వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి: మాజీ విప్‌ కూన రవికుమార్‌

ABN , First Publish Date - 2020-08-07T18:37:05+05:30 IST

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఈతకాయ ఇచ్చి... గుమ్మడికాయలను..

వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి: మాజీ విప్‌ కూన రవికుమార్‌

శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఈతకాయ ఇచ్చి... గుమ్మడికాయలను సీఎం తీసేసుకుంటున్నారని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పేదలకు ఇళ్లపట్టాల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. అరాచకాలకు మారు పేరుగా వలంటీర్ల వ్యవస్థ నిలుస్తోంది.


ఎర్రచందనం తరలింపు నుంచి, సారా తయారీ, మహిళలపై అఘాయిత్యాలు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా, పుస్తెల తాడు చోరీ.. ఇలాంటి ఘటనల్లో వలంటీర్లే ఎక్కువగా ఉన్నారు. ఇదొక రౌడీ వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. పలాస కాశీబుగ్గలో ఇళ్ల పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న దళితుడి సమస్య వినకుండానే సీఐ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడివారిపై చర్యల్లేవు. గిరిజన మహిళపై తన భర్త కళ్లఎదుటే మృగాళ్లు బలత్కరించినా ....ఆమెకు న్యాయం జరగలేదు.


మాస్క్‌ అడిగినందుకు ఓ డాక్టర్‌ని పిచ్చోడిని చేశారు. మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో మరో దళిత యువకుడ్ని పోలీసులే కొట్టి చంపారన్న ఆధారాలు ఆ కుటుంబ సభ్యులే బయటపెట్టారు. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోలీసులు ఇలా మారిపోతున్నారు. చట్టానికి పోలీసులు అతీతులుకారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని కూన రవికుమార్‌ వ్యాఖ్యానించారు. పలాస కాశీబుగ్గలో అన్ని అర్హతలు ఉన్న దరఖాస్తును తిరస్కరించినందుకు సంబంధిత వలంటీరు, సచివాలయ సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతికి చిహ్నంగా మారిన వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలిపారు.  


Updated Date - 2020-08-07T18:37:05+05:30 IST