాగిన కార్యక్రమం

జిల్లాలో భారత్‌ బంద్‌ విజయవంతమైంది. సంపూర్ణంగా, ప్రశాంతంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ వివిధ సంఘాలు, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించాయి. సోమవారం మధ్యాహ్నం వరకు జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపేశారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక వ్యాపారులు మధ్యాహ్నం వరకు తమ దుకాణాలను  స్వచ్ఛందంగా మూసివేశారు. వివిధ సంఘాలు, పార్టీల కార్యకర్తలు  బంద్‌కు సంఘీభావంగా ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో వామపక్షాలు, రైతుసంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు కలెక్టరేట్‌   వద్ద నిరసన తెలిపారు.

ఒంగోలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌ సోమవారం జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. కేంద్రప్రభుత్వ విధానాలు ప్రత్యేకించి నూతన సాగుచట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాల శ్రేణులు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. నూతన సాగుచట్టాలు రద్దు కోరుతూ ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభావంతోపాటు, కార్మిక చట్టాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు, కార్మిక ప్రజాసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించాయి. రైతు, కార్మిక ఇతర ప్రజాసంఘాలతోపాటు వామపక్షాల తొలి నుంచి బంద్‌కు మద్దతు తెలిపి నిర్వహణలో ముందుండగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా సంఘీభావం ప్రకటించింది. అలాగే రాష్ట్రప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది.  ఆయా ప్రాంతాల్లో వివిధ సంఘాల, పార్టీల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలు, బ్యాంకులు, బీమా, పోస్టల్‌ కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలను మూసేయించారు. కొన్నిప్రాంతాల్లో పాక్షికంగా పనిచేశాయి.  


ఒంగోలులో భారీ ర్యాలీ

జిల్లాకేంద్రమైన ఒంగోలులో కర్నూలు రోడ్డు ప్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బంద్‌ను ఆయా సంఘాల నేతలు పర్యవేక్షించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, వామపక్షాల జిల్లా నాయకులు పూనాటి ఆంజనేయులు, ఎంఎల్‌ నారాయణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, రైతుసంఘాల నాయకులు చుంచు శేషయ్య, హనుమారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, తెలుగు మహిళా నాయకురాలు రావుల పద్మజ, తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు నేతృత్వంలో పలువురు జర్నలిస్టులు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా జరిగింది. అలాగే జిల్లాలో ప్రధాన పట్టణాలైన చీరాల, మార్టూరు, పర్చూరు, అద్దంకి, చీమకుర్తి, కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి, వైపాలెం, మార్కాపురం, కంభం, గిద్దలూరులతో పాటు పలు మండలకేంద్రాల్లో స్థానిక రైతులు, పార్టీలు, ప్రజాసంఘాల కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం తమ విధానాలను మార్చుకొని తక్షణం నూతన సాగుచట్టాలు, కార్మిక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లోనే కాక జిల్లాలోని పలుచోట్ల గ్రామాల్లో సైతం స్థానికంగా ఎక్కడిక్కడ రైతులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. పర్చూరు మార్టూరు, అద్దంకి, చీరాల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పటికీ బంద్‌ను కొనసాగించారు. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.