స్వచ్ఛంద కట్టడి

ABN , First Publish Date - 2021-05-09T05:38:22+05:30 IST

కరోనా విలయతాండవాన్ని నియంత్రించాలంటే స్వచ్ఛందబంద్‌ను పాటించడం ఒక్కటే గత్యంతరంగా మారింది. లాక్‌డౌన్‌ అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ను ఆచరిస్తున్నారు. తీర్మానాలను ప్రవేశపెట్టి ముందు జాగ్రత్తగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

స్వచ్ఛంద కట్టడి
నారాయణరావుపేటలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిర్మానుష్యంగా వీధులు

పలుచోట్ల స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌

కరోనా నియంత్రణకు గ్రామాల్లో నిర్ణయం

వ్యాపారం, సంతల నిర్వహణపై ఆంక్షలు

ఓ వైపు కర్ఫ్యూ.. మరోవైపు బంద్‌



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 8 : కరోనా విలయతాండవాన్ని నియంత్రించాలంటే స్వచ్ఛందబంద్‌ను పాటించడం ఒక్కటే గత్యంతరంగా మారింది. లాక్‌డౌన్‌ అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ను ఆచరిస్తున్నారు. తీర్మానాలను ప్రవేశపెట్టి ముందు జాగ్రత్తగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఓవైపు ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూను పాటిస్తూనే.. మరోవైపు స్వచ్ఛంద కట్టడి నిర్ణయాలను కఠినంగా ఆచరించేలా ప్రజల్లో మార్పు తెస్తున్నారు. 

సిద్దిపేట జిల్లా ప్రస్తుతం కరోనా కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. కొవిడ్‌ టెస్టుల్లో 30 శాతం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అన్ని గ్రామాలు, పట్టణాలు, వీధులు, అపార్ట్‌మెంట్లలో కరోనా సోకని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. తప్పని పరిస్థితుల్లో బయటకెళ్లడానికే ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రభుత్వమే లాక్‌డౌన్‌ విధిస్తే మరింత కట్టడి ఉంటుందని భావిస్తున్నారు. అది సాధ్యం కాకపోవడంతో ఎవరికివారే స్వయంప్రకటిత లాక్‌డౌన్‌ను విధించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, ఇతర అసోసియేషన్లు తమకు తాము హద్దులు గీసుకుంటున్నారు. 


ఎక్కడికక్కడ స్వయం ప్రకటిత బంద్‌ 

స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ విధించుకొని.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్న పరిస్థితి చాలా చోట్ల నెలకొన్నది. గ్రామాల్లో ఈ హెచ్చరికలను కఠినంగా ఆచరిస్తున్నారు. పలుచోట్లా గడిచిన వారం రోజులుగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. 

-గజ్వేల్‌ మండలం కొడకండ్లలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. 

-చేర్యాల పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి పూర్తిగా బంద్‌ పాటిస్తున్నారు.

-కొమురవెల్లిలో దుకాణాలు పూర్తిగా బంద్‌ చేశారు. రసూలాబాద్‌ గ్రామంలో ఉదయం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు.

-మండల కేంద్రమైన కోహెడతోపాటు తంగళ్లపల్లి, కూరెళ్ల, బస్వాపూర్‌ గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు షాపులను మూసివేస్తున్నారు. 

-కొండపాకలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. ఇదే మండలం మంగోల్‌లో దుకాణాలను పూర్తిగా బంద్‌ చేశారు. 

-నారాయణరావుపేటతోపాటు మండలంలోని జక్కాపూర్‌ గ్రామంలో స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నారాయణరావుపేటలో మధ్యాహ్నం 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు, జక్కాపూర్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. 

-దౌల్తాబాద్‌లో సాయంత్రం 3 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉండేలా తీర్మానం చేశారు.

-వర్గల్‌ మండలం గౌరారంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుతుండగా.. నెంటూరులో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. 

-బెజ్జంకి మండల కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల దాకా లాక్‌డౌన్‌ ఉంటున్నది. 

-హుస్నాబాద్‌ పట్టణంలోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. 

-దూళిమిట్ట మండలం జాలపల్లి, దూళిమిట్ట గ్రామాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే షాపులను తెరిచి ఉంచుతున్నారు. 

-మర్కుక్‌ మండలంలోని పాములపర్తి, ఎర్రవల్లి గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. 

-జగదేవపూర్‌ మండలంలోని అనంతసాగర్‌లో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు దుకాణాలు ఓపెన్‌ చేస్తున్నారు. 


కలవరపెడుతున్న మరణాలు

కరోనా కారణంగా కళ్లెదుట కదలాడినవారిలో చాలా మంది కనుమరుగయ్యారు. వారం గడిచేసరికి మృతుల లెక్కలను చూసి విలపించాల్సి వస్తున్నది. సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గడిచిన వారం రోజులుగా మరణాలు లేని రోజంటూ లేదు. ఇక హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ జిల్లావాసులు కూడా నిత్యం ఐదు మందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు. గడిచిన వారం రోజుల పరిస్థితిని పరిశీలిస్తే.. గజ్వేల్‌ మండలంలో 15 మంది, చేర్యాలలో 8, అక్కన్నపేటలో 4, తొగుటలో 6, మిరుదొడ్డిలో 6, సిద్దిపేట అర్బన్‌లో 4, కోహెడలో 3, కొండపాకలో 11, చిన్నకోడూరులో 2, సిద్దిపేట రూరల్‌లో 6, నారాయణరావుపేటలో 5, దౌల్తాబాద్‌లో 2, రాయపోల్‌లో 2, వర్గల్‌లో 6, బెజ్జంకిలో 4, హుస్నాబాద్‌లో 4, మర్కూక్‌లో 2, జగదేవపూర్‌లో 4, మద్దూరులో 2, దుబ్బాకలో 10 మంది చనిపోయారు. ఇవి కాకుండా అనధికారికంగా మరణించేవారి సంఖ్య బయటకు రావడం లేదు.  కానీ నిత్యం శ్మశానాల్లో కరోనాతో మరణించి కాలుతున్న శవాల సంఖ్యకు కూడా లెక్కలేకుండా పోతున్నది. 

Updated Date - 2021-05-09T05:38:22+05:30 IST